సంచలనాల ఆరంభం

ABN , First Publish Date - 2022-01-18T10:20:01+05:30 IST

ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వీసా ఉదంతంతో కళ తప్పిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సంచలనాలతో ప్రారంభమైంది.

సంచలనాల  ఆరంభం

కెనిన్‌, గాఫ్‌కు తొలిరౌండ్‌లో షాక్‌

ఒసాక, బార్టీ, క్రెజికోవా, నడాల్‌ ముందంజ

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌


మెల్‌బోర్న్‌: ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వీసా ఉదంతంతో కళ తప్పిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సంచలనాలతో ప్రారంభమైంది. సోమవారం మొదలైన ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌లో 2020 చాంపియన్‌ సోఫియా కెనిన్‌, అమెరికా టీనేజ్‌ సంచలనం కొకా గాఫ్‌ తొలిరౌండ్‌ ఓటమితో తిరుగుముఖం పట్టారు. ఇక నిరుటి విజేత నవోమి ఒసాక, స్థానిక స్టార్‌ ఆష్లే బార్టీ, ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ క్రెజికోవా తదితరులు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌, మూడోసీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌, ఏడోసీడ్‌ బెరెటిని, పదోసీడ్‌ హుర్కాజ్‌ ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో 11వ సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6-7 (7), 5-7 స్కోరుతో 2017 యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) చేతిలో కంగుతిని టోర్నీ నుంచి నిష్క్రమించింది.


అలాగే మరో మ్యాచ్‌లో 18వ సీడ్‌ గాఫ్‌కు చైనాకు చెందిన అన్‌సీడెడ్‌ వాంగ్‌ 6-4, 6-2 స్కోరుతో వరుస సెట్లలో షాకిచ్చింది. ఇతర మొదటి రౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్‌ బార్టీ 6-0, 6-1తో ఉక్రెయిన్‌ క్వాలిఫయర్‌ లెసియా సురెంకోపై, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒసాక (జపాన్‌) 6-3, 6-3 స్కోరుతో ఒసోరియా (కొలంబియా)పై, నాలుగోసీడ్‌ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-2, 6-0తో పెట్కోవిక్‌ (జర్మనీ)పై, ఐదోసీడ్‌ మరియా సకారి (గ్రీక్‌) 6-4, 7-6 (2)తో మరియా (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్‌ పౌలా బడోసా (స్పెయిన్‌) 6-4, 6-0తో టొమ్లుజొనోవిక్‌ (ఆస్ట్రేలియా)పై, ఒస్టాపెంకో (లాత్వియా) 6-7 (9), 6-4, 6-1తో అనా కరోలినా (స్లొవేనియా)పై, విక్టోరియా అజరెంకా (బెలారస్‌) 6-3, 6-1తో ఉడ్వర్డి (హంగరీ)పై, స్విటోలినా (ఉక్రెయిన్‌) 6-1, 7-6 (4)తో ఫెర్రో (ఫ్రాన్స్‌)పై, బెలిండా బెన్సిక్‌ (స్విట్జర్లాండ్‌) 6-4, 6-3తో మ్లదెనోవిక్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు. 


రఫా సులువుగా..:

21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసిన స్పెయిన్‌ బుల్‌ నడాల్‌ 6-1, 6-4, 6-2తో మార్కోస్‌ గిరోన్‌ (అమెరికా)పై సునాయాస గెలుపుతో రెండోరౌండ్‌లో ప్రవేశించాడు. జర్మనీకి చెందిన జ్వెరేవ్‌ 7-6 (3), 6-1, 7-6 (1)తో సహచరుడు డానియల్‌ను, హుర్కాజ్‌ (పొలెండ్‌) 6-2, 7-6 (3), 6-7 (5), 6-3తో గెరాసి మోవ్‌ (బెలారస్‌)ను, బెరెటిని (ఇటలీ) 4-6, 6-2, 7-6 (5), 6-3తో నకాషిమా (అమెరికా)ను, మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 6-1, 6-1, 6-3తో ఫెడెరికో కొరియా (అర్జెంటీనా)ను, షపోవలోవ్‌ (కెనడా) 7-6 (3), 6-4, 3-6, 7-6 (3)తో లాస్లో డెరె (సెర్బి యా)ను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. 


ఈ విజయం నొవాక్‌కు అంకితం

సెర్బియాకు చెందిన మియోమిర్‌ కెక్‌మనోవిక్‌  తొలి రౌండ్‌లో సహచరుడు నొవాక్‌ జొకోవిచ్‌తో తలపడాల్సి ఉంది. అయితే వీసా సమస్యతో జొకో టోర్నీలో పాల్గొనకపోవడంతో సల్వటోర్‌ కరూసొ (ఇటలీ)తో కెక్‌మనోవిక్‌ ఢీకొన్నాడు. ఈ మ్యాచ్‌లో 6-4, 6-2, 6-1తో సులువుగా నెగ్గిన కెక్‌మనోవిక్‌ తన విజయాన్ని జొకోకు అంకితమిస్తున్నట్టు చెప్పాడు. 

Updated Date - 2022-01-18T10:20:01+05:30 IST