Advertisement
Advertisement
Abn logo
Advertisement

అరబిందో ఫార్మా లాభం రూ.5,335 కోట్లు

  • వార్షిక ప్రాతిపదికన 87శాతం వృద్ధి
  • క్యూ4లో  రూ.802 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొత్తానికి అరబిందో ఫార్మా నికర లాభం ఆకర్షణీయంగా పెరిగినప్పటికీ.. చివరి త్రైమాసికానికి తగ్గింది. మార్చితో ముగిసిన మూడు నెలలకు ఏకీకృత ప్రాతిపదికన రూ.802 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.864 కోట్లతో పోలిస్తే 7.2 శాతం తగ్గిం ది. మొత్తం ఏడాది (2020-21)కి మాత్రం లాభం 87.5 శాతం వృద్ధితో రూ.2,845 కోట్ల నుంచి రూ.5,335 కోట్లకు చేరిందని అరబిందో ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ గోవింద రాజన్‌ తెలిపారు. చివరి త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం 2.5 శాతం తగ్గి రూ.6,158 కోట్ల నుంచి రూ.6,001 కోట్లకు పరిమితమైతే.. మొత్తం ఏడాదికి 7.3 శాతం వృద్ధితో రూ.23,098 కోట్ల నుంచి రూ.24,775 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్షా త్రైమాసికానికి అమెరికా ఫార్ములేషన్ల ఆదాయం 4.5 శాతం తగ్గి రూ.2,856 కోట్లకు పరిమితమైంది. ఏడాది మొత్తానికి 7.3 శాతం పెరుగుదలతో రూ.12,324 కోట్లకు చేరింది.  

అనుబంధ కంపెనీ వాటాల బదిలీ: నూరు శాతం సొంత అనుబంధ సంస్థయిన ఆరో క్యూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో వాటాలను మరో అనుబంధ సంస్థ యూగియా ఫార్మా స్పెషాలిటీ్‌సకు అరబిదో ఫార్మా బదిలీ చేస్తోంది. ఆరో క్యూర్‌ను ఇటీవల ఏర్పాటు చేసింది. అలానే జీడిమెట్ల మండలం పోలేపల్లిలోని యూనిట్‌ 16ను సొంత అనుబంధ కంపెనీ వైటెల్స్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బదిలీ చేస్తోంది. కాగా జూన్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఎన్‌ గోవిందరాజన్‌ను ఎండీగా మరో మూడేళ్లు బోర్డు తిరిగి నియమించింది. కే నిత్యానంద రెడ్డిని పూర్తికాల డైరెక్టర్‌గా మరో మూడేళ్లు నియమించారు. డిజిగ్నేటెడ్‌ వైస్‌ చైర్మన్‌గా కూడా బోర్డు నియమించింది. 


Advertisement
Advertisement