వెంటవచ్చే రోజుల సంపుటి కర్త

ABN , First Publish Date - 2022-01-18T07:49:44+05:30 IST

జనవరి 18. బూర్గుల నర్సింగరావు దూరమై అప్పుడే ఒక ఏడాది గడిచిపోయింది. తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తగా, చరిత్ర, సంస్కృతి, ప్రజల ఆకాంక్షలని ఆకళించుకున్న...

వెంటవచ్చే రోజుల సంపుటి కర్త

‘జ్ఞాపకం అనేది జీవితమే. సజీవంగా వున్న మనుషుల బృందాలే జ్ఞాపకాలని మోసుకుపోతాయి. అందుకనే, ఆ జ్ఞాపకాలు నిరంతరం రూపొందుతూ ఉంటాయి’. 

ఎరిక్ హాబ్స్ బామ్, చరిత్రకారుడు


జనవరి 18. బూర్గుల నర్సింగరావు దూరమై అప్పుడే ఒక ఏడాది గడిచిపోయింది. తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తగా, చరిత్ర, సంస్కృతి, ప్రజల ఆకాంక్షలని ఆకళించుకున్న సునిశిత మేధావిగా, విరామమెరుగని బాటసారిగా తనదైన ముద్రవేసిన వ్యక్తిత్వ మూర్తిమత్వాన్ని కరోనా ఉత్పాతం బలితీసుకున్నది. నిరంతర స్వాప్నికునిగా భవిష్యత్ స్వప్నాలతో సంవాదాన్ని, అర్థవంతమైన సంభాషణని కాలం అర్ధంతరంగా చిదిమివేసింది. విలువైన చరిత్ర జ్ఞాపకాలని అందించిన నర్సింగరావు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు.


తన కుటుంబ నేపథ్యం వల్లనో, మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తమ్ముని కుమారుడు కావడం వల్లనో నర్సింగరావుకి ప్రాధాన్యం రాలేదు. తాను ఎంచుకున్న వామపక్ష రాజకీయాలు, సిద్ధాంత అవగాహన వీటితో పాటు విద్యార్థి దశలో అఖిల భారత నాయకత్వం నెరపిన స్థాయినుంచి, వయసు మీద పడినాక గ్రామ సర్పంచిగా పనిచేయడానికి సిద్ధపడి, గ్రామీణ వికాసపు ప్రయోగాలలో నిమగ్నమైన నిబద్ధ జీవితాచరణే ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.


ఇటీవల ప్రచురించిన బూర్గుల నర్సింగరావు గారి వ్యాసాలు, ఇంటర్వ్యూలు, జ్ఞాపకాలు, ముచ్చట్ల సంకలనం ‘వెంటవచ్చే ఆ రోజులు’ (లివింగ్ దోజ్ టైమ్స్) చదవడం ఒక విధంగా ఆయనతో సంభాషణ. తన జీవితమూ, తాను జీవించిన కాలమూ ‘వెంటవచ్చే ఆ రోజులలో’ మనకి కనిపిస్తాయి. చరిత్రలో సజీవమైన భాగస్వాములుగా, క్రియాశీలంగా వ్యక్తులు ఎటువంటి పాత్రని నిర్వహిస్తారు? అలాంటి పాత్రధారులైన వ్యక్తులు తమ అనుభవం నుంచి, తమదైన దృక్పథం నుంచి ఆ చరిత్రనీ, అందులో ఘటనలనీ ఎలా చూస్తారు, ఎలా తమ జ్ఞాపకాలని తలచుకుంటారు, ఏవిధంగా మలుచుకుంటారు ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలని రేకెత్తిస్తుందీ పుస్తకం.


హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ స్వభావం గురించీ, బహుళ వైవిధ్యతతో కూడిన సమ్మిశ్రమ సంస్కృతి గురించీ నర్సింగరావు నొక్కి చెబుతారు. ఒక రకంగా ఆ స్వభావం నర్సింగరావు విలక్షణమైన వ్యక్తిత్వంలో కూడా ప్రతిఫలిస్తుంది. బహుళ వైవిధ్యతలు నిండిన సామాజిక వాతావరణం, ఆయా సముదాయాలలో తమని తాము వేరుపరచి చూసుకునే సంకుచితత్వానికి దారి తీయవచ్చు. లేదా, ఆయా వైవిధ్యతలని ఆమోదించి, స్వీకరించే భావ విస్తృతికి పునాది వేయవచ్చు. నర్సింగరావు వ్యక్తిత్వ పరిణామంలో రెండవదానినే మనం చూస్తాము. హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ చరిత్ర నుంచి మధ్య అమెరికా ప్రాంతంలో కల్లోల పరిస్థితులదాకా ఆయన పరిశీలన, వ్యాఖ్యానాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. అడవులు, పర్యావరణం, చారిత్రక కట్టడాల పరిరక్షణ నుంచి గోదావరి నది, తెలంగాణ భవిష్యత్తు దాకా ఆయన ఇందులో చర్చించారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి, పరిణామం చెందిన తీరుపై ఆయన వ్యాఖ్యానిస్తారు. కుతుబ్ షాహీ పాలకులకీ, అసఫ్ జాహీ పాలకులకీ మధ్య తేడా గురించి చెబుతారు. ముల్కీ ఉద్యమం వరసగా తలెత్తిన పరిస్థితులనీ, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తెచ్చిన పరిస్థితులు, సమస్యల గురించీ వివరించారు. ఇవి చాలా ఆసక్తికరమైనవీ, విలువైనవీ. వ్యక్తిగా తన విభిన్న ఆసక్తులకూ, విశ్లేషణా శక్తికీ, భావ వైశాల్యానికీ ఆయన పరిశీలనలు, వ్యాఖ్యలు అద్దం పడతాయి.


తెలంగాణ సాయుధ పోరాటం, ఆ క్రమంలో తలెత్తిన సమస్యలు, కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు, చర్చల గురించీ ప్రస్తావించారు. స్ఫూర్తి నందించే వ్యక్తులకు నివాళి అందించారు. ఇందులో ఆయన పరిశీలనలు, అభిప్రాయాలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. మహత్తర రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా వెలుగొందినప్పటికీ, ఆ చరిత్ర సుదీర్ఘ కాలంపాటు నమోదు కాకపోవడం ఒక చారిత్రక విషాదమని చెప్పుకోవాలి. 1946లో ప్రారంభమై, 1951లో అధికారిక విరమణకి గురైనా ఆ పోరాట చరిత్ర, దాదాపు రెండు దశాబ్దాల విస్మరణకు గురైంది. 1968లో ‘వీర తెలంగాణ విప్లవ పోరాటం’ అన్న పేరుతో చండ్ర పుల్లారెడ్డి పుస్తకం, ఆ తర్వాత 1970ల సాయుధ పోరాట ‘రజతోత్సవాల’ దాకా ఆ పోరాట చరిత్ర, పాఠాలని చర్చించడం గానీ, వాటిని నమోదు చేసే ప్రయత్నంగానీ జరగలేదు. ఇది ఆ పోరాటాన్ని మాత్రమే కాక, చరిత్రనే మరుగు పరిచిన ‘చారిత్రిక విషాదం’ అని చెప్పుకోవచ్చు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, తెలంగాణ పోరాటం గురించిన చర్చ మొత్తం, లేదంటే ఎక్కువ భాగం ఆ సాయుధ పోరాటాన్ని విరమించాల్సి ఉండెనా, కొనసాగించాల్సి ఉండెనా అనే రాజకీయ వివాదం చుట్టూ కేంద్రీకృతమై సాగింది. రాజకీయ చర్చలో ఆ ప్రశ్న ప్రధానమైనదే అనుకున్నా, హైదరాబాద్ నిర్దిష్ట, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యాన్ని అది కొంతమేరకు విస్మరించటం జరిగింది. ఆనాటి సంక్లిష్టమైన చారిత్రక క్రమాన్ని, తెలంగాణ, హైదరాబాద్ నిర్దిష్ట, ప్రత్యేక నేపథ్యాన్ని వివరంగా నమోదు చేసుకోలేకపోవడం ఒక విషాదం. రెండు దశాబ్దాల కాలం గడిచిన తర్వాత, రాజకీయ దృక్పథాలలో మార్పులు, చేర్పులు సంభవించాక గుర్తు తెచ్చుకున్న, మలుచుకున్న జ్ఞాపకాల నుండి మాత్రమే అటువంటి వివరాలని మనం పోగు చేసుకోవాల్సి ఉంది. ఆ పోరాటంలో క్రియాశీలంగా పాల్గొన్న వ్యక్తుల (నాయకులు, కార్యకర్తల) జ్ఞాపకాలనుంచీ, పోరాట చరిత్రపై వాదవివాదాలలోనుంచీ మనం ఏరుకోవాలి. ఇందులో తెలంగాణ నిర్దిష్ట నేపథ్యం నుంచి, తనదైన అవగాహనతో నర్సింగరావు గారు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైనవి. చర్చించాల్సినవి.

రావి నారాయణ రెడ్డి గురించి మాట్లాడుతూ, ‘కొందరు మనుషులు తమకు ప్రతికూలమైన పరిస్థితులలో చరిత్రను నిర్మిస్తారు. రావి నారాయణ రెడ్డి గారు అలాంటి మనుషులలో ఒకరు’ అని నర్సింగరావు అంటారు. ప్రతికూలమైన పరిస్థితులలో చరిత్రని నిర్మించే కృషి తనదైన సమస్యలని తెచ్చిపెడుతుంది. అనేక వాద వివాదాలు, అంతర్గత సంఘర్షణల నేపథ్యం, విభిన్న అభిప్రాయాలు, దురభిప్రాయాలు పరిస్థితులని మరింత సంక్లిష్టం చేస్తాయి. రావి నారాయణ రెడ్డి, సుందరయ్య కలుసుకున్న సందర్భాన్ని పేర్కొంటూ, ప్రపంచమే మారిపోయినట్లనిపించింది అంటారు. చీలికలు, అభిమానాలు, దురభిమానాలు అన్నీ పరిస్థితులు, కాలం మనుషులకి విధించిన పరిమితులు. ‘స్నేహం పరిఢవిల్లే కాలంకోసమే పాటుపడినా/ మేము మాత్రం స్నేహ పూర్వకంగా మెలగలేకపోయాం’ అని జర్మన్ కవి బెర్టోల్ట్ బ్రెహ్ట్ అంటాడు. అయితే, పరిమితులని సృష్టించిన ప్రతికూల పరిస్థితులని మార్చాల్సింది కూడా మనుషులే. బ్రెహ్ట్ మాటలని గుర్తుచేసుకుంటే సరిపోదు. ద్వేషాలని, కోపాలని అధిగమించే విశాల దృక్పథం మొత్తం ఉద్యమాలలో పెంపొందవలసే వుంది. అటువంటి విశాల దృక్పథానికి కట్టుబడి తనదైన దృక్పథంతో నిబద్ధతతో వ్యవహరించిన వ్యక్తి నర్సింగరావు. చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఉద్యమాల ఉత్థాన పతనాలు, వ్యక్తుల పాత్ర గురించి వివేచనతో కూడిన విలువైన పరిశీలనలు, వ్యాఖ్యానాలతో విలువైన జ్ఞాపకాలను అందించిన నర్సింగరావు మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.

సుధా కిరణ్

Updated Date - 2022-01-18T07:49:44+05:30 IST