ఐదు బబుల్స్‌..లక్షల్లో ఫ్యాన్స్‌

ABN , First Publish Date - 2020-08-13T09:28:56+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ క్రీడలు మళ్లీ మొదలవుతున్నాయి. ఇప్పటికే సాకర్‌, క్రికెట్‌లో అంతర్జాతీయ సిరీస్‌లు

ఐదు బబుల్స్‌..లక్షల్లో ఫ్యాన్స్‌

ప్రైజ్‌మనీ ఫుల్‌..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు మునుపటి కళ 


మెల్‌బోర్న్‌: కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ క్రీడలు మళ్లీ మొదలవుతున్నాయి. ఇప్పటికే సాకర్‌, క్రికెట్‌లో అంతర్జాతీయ సిరీస్‌లు జరుగుతుండగా.. త్వరలోనే యూఎస్‌ ఓపెన్‌తో టెన్ని్‌సలో గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌ అభిమానులను కనువిందు చేయనుంది. అయితే, ఈ టోర్నీలన్నీ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తుంటే.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మాత్రం మునుపటి కళతో అలరించనుంది. టోర్నీ బయో బబుల్‌ వాతావరణంలోనే జరగనున్నా, అభిమానుల సమక్షంలోనే మ్యాచ్‌లను నిర్వహించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాదు.. నగదు బహుమతిలోనూ ఎలాంటి కోత లేకుండా పూర్తి ప్రైజ్‌మనీని ఆటగాళ్లకు అందజేయనున్నట్టు స్పష్టం చేశారు. షెడ్యూల్‌ తేదీలు కాస్త అటూ ఇటూ అయినా.. జనవరిలోనే ఈవెంట్‌ ఉంటుందని ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ డైరెక్టర్‌ క్రెగ్‌ టిలే తెలిపారు. 

హ్యాపీస్లామ్‌గా.... మెల్‌బోర్న్‌లో కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో టోర్నీ నిర్వహణపై ఈ మధ్య అనిశ్చితి నెలకొంది. కానీ, టిలే అండ్‌ కో మాత్రం 2020 టోర్నీ ముగిసినప్పటి నుంచి తర్వాతి ఏడాది నిర్వహించాల్సిన ఈవెంట్‌పైనే దృష్టి సారించారు. అక్టోబరులో టికెట్ల విక్రయాలు ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం టోర్నీ సమయానికి ఆరు వారాల ముందే ఆటగాళ్లు ఆస్ట్రేలియా చేరుకొని క్వారంటైన్‌లో ఉండే విధంగా దేశవ్యాప్తంగా ఐదు బయో సెక్యూర్‌ బబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ‘డిసెంబరు ఒకటి నుంచి బయో బబుల్స్‌ ప్రారంభిస్తాం. దీంతో టోర్నీకి కొన్నిరోజుల ముందే ఆటగాళ్లు ఇక్కడికి రావచ్చు. మేం తీసుకొంటున్న చర్యల కారణంగా వారు.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లోలాగా 14 రోజులపాటు హోటళ్లకే పరిమితం కావాల్సిన అవసరముండకపోవచ్చు. అంతేకాదు.. స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తాం. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ అయిన రూ. 379 కోట్లలో ఎటువంటి కోతలు ఉండవు. ఓవరాల్‌గా ఈ గ్రాండ్‌స్లామ్‌ను హ్యాపీస్లామ్‌ అన్న భావనగా తీర్చిదిద్దుతాం’ అని టిలే చెప్పారు. గతేడాదితో పోల్చితే మెల్‌బోర్న్‌ పార్క్‌లోకి సగం మంది.. అంటే దాదాపు 4 లక్షల మంది ప్రేక్షకులను అనుమతించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-08-13T09:28:56+05:30 IST