మా దృష్టి మరల్చి.. గెలిచారు!

ABN , First Publish Date - 2021-05-14T10:06:31+05:30 IST

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా నాలుగు టెస్టుల సిరీ్‌సను అత్యద్భుత ఆటతీరుతో గెలిచిన విషయాన్ని ఏ అభిమానీ అంత సులువుగా మర్చిపోడు.

మా దృష్టి మరల్చి.. గెలిచారు!

భారత్‌ టెస్టు సిరీస్‌ విజయంపై టిమ్‌ పైన్‌


సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా నాలుగు టెస్టుల సిరీ్‌సను అత్యద్భుత ఆటతీరుతో గెలిచిన విషయాన్ని ఏ అభిమానీ అంత సులువుగా మర్చిపోడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైనా.. కీలక బ్యాట్స్‌మెన్‌.. బౌలర్లు గాయాలతో దూరమైనా ఎలాంటి బెరుకూలేకుండా భారత జట్టు పోరాడింది. చివరికి అజింక్యా రహానె నేతృత్వంలో భారత జట్టు 2-1 తేడాతో సగర్వంగా సిరీ్‌సను కాపాడుకుంది. ఈ క్రమంలో జట్టులో కొత్తగా చోటు దొరికిన ఆటగాళ్లు కూడా విశేషంగా రాణించారు. అయితే వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఇన్నాళ్లకు ఆ సిరీస్‌ గురించి వింత వాదన తెరపైకి తెచ్చాడు. అసలు భారత జట్టు తమ దృష్టిని మళ్లించడంతోనే గెలిచిందని సెలవిచ్చాడు. ఇలా పక్కదారి పట్టించడంలో ఆ జట్టు స్పెషలిస్ట్‌ అంటూ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ప్రత్యర్థి జట్లను మాటలతో ఏమార్చి, వారి ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ.. మ్యాచ్‌ల్లో పైచేయి సాధించడం ఆస్ట్రేలియన్లకు వెన్నతో పెట్టిన విద్య. స్లెడ్జింగ్‌కు దిగడం వారికి అత్యంత సహజం.


ఇది సరిపోదన్నట్టు వారి మీడియా మరో అడుగు ముందే ఉండి వ్యతిరేక కథనాలు వండి వారుస్తుంటుంది. ‘భారత్‌ తమ చేష్టలతో మమ్మల్ని పక్కదారి పట్టించింది. అనవసరమైన విషయాలతో దృష్టి మళ్లించింది. ఆ సిరీ్‌సలో మేం ఓ దశలో వారి వలలో పడిపోయాం. దీనికి ఉదాహరణగా ఓ విషయం చెబుతాను. ముందు గాబాలో కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి నాలుగో టెస్టు కోసం మేం అక్కడికి వెళ్లి ఆడలేమని భారత జట్టు గట్టిగా చెప్పింది. దీంతో ఆ టెస్టు ఎక్కడ జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో మా జట్టు ఉండిపోయింది. ఇంతలోనే మనసు మార్చుకుని అక్కడే ఆడతామని చెప్పింది. ఇలా మా ఏకాగ్రతను దెబ్బతీయడంతో బంతిపై సరిగా దృష్టి పెట్టలేకపోయాం’ అంటూ టిమ్‌ పైన్‌ వితండ వాదనకు దిగాడు. మరోవైపు సోషల్‌ మీడియాలో మాత్రం పైన్‌పై ట్రోలింగ్‌ కొనసాగుతోంది. ‘మీరు చేసే చీటింగ్‌లో మేమెంత.. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు.. సిరీస్‌ ముగిసిన వెంటనే ఈ కామెంట్స్‌ ఎందుకు చేయలేదం’టూ ప్రశ్నిస్తున్నారు.


యాషెస్‌ తర్వాత వైదొలుగుతా..

ఈ ఏడాది ఆస్ట్రేలియా జట్టు యాషెస్‌ సిరీస్‌ గెలిచాక టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగే అవకాశం ఉందని టిమ్‌ పైన్‌ తెలిపాడు. భారత్‌తో టెస్టు సిరీ్‌సను కోల్పోయాక అతడి నాయకత్వంపై విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్‌ను 0-5తో ఓడించాక టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగేందుకు సరైన సమయం అనుకుంటానని చెప్పాడు. అలాగే స్మిత్‌కు మరోసారి పగ్గాలు అప్పగిస్తే బావుంటుందని అ న్నాడు.

Updated Date - 2021-05-14T10:06:31+05:30 IST