ప్చ్‌..మరోసారీ

ABN , First Publish Date - 2020-03-09T09:55:42+05:30 IST

మహిళల టీ20 ప్రపంచక్‌పలో ఆస్ట్రేలియా జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంది. సమఉజ్జీల సమరంగా జరుగుతుందనుకున్న ఫైనల్‌ మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా ..

ప్చ్‌..మరోసారీ

వరుసగా నాలుగు విజయాలతో దుమ్మురేపిన భారత మహిళలు వరుణుడి అండతో ఏకంగా తుది సమరానికి చేరడంతో యావత్‌ దేశం సంబరాలు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఫైనల్లోనూ ఆసీ్‌సను చిత్తు చేస్తారని అభిమానులు

ఆశించారు. కానీ మనోళ్లు ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. దాదాపు 90వేల మంది ప్రేక్షకులను చూసి బేజారెత్తారో.. లేక మెగా టోర్నీ ఫైనల్‌ ఒత్తిడిని తట్టుకోలేకపోయారో కానీ కనీస పోరాటమే లేకుండా ఆతిథ్య జట్టుకు దాసోహమయ్యారు. బ్యాటింగ్‌లో సత్తా లేదు.. బౌలింగ్‌లో పస లేదు.. ఫీల్డింగ్‌ గురించి చెప్పాల్సిందేమీ లేదు. ఇలా అన్ని విభాగాల్లోనూ పసికూన జట్టు తరహాలో విఫలమైన హర్మన్‌ప్రీత్‌ సేన ఓ అద్భుత అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది. ఆస్ట్రేలియా మాత్రం చాంపియన్‌ తరహా ఆటతో తొలి బంతి నుంచే చెలరేగింది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆడాల్సిన తీరు ఇదీ అని చాటి చెబుతూ ఐదోసారి కప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించింది.


టైటిల్‌ పోరులో చిత్తయిన భారత్‌

ఆస్ట్రేలియాదే టీ20 ప్రపంచకప్‌   

ఐదోసారి ట్రోఫీతో  చరిత్ర


మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచక్‌పలో ఆస్ట్రేలియా జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంది. సమఉజ్జీల సమరంగా జరుగుతుందనుకున్న ఫైనల్‌ మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా మారుస్తూ 85 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దీంతో ఆదివారం భారీ ప్రేక్షకుల సమక్షంలో ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఓపెనర్లు అలీసా హీలీ (39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75), బెత్‌ మూనీ (54 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్‌) మెరుపు అర్ధసెంచరీలతో ఆసీస్‌ విజయానికి బాటలు వేశారు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఓపెనర్ల విజృంభణతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగుల భారీస్కోరు సాధించింది. దీప్తి శర్మకు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 19.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ (33) టాప్‌ స్కోరర్‌. మెగాన్‌ షట్‌కు నాలుగు, జొనాసెన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హీలీ.. ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా బెత్‌ మూనీ నిలిచారు.


వేగంగా పెవిలియన్‌కు..

టోర్నీలో తొలిసారి ఛేజింగ్‌కు దిగిన భారత్‌ ముందు 185 పరుగుల భారీ లక్ష్యం.. జట్టు ఆశలన్నీ చిచ్చరపిడుగు షఫాలీ వర్మ (2) పైనే.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆమె వీరలెవల్లో బాదేస్తుందని అంతా ఆశించారు. కానీ కేవలం మూడు బంతుల్లోనే షఫాలీ ఇన్నింగ్స్‌కు ఆసీస్‌ పేసర్‌ షట్‌ చెక్‌ పెట్టింది. షట్‌ వేసిన బంతిని ముందు కట్‌ చేయబోయి అంతలోనే థర్డ్‌ మ్యాన్‌ వైపు ఆడాలని చూసింది షఫాలీ. ఈ పొరపాటుకు మూల్యం చెల్లించుకుంటూ కీపర్‌ హీలీ చేతికి చిక్కింది. ఇక్కడి నుంచి భారత ప్లేయర్లలో ధీమా అనేదే కనిపించలేదు. క్రీజులో కాసేపు నిలుద్దామనే ఆలోచనే లేకుండా చకచకా పెవిలియన్‌ చేరారు. రెండో ఓవర్‌లో తానియా భాటియా హెల్మెట్‌కు బంతి బలంగా తాకడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగగా, అదే ఓవర్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ ఓ పేలవ షాట్‌కు డకౌటైంది. ఆతర్వాత స్మృతి మంధాన (11) రెండు ఫోర్లు బాది ఆశలు రేపింది. కానీ మిడా్‌ఫలో బౌండరీ కోసం యత్నించి నాలుగో ఓవర్‌లో సులువైన క్యాచ్‌ ఇవ్వడంతో భారత్‌ ఆశలు కోల్పోయింది. అటు పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (4) తుదివరకైనా నిలవాలనే ప్రయత్నం చేయకుండా అనవసర షాట్‌కు వికెట్‌ పారేసుకుంది. ఈ దశలో మిడిలార్డర్‌లో దీప్తి శర్మ (33) కాస్త పోరాడుతూ వేదా కృష్ణమూర్తి(19)తో కలిసి ఐదో వికెట్‌కు 28.. ఆరో వికెట్‌కు రిచా ఘోష్‌ (18)తో కలిసి 30 రన్స్‌ జోడించింది. కానీ రన్‌రేట్‌ను పట్టించుకోకపోవడంతో గెలుపుపై ఆశలే చిగురించలేదు. చివర్లో మెగాన్‌ షట్‌ వరుస వికెట్లతో చెలరేగడంతో భారత్‌కు ఓటమి లాంఛనమే అయ్యింది.


ఓపెనర్ల వీరవిహారం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ ఆది నుంచీ వ్యూహం ప్రకారం ఆడింది. ఓపెనర్లు హీలీ, మూనీ జోడీ భారత బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని తుత్తునియలు చేస్తూ పరుగుల వరద పారించారు. దీనికి తోడు తమ క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేయడంతో వారికి తిరుగులేకుండా పోయింది. హీలీ అయితే పవర్‌హిట్టింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీప్తి వేసిన ఆరంభ ఓవర్‌లోనే 3 ఫోర్లు కొట్టి తన ఇన్నింగ్స్‌ ఎలా ఉండబోతోందో చాటిచెప్పింది. 8వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన ఆమె 11వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో విజృంభించింది. 30 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన హీలీ తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు 12వ ఓవర్‌లో రాధా యాదవ్‌ బ్రేక్‌ వేసినా, అప్పటికే ఆసీస్‌ సగం మ్యాచ్‌ గెలిచినట్టయింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ 115 రన్స్‌ జత చేశారు. ఆతర్వాత మూనీ కూడా 41 బంతుల్లో అర్ధసెంచరీ చేసి జట్టు భారీస్కోరుకు బాటలు వేసింది. 17వ ఓవర్‌లో లానింగ్‌ (16), గార్డ్‌నర్‌ (2)లను దీప్తి శర్మ అవుట్‌ చేసినప్పటికీ ఆసీ్‌స పెద్దగా ఇబ్బంది పడలేదు. అటు తుదికంటా క్రీజులో నిలిచిన మూనీ వరుస బౌండరీలతో చెలరేగడంతో భారత్‌ ముందు క్లిష్టమైన లక్ష్యం ఏర్పడింది.


ఆ రెండు క్యాచ్‌లు పట్టి ఉంటే..

ప్రతిష్ఠాత్మకమైన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌.. క్రీజులో అత్యుత్తమ బ్యాటర్లు హీలీ, మూనీ. ఆసీస్‌ టైటిల్‌ గెలవడానికి కారణం ఈ జోడీనే.. కానీ పవర్‌ప్లేలోనే వీరు పెవిలియన్‌కు చేరాల్సింది. అయితే, తీవ్ర ఒత్తిడికి లోనైన భారత అమ్మాయిలు బంగారంలాంటి అవకాశాన్ని వృఽధా చేసుకుని చివరకు అయ్యో.. అనుకోవాల్సి వచ్చింది. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ఐదో బంతిని హీలీ కవర్స్‌లో ఆడింది. అక్కడే ఉన్న షఫాలీ సులువుగా పట్టాల్సి ఉన్నా అనవసరంగా ఎడమవైపు డైవ్‌ చేసి నేలపాలు చేసింది. ఇది ఎంత పెద్ద తప్పిదమో ఆ తర్వాత తెలిసొచ్చింది. అందుకేనేమో.. మ్యాచ్‌ ముగిశాక షఫాలీ బోరున విలపించింది. ఇక నాలుగో ఓవర్‌ మూడో బంతికి బెత్‌ మూనీ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోవడంలో రాజేశ్వరి చురుగ్గా ప్రయత్నించకపోవడంతో ఆమెకు లైఫ్‌ లభించింది. అప్పటికి ఆమె 8 పరుగులతోనే ఉంది. 


1 ఐసీసీ టోర్నీ (పురుషుల, మహిళల వన్డే, టీ20 ప్రపంచకప్‌) ఫైనల్లో అత్యంత వేగం (30 బంతుల్లో)గా హాఫ్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌ అలీసా హీలీ.


గొప్పగా ఆడారు..

భారత జట్టుకు ఇది క్లిష్టమైన రోజు. మనది యువ జట్టు. భవిష్యత్తులో బలీయంగా తయారవుతుంది. విశ్యవ్యాప్తంగా మీరు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. నిరాశ చెందకుండా కష్టపడండి. తప్పకుండా కప్‌ గెలుస్తారు. - సచిన్‌ టెండూల్కర్‌


టోర్నమెంట్‌లో మీ ఆట తీరుకు గర్విస్తున్నాం. ఈ ఓటమి నుంచి బయటపడి గతంలో కంటే పటిష్ఠంగా తయారవుతారని ఆశిస్తున్నా    -విరాట్‌ కోహ్లీ 


ట్రోఫీలు వస్తాయి, పోతాయి. కానీ మీ ప్రదర్శన..అసమానతలు, సామాజిక అడ్డంకులను ధిక్కరించే ధైర్యాన్ని ప్రతి భారత బాలికలో కలిగిస్తుంది. 

-గంభీర్‌


పురుషులు, మహిళల ప్రపంచకప్‌ (టీ20, వన్డే) ఫైనల్లో ఆడిన పిన్న వయస్కురాలి (16 ఏళ్ల 50 రోజులు)గా భారత ఓపెనర్‌ షఫాలీ వర్మ రికార్డు. గతంలో ఈ ఫీట్‌ విండీస్‌ మహిళా క్రికెటర్‌ షాకనా క్వింటినీ (2013లో వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌, 17 ఏళ్ల 45 రోజులు) పేరిట ఉండేది.


ఫ్యాన్స్‌ @ 86,174  

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ప్రేక్షకుల హాజరులో రికార్డు సృష్టించింది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ టైటిల్‌ఫైట్‌ను 86,174 మంది ప్రత్యక్షంగా తిలకించారు. ఓ మహిళల క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించి ఇది ప్రపంచ రికార్డు కావడం విశేషం. అలాగే ఆస్ట్రేలియాలో ఓ మహిళా క్రీడా పోటీకి అభిమానుల హాజరులోనూ ఈ సంఖ్య రికార్డు నెలకొల్పింది.  


జట్టుపై పూర్తి నమ్మకముంది 

లీగ్‌ దశలో అద్భుతంగా ఆడాం. ఇప్పటికీ జట్టుపై నాకెంతో విశ్వాసముంది. గెలుపోటములు ఆటలో భాగం. ఓటములనుంచి పాఠాలు నేర్చుకోవాలి. దురదృష్టవశాత్తు ఈరోజు కొన్ని క్యాచ్‌లు వదిలేశాం. రాబోయే ఏడాదిన్నర మాకు ఎంతో కీలకం. ముఖ్యంగా ఫీల్డింగ్‌ బాగా మెరుగుపడాలి. టీ20 వరల్డ్‌కప్‌ గురించి మాట్లాడుకొంటే గతసారి సెమీ్‌సకు వెళ్లాం. ఈసారి ఫైనల్లో ప్రవేశించాం. అంటే.. మేం సరైన దిశలోనే పురోగమిస్తున్నాం. ప్రతి ఏడాదీ  మెరుగవుతున్నాం. అయితే ప్రధాన మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలనే విషయంపై దృష్టి సారించాలి.                 - హర్మన్‌ప్రీత్‌ కౌర్‌


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా: అలీసా హీలీ (సి) వేద (బి) రాధా యాదవ్‌ 75; బెత్‌ మూనీ (నాటౌట్‌) 78; లానింగ్‌ (సి) శిఖా పాండే (బి) దీప్తి శర్మ 16; గార్డ్‌నర్‌ (స్టంప్డ్‌) భాటియా (బి) దీప్తి శర్మ 2; హేన్స్‌ (బి) పూనమ్‌ యాదవ్‌ 4; కేరీ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 184/4. వికెట్ల పతనం: 1-115, 2-154, 3-156, 4-176. బౌలింగ్‌: దీప్తి శర్మ 4-0-38-2; శిఖా పాండే 4-0-52-0; రాజేశ్వరి గైక్వాడ్‌ 4-0-29-0; పూనమ్‌ యాదవ్‌ 4-0-30-1; రాధా యాదవ్‌ 4-0-34-1.

భారత్‌: షఫాలీ వర్మ (సి) హీలీ (బి) షట్‌ 2; స్మృతి మంధాన (సి) కేరీ (బి) మోలినెక్స్‌ 11; తానియా భాటియా (రిటైర్డ్‌ హర్ట్‌) 2; జెమీమా రోడ్రిగ్స్‌ (సి) కేరీ (బి) జొనాసెన్‌ 0; హర్మన్‌ప్రీత్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) జొనాసెన్‌ 4; దీప్తి శర్మ (సి) మూనీ (బి) కేరీ 33; వేద కృష్ణమూర్తి (సి) జొనాసెన్‌ (బి) కిమ్మిన్స్‌ 19; రిచా ఘోష్‌ (సి) కేరీ (బి) షట్‌ 18; శిఖా పాండే (సి) మూనీ (బి) షట్‌ 2; రాధా యాదవ్‌ (సి) మూనీ (బి) జొనాసెన్‌ 1; పూనమ్‌ యాదవ్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) షట్‌ 1; రాజేశ్వరి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.1 ఓవర్లలో 99 ఆలౌట్‌. వికెట్లపతనం: 1-2, 2-8, 3-18, 4-30, 5-58, 6-88, 7-92, 8-96, 9-97, 10-99. బౌలింగ్‌: షట్‌ 3.1-0-18-4; జొనాసెన్‌ 4-0-20-3; మోలినెక్స్‌ 4-0-21-1; కిమ్మిన్స్‌ 4-0-17-1; కేరీ 4-0-23-1.

Updated Date - 2020-03-09T09:55:42+05:30 IST