ఫేస్‌బుక్ దెబ్బకు తలొగ్గిన ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2021-02-23T18:13:58+05:30 IST

ఫేస్‌బుక్ ముందు ఆస్ట్రేలియా ప్రభుత్వం తలొగ్గింది. న్యూస్ ఏజెన్సీల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో ఆస్ట్రేలియా న్యూస్ ఏజెన్సీలకు చెందిన వార్తలపై నిషేదాన్ని ఎత్తేస్తామని, త్వరలో మళ్లీ తమ సైట్‌లో..

ఫేస్‌బుక్ దెబ్బకు తలొగ్గిన ఆస్ట్రేలియా

ఇంటర్నెట్ డెస్క్: ఫేస్‌బుక్ ముందు ఆస్ట్రేలియా ప్రభుత్వం తలొగ్గింది. న్యూస్ ఏజెన్సీల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో ఆస్ట్రేలియా న్యూస్ ఏజెన్సీలకు చెందిన వార్తలపై నిషేదాన్ని ఎత్తేస్తామని, త్వరలో మళ్లీ తమ సైట్‌లో వార్తలు కనిపిస్తాయని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గూగుల్, ఫేస్‌బుక్ వంటి మీడియా సంస్థలు తమ దేశంలోని వార్తా సంస్థలకు చెందిన వార్తలను ప్రచురించినందుకు సదరు సంస్థలు వారికి చెల్లింపులు చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. దానికోసం ఓ చట్టాన్ని సైతం తీసుకొచ్చింది.


ఆస్ట్రేలియా తెచ్చిన చట్టాన్ని గూగుల్, ఫేస్‌బుక్‌లు అంగీకరించలేదు. అవసరమైతే తమ సేవలను పూర్తిగా ఆస్ట్రేలియా నుంచి తొలగిస్తామని, అంతేకానీ ఇలా చెల్లింపులు చేయడం తమకు సాధ్యం కాదని రెండు సంస్థలూ తెలిపాయి. ఇటీవలే ఫేస్‌బుక్ తమ సైట్‌లో ఆస్ట్రేలియా వార్తలను కనిపించకుండా నిషేధం విధించింది. ఫేస్‌బుక్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. 


ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దిగొచ్చిన ప్రభుత్వం ఆ సంస్థను చర్చలకు ఆహ్వానించింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మరోసారి ఫేస్‌బుక్ ప్రతినిధులను చర్చలు జరిపారు. అనంతరం మీడియా చట్టాన్ని సవరించడానికి అంగీకరించారు. దీంతో ఫేస్‌బుక్ కూడా న్యూస్ పేజీలపై నిషేధం తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఈస్టన్ తెలిపారు. ఆ సంస్థ తమకు మళ్లీ ఫ్రెండ్ అయిందని ప్రధాని మోరిసన్ చెప్పారు.


ఇదిలా ఉంటే గూగుల్ మాత్రం ఇప్పటికే ఆస్ట్రేలియాలోని చిన్న చిన్న సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం న్యూస్ షోకేస్ అనే ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. వార్తా సంస్థలు పోస్ట్ చేసే వార్తలన్నీ ఇందులో కనిపించేలా విధానాలను రూపొందించింది.

Updated Date - 2021-02-23T18:13:58+05:30 IST