ఆస్ట్రేలియా మంత్రి కీలక వ్యాఖ్యలు.. విమాన సర్వీసులు ఈ ఏడాది కష్టమేనా!

ABN , First Publish Date - 2021-05-07T20:38:59+05:30 IST

భారత్ సహా ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా సరిహద్దులు పూర్తి స్థాయిలో ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు

ఆస్ట్రేలియా మంత్రి కీలక వ్యాఖ్యలు.. విమాన సర్వీసులు ఈ ఏడాది కష్టమేనా!

సిడ్నీ: భారత్ సహా ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా సరిహద్దులు పూర్తి స్థాయిలో ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆస్ట్రేలియా ట్రేడ్ మినిస్టర్ డాన్ తెహాన్ మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. దేశ సరిహద్దులను పూర్తి స్థాయిలో తెరిచే అవకాశం లేదన్నారు. 2022 ద్వితీయార్థంలో ఆస్ట్రేలియా సరిహద్దులు పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశం ఉందన్నారు. న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు. 


ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలతో ఆస్ట్రేలియా ఇటువంటి ఒప్పందాలను చేసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఇప్పటికే భారత ప్రయాణికులపై నిషేధం విధించింది. కాగా.. ఆస్ట్రేలియా మంత్రి తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే.. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య విమాన సర్వీసులు ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2021-05-07T20:38:59+05:30 IST