ఆస్ట్రేలియాలో 'డెల్టా' దడ.. భారీగా పెరుగుతున్న కొత్త కేసులు!

ABN , First Publish Date - 2021-08-20T01:28:06+05:30 IST

ఆస్ట్రేలియాను కరోనా డెల్టా వేరియంట్ వణికిస్తోంది. గతేడాది మహమ్మారి విజృంభణ తార స్థాయిలో ఉన్నప్పుడు నమోదైన కేసుల కంటే తాజాగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య అధికంగా ఉంటోందని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో 'డెల్టా' దడ.. భారీగా పెరుగుతున్న కొత్త కేసులు!

సిడ్నీ: ఆస్ట్రేలియాను కరోనా డెల్టా వేరియంట్ వణికిస్తోంది. గతేడాది మహమ్మారి విజృంభణ తార స్థాయిలో ఉన్నప్పుడు నమోదైన కేసుల కంటే తాజాగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య అధికంగా ఉంటోందని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం న్యూసౌత్‌వేల్స్‌లో 681, విక్టోరియాలో 57 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యశాఖాధికారి ఒకరు తెలిపారు. ఇవాళ ఒక్కరోజే న్యూసౌత్‌వేల్స్‌, విక్టోరియా, రాజధాని కాన్‌బెర్రాలలో కలిపి ఏకంగా 754 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా ఒకేరోజు నమోదైన 725 అత్యధిక కేసులను దాటిపోయింది. దీంతో అధికారులు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌లను నిలువరించడంలో ఇంతకుముందు పాటించిన లాక్‌డౌన్ నిబంధనలను తిరిగి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 


అటు సిడ్నీ నుంచి వైరస్ వ్యాప్తి ఆస్ట్రేలియాలోని ఇతర ప్రాంతాలకు శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 26 మిలియన్ల మందిలో సగం మందికి పైగా లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఇక ఆసీస్‌లో కొత్త కేసులు ఒక్కసారిగా పెరగడానికి డెల్టా వేరియంట్ ఒక కారణమైతే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగడం కూడా మరో కారణం. ఈ విషయమై ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌పై ఆరోగ్య నిపుణులు, రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ మొత్తంలో మందుల తయారీదారుల నుండి తగినంత డోసులను త్వరగా పొందడంలో ప్రధాని పూర్తిగా విఫలమయ్యారని వారు విమర్శిస్తున్నారు. ఇక ఆసీస్ నుంచి డెల్టా వేరియంట్ న్యూజిలాండ్‌కు కూడా పాకినట్లు సమచారం. 

Updated Date - 2021-08-20T01:28:06+05:30 IST