జడ్డూ తిప్పేశాడు

ABN , First Publish Date - 2021-01-09T10:35:20+05:30 IST

తొలి రోజు తేలిపోయిన భారత బౌలర్లు.. శుక్రవారం ఆటలో గాడిన పడ్డారు. బ్యాటింగ్‌ ట్రాక్‌ అయినప్పటికీ ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేయగలిగారు. క్రీజులో నిలదొక్కుకుంటానని చెప్పి మరీ ఆడిన స్టీవ్‌ స్మిత్‌ కెరీర్‌లో 27వ శతకం నమోదు చేయగా.. లబుషేన్‌ కూడా ధాటిని కనబరిచాడు.

జడ్డూ తిప్పేశాడు

  • ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌ 338
  • స్మిత్‌ శతకం
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 96/2
  • గిల్‌ అర్ధశతకం


తొలి రోజు తేలిపోయిన భారత బౌలర్లు.. శుక్రవారం ఆటలో గాడిన పడ్డారు. బ్యాటింగ్‌ ట్రాక్‌  అయినప్పటికీ ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేయగలిగారు. క్రీజులో నిలదొక్కుకుంటానని చెప్పి మరీ ఆడిన  స్టీవ్‌ స్మిత్‌ కెరీర్‌లో 27వ శతకం నమోదు చేయగా.. లబుషేన్‌ కూడా ధాటిని కనబరిచాడు. ఓ దశలో 206/2తో పటిష్టంగా కనిపించిన ఆసీస్‌ సునాయాసంగా 450+ స్కోరు చేయడం ఖాయమే అనిపించింది. కానీ పిచ్‌ నుంచి ఎలాంటి టర్న్‌ లభించకపోయినా రవీంద్ర జడేజా అద్భుతం చేశాడు. నాలుగు వికెట్లతో పాటు స్మిత్‌ను మెరుపు రనౌట్‌ చేసి ఆసీ్‌సను చావుదెబ్బ తీశాడు. ఆ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ అర్ధ సెంచరీతో భారత్‌ దీటుగానే బదులిస్తోంది.


సిడ్నీ: కాస్త ఆలస్యమైనా.. భారత బౌలర్లు తమ సత్తా ప్రదర్శించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా దూకుడుకు అడ్డుకట్ట వేశారు. వీరి జోరుకు స్టీవ్‌ స్మిత్‌ (226 బంతుల్లో 16 ఫోర్లతో 131), లబుషేన్‌ (196 బంతుల్లో 11 ఫోర్లతో 91) మినహా మరెవరూ క్రీజులో నిలవలేకపోయారు. జడేజా (4/62) ఆసీస్‌ పతనాన్ని శాసించగా బుమ్రా (2/66), సైనీ (2/65) సహకరించారు. దీంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ఆచితూచి ఆడుతోంది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సరికి 45 ఓవర్లలో 2 వికెట్లకు 96 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (101 బంతుల్లో 8 ఫోర్లతో 50) కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించాడు. క్రీజులో పుజార (9 బ్యాటింగ్‌), రహానె (5 బ్యాటింగ్‌) ఉన్నారు. మూడోరోజు ఆట భారత్‌కు కీలకం కానుంది.


వర్షం.. వికెట్లు: తొలి సెషన్‌లో రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించగా.. అటు భారత బౌలర్లు మూడు వికెట్లను పడగొట్టారు. అయితే తొలి గంటపాటు స్మిత్‌, లబుషేన్‌ దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. స్మిత్‌ను అవుట్‌ చేసేందుకు లెగ్‌ సైడ్‌ భారీగా ఫీల్డింగ్‌ను ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదు. వారి వ్యూహాన్ని వమ్ము చేస్తూ కళ్లు చెదిరే స్ట్రోక్‌తో స్మిత్‌ బౌండరీలతో సమాధానమిచ్చాడు. మరోవైపు సెంచరీకి మరో 9 పరుగుల దూరంలో లబుషేన్‌ను జడేజా అవుట్‌ చేశాడు. స్లిప్‌లో రహానెకు సులువైన క్యాచ్‌ ఇవ్వడంతో మూడో వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కాసేపటికే వేడ్‌ (13)ను కూడా జడ్జూ పెవిలియన్‌ చేర్చాడు. ఇక, రెండో కొత్త బంతితో గ్రీన్‌ను బుమ్రా డకౌట్‌ చేశాడు. 


స్మిత్‌ శతకం: ఓ వైపు వికెట్లు పడుతున్నా స్మిత్‌ మాత్రం పోరాటం ఆపలేదు. మరోవైపు జడేజా, బుమ్రా ధాటికి చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ పెయిన్‌ (1), కమిన్స్‌ (0), లియాన్‌ (0) స్వల్పతేడాతో పెవిలియన్‌కు చేరారు. అయితే ఈ దశలో స్మిత్‌కు అండగా మిచెల్‌ స్టార్క్‌ (24) నిలిచాడు. ఈ సమయంలో స్మిత్‌ ఎక్కువగా స్ట్రయిక్‌ తీసుకుంటూ చకచకా సెంచరీ వైపు సాగాడు. చివరకు 98వ ఓవర్‌లో మూడంకెల స్కోరు సాధించి నూతన ఏడాదిని అద్భుతంగా ఆరంభించాడు. అయితే సైనీ బౌలింగ్‌లో సిక్సర్‌తో ఊపు మీద కనిపించిన స్టార్క్‌ అతడికే చిక్కాడు. ఆఖర్లో స్మిత్‌ను జడేజా రనౌట్‌ చేయడంతో ఆసీస్‌ ఆట ముగిసింది.


గిల్‌ అదుర్స్‌: భారత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు గిల్‌, రోహిత్‌ శర్మ (77 బంతుల్లో 3 ఫోర్లు ఓ సిక్సర్‌తో 26) శుభారంభం అందించారు. టీ బ్రేక్‌కు 26 పరుగులతో వెళ్లిన ఈ జోడీ ఆ తర్వాత సంయమనంతో ఆడి తొలి వికెట్‌కు 70 పరుగులు అందించింది. 27వ ఓవర్‌లో హాజిల్‌వుడ్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ అవుటయ్యాడు. అటు లియాన్‌ ఓవర్‌లో కవర్‌ డ్రైవ్స్‌తో ఆకట్టుకున్న గిల్‌.. కమిన్స్‌ బంతులను డిఫెన్స్‌తో అడ్డుకున్నాడు. అయితే సరిగ్గా 100 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ఈ యువ ఓపెనర్‌ అదే స్కోరు వద్ద అవుటయ్యాడు. అనంతరం పుజార, రహానె వికెట్‌ను కోల్పోకూడదనే లక్ష్యంతో అతి జాగ్రత్తను కనబరిచారు. దీంతో 77 బంతుల్లో మూడో వికెట్‌కు అజేయంగా 11 పరుగులు మాత్రమే అందించారు.


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: పకోస్కీ (ఎల్బీ) సైనీ 62; వార్నర్‌ (సి) పుజార (బి) సిరాజ్‌ 5; లబుషేన్‌ (సి) రహానె (బి) జడేజా 91; స్మిత్‌ (రనౌట్‌) 131; వేడ్‌ (సి) బుమ్రా (బి) జడేజా 13; గ్రీన్‌ (ఎల్బీ) బుమ్రా 0; పెయిన్‌ (బి) బుమ్రా 1; కమిన్స్‌ (బి) జడేజా 0; స్టార్క్‌ (సి) గిల్‌ (బి) సైనీ 24; లియాన్‌ (ఎల్బీ) జడేజా 0; హాజెల్‌వుడ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 105.4 ఓవర్లలో 338 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-6, 2-106, 3-206, 4-232, 5-249, 6-255, 7-278, 8-310, 9-315, 10-338. బౌలింగ్‌: బుమ్రా 25.4-7-66-2; సిరాజ్‌ 25-4-67-1; అశ్విన్‌ 24-1-74-0; సైనీ 13-0-65-2; జడేజా 18-3-62-4.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి అండ్‌ బి) హాజెల్‌వుడ్‌ 26; గిల్‌ (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 50; పుజార (బ్యాటింగ్‌) 9; రహానె (బ్యాటింగ్‌) 5; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 45 ఓవర్లలో 96/2. వికెట్ల పతనం: 1-70, 2-85. బౌలింగ్‌: స్టార్క్‌ 7-4-19-0; హాజెల్‌వుడ్‌ 10-5- 23-1; కమిన్స్‌ 12-6-19-1; లియాన్‌ 16-7-35-0.


ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి వంద సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. 




16 నెలల తర్వాత..

కొత్త ఏడాదిని స్టీవ్‌ స్మిత్‌ అదిరిపోయేలా ఆరంభించాడు. బ్యాటింగ్‌లో విఫలమవుతున్న అతడు సొంత మైదానంలో 131 పరుగులతో రాణించాడు. ఈ సెంచరీ అతడి కెరీర్‌లో 27వది. దీంతో విరాట్‌ కోహ్లీతో సమంగా నిలిచాడు. అలాగే 2019 సెప్టెంబరులో డబుల్‌ సెంచరీ తర్వాత స్మిత్‌కిదే మూడంకెల స్కోరు. ఈ సిరీ్‌సలో ఆడిన రెండు టెస్టుల్లో స్మిత్‌ 1,1,0,8తో నిరాశపరిచాడు. ఇక యాషెస్‌ సిరీ్‌సను మినహాయిస్తే 22 ఇన్నింగ్స్‌ల తర్వాత స్మిత్‌కిదే తొలి సెంచరీ. 2017లో ధర్మశాలలో చివరిసారిగా 111 పరుగులు చేశాడు. మరోవైపు భారత్‌పై ఎక్కువ (8) సెంచరీలు చేసిన సోబర్స్‌, రిచర్డ్స్‌, పాంటింగ్‌ల సరసన నిలిచాడు. అయితే స్మిత్‌ 25 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ సాధించడం విశేషం.


‘పాంచ్‌’ పటాకా!

సిసలైన ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న జడేజా మూడో టెస్టులోనూ తడాఖా చూపిస్తున్నాడు. రెండో రోజు ఆటలో అతడు నాలుగు వికెట్లతో దెబ్బతీయగా.. చివర్లో స్మిత్‌ను కూడా తనే ఓ సూపర్‌ త్రోతో రనౌట్‌ చేశాడు. చేతిలో వికెట్లేమీ లేకపోవడంతో స్మిత్‌ జోరుగా ఆడే ప్రయత్నం చేశాడు. దీంట్లో భాగంగా బుమ్రా ఓవర్‌లో అతడి బ్యాట్‌కు తాకిన బంతి స్క్వేర్‌ లెగ్‌ వైపు వెళ్లింది. అయితే సింగిల్‌ పూర్తి చేసిన స్మిత్‌ మరో రన్‌ కోసం హాజెల్‌వుడ్‌ను పిలిచాడు. కానీ అప్పటికే బౌండరీ లైన్‌ నుంచి పరిగెత్తుకొచ్చి బంతిని తీసుకున్న జడ్డూ మెరుపు వేగంతో కీపర్‌ ఎండ్‌ వైపు విసిరాడు. అది నేరుగా వికెట్లను తాకడంతో స్మిత్‌ జోరు ముగిసి ఆసీస్‌ కూడా ఆలౌటైంది. దీంతో జడేజా ఓ రకంగా ఐదు వికెట్లు తీసినట్టయింది. ఇదిలావుండగా ఈ రనౌట్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌గా జడ్డూ చెప్పాడు. 30 గజాల ఆవల నుంచి విసిరిన ఈ త్రోను రీప్లే ద్వారా మరోసారి చూసుకుంటానని తెలిపాడు.

Updated Date - 2021-01-09T10:35:20+05:30 IST