అరబిందో నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-08-08T06:32:46+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌ కంపెనీల జాబితాలో మరో కంపెనీ చేరనుంది. హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనుంది...

అరబిందో నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌

  •  ట్రయల్స్‌కు బయోటెక్నాలజీ విభాగం నిధులు
  •  మరిన్ని బ్యాక్టీరియల్‌, వైరల్‌ టీకాల అభివృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌ కంపెనీల జాబితాలో మరో కంపెనీ చేరనుంది. హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని బయోటెక్నాలజీ విభాగం (బీఐఆర్‌ఏసీ) ప్రయోగ దశలో ఉన్న అరబిందో ఫార్మా వ్యాక్సిన్‌ను పనితీరును అంచనా వేసింది.


భారత్‌లో మొదటి, రెండో దశ ట్రయల్స్‌ను నిర్వహించడానికి అవసరమైన నిధులను సమకూర్చడానికి కంపెనీ వ్యాక్సిన్‌ను బీఐఆర్‌ఏసీ ఎంపిక (షార్ట్‌లిస్ట్‌) చేసిందని అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ, ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ కంపెనీలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియలో ఉన్నాయి. అరబిందో మరిన్ని బ్యాక్టీరియల్‌, వైరల్‌ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉంది. సంయుక్త సంస్థ టెర్‌జీన్‌ బయోటెక్‌ ద్వారా న్యూమోకోకల్‌ కాంజుకేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ)ని అభివృద్ధి చేస్తోందని అరబిందో ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ గోవిందరాజన్‌ తెలిపారు. దీన్ని 2021-22లో మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సొంత అనుబంధ సంస్థ ‘అరో వ్యాక్సిన్స్‌’ ద్వారా వైరల్‌ వ్యాక్సిన్లను అరబిందో అభివృద్ధి చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రొఫెక్టస్‌ బయోసైన్సె స్‌కు చెందిన పరిశోధన, అభివృద్ధి సదుపాయాలను అరో వ్యాక్సిన్స్‌  కొనుగోలు చేసింది. తద్వారా వ్యాక్సిన్ల విభాగంలో మరింత బలోపేతం కావాలని కంపెనీ భావిస్తోంది. వ్యాక్సిన్ల తయారీకి గత ఆర్థిక సంవత్సరంలో బ్యాక్టీరియాను తయారు చేసే సదుపాయాన్ని కంపెనీ ప్రారంభించింది. 


విశాఖలో ఇంజెక్షన్ల తయారీ యూనిట్‌: కంపెనీకి చెందిన వివిధ సదుపాయాల్లో నోటి ద్వారా తీసుకునే ఔషధాలు, ఇంజెక్షన్లు, ఏపీఐల తయారీ సామర్థ్యాలను అరబిందో పెంచింది. అమెరికాలో ఇంజెక్టబుల్స్‌, ప్యాచెస్‌, ఇన్‌హేలర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. చైనాలో నోటి ద్వారా తీసుకునే ఔషధాలను ఉత్పత్తి చేసేందుకు తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. చైనాలో తయారయ్యే ఔషధాలు, చైనాతో పాటు అమెరికా, యూరప్‌ అవసరాలను తీరుస్తాయి. బయోసిమిలర్లు, వ్యాక్సి న్ల తయారీ యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓరల్‌ సాలిడ్లను ఉత్పత్తి చేసే యూనిట్‌ 15లో నెలవారీ తయారీ సామర్థ్యం 40-45 కోట్ల టాబ్లెట్లు ఉండగా.. దీన్ని 75 కోట్లకు పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఆ తర్వాత 100 కోట్లకు పెంచుతుంది. యూరప్‌, వర్థమాన దేశాల మార్కెట్ల కోసమే తయారు చేయడానికి విశాఖపట్నంలో అత్యాధునిక ఇంజెక్షన్ల తయారీ యూనిట్‌ను ఏర్పా టు చేయాలని నిర్ణయించింది. 

ఈ ఏడాదీ కొన్ని వ్యాపారాలపై ప్రభావం: గత ఆర్థిక సంవత్సరం కొవిడ్‌ కంపెనీపై ప్రభావాన్ని చూపినప్పటికీ.. కంపెనీ సిబ్బంది అవరోధాలను అధిగమించగలిగారని గోవిందరాజన్‌ తెలిపారు.  ఆసుపత్రులకు వచ్చే ఇన్‌ పేషంట్‌ రోగులు తగ్గడం వల్ల జనరిక్‌ ఇంజెక్టబుల్స్‌ వంటి అమ్మకాలపై ప్రభావం పడింది. కొన్ని విభాగాల్లో అమ్మకాలు తగ్గినప్పటికీ.. ఇతర విభాగాల్లో పెరిగాయని ఆయన వివరించారు. 2020-21లో కూడా కొన్ని వ్యాపారాలపై ప్రభావం ఉండగలదని భావిస్తున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-08T06:32:46+05:30 IST