సీఎంల స్వయంకృతం!

ABN , First Publish Date - 2021-07-18T05:42:34+05:30 IST

డామిట్‌ కథ అడ్డం తిరిగింది! కృష్ణా జలాలపై రెండు తెలుగు రాష్ర్టాలు జగడానికి దిగడంతో కేంద్ర ప్రభుత్వం ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు’గా అధికారాన్ని హస్తగతం చేసుకుంది....

సీఎంల స్వయంకృతం!

డామిట్‌ కథ అడ్డం తిరిగింది! కృష్ణా జలాలపై రెండు తెలుగు రాష్ర్టాలు జగడానికి దిగడంతో కేంద్ర ప్రభుత్వం ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు’గా అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కృష్ణా జలాలపై ఎగువన ఉన్న కారణంగా తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఆదేశాలు ఇచ్చి నీటిని దుర్వినియోగం చేయడంతో సంబంధిత ప్రాజెక్టులను కేంద్రం తన అధీనంలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. దీంతో విభజనచట్టంలో తనకు సంక్రమించిన అధికారాలను అడ్డుపెట్టుకొని కృష్ణానదితో పాటు గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు సహా నిర్మాణంలో ఉన్న వివాదాస్పద ప్రాజెక్టులన్నింటిపై అధికారాలను సొంతం చేసుకుంటూ రెండు నదులకూ బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రప్రభుత్వం గురువారం అర్ధరాత్రి గెజిట్లు విడుదల చేసింది. ఈ పరిణామంపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం తాము కోరిన విధంగా చర్యలు తీసుకున్నందుకు కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించింది. గెజిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం రెండు రాష్ర్టాల మధ్య వివాదం తలెత్తుతున్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు ఎప్పుడో నిర్మించిన ప్రాజెక్టులను కూడా బోర్డుల పరిధిలో చేర్చిపారేశారు. పనిలో పనిగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు రుణాలు, ఆర్థిక సహాయం చేసేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది. మొత్తానికి రెండు తెలుగురాష్ర్టాల జుత్తును కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. ఈ పరిణామం తెలంగాణ ప్రభుత్వానికి నిరాశను మిగల్చగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మాత్రం ఒక కంట ఆనందబాష్పాలు, మరో కంట కన్నీరుకు అన్నట్టుగా ఉంది. రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్లకు జల వివాదంపై ఇదొక ముందడుగు అని ఏపీ ప్రభుత్వపెద్దలు అభిప్రాయపడగా, కేంద్రం జారీ చేసిన గెజిట్‌ను అంగీకరించేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఉభయరాష్ర్టాల మధ్య కృష్ణాజలాల కేటాయింపును నిర్ణయించడానికి కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని, 2015లో కుదుర్చుకున్న కేటాయింపుల ఒప్పందానికి కాలం చెల్లిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై న్యాయ సలహా కోరామని, అది ఏర్పాటుకావడానికి చాలా సమయం పడుతుందని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. దీన్నిబట్టి కృష్ణాజలాలను రెండు రాష్ర్టాల మధ్య ఫ్రెష్‌గా ఇప్పట్లో కేటాయించే అవకాశం లేదు. అంటే, బచావత్‌ అవార్డు ప్రకారం చేసిన కేటాయింపులే అప్పటివరకూ అమల్లో ఉంటాయి. ఈ కారణంగా దక్షిణ తెలంగాణలో ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో పడిపోతాయి. అనుమతులన్నీ వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే అందుకు ఏళ్లూ పూళ్లు పడుతుంది. ఈ కారణంగానే అనుమతులు లేని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత నిధులతోనే చేపట్టేవి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కేంద్రప్రభుత్వ సంస్థల నుంచి అప్పు తీసుకోకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఈ పరిణామంతో ఉభయరాష్ర్టాలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అవుతుంది. అప్పు చేయనిదే పూట గడవని స్థితిలో ఉన్న రెండు తెలుగు రాష్ర్టాలు ప్రతిపాదిత ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టక తప్పని పరిస్థితి. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలలో చేపట్టిన ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విషయానికి వస్తే కేంద్రం నిర్ణయం కొంత మోదాన్ని కొంత ఖేదాన్ని మిగిల్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వేగలేని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి కేంద్రం నిర్ణయం పాక్షిక విజయమనే చెప్పాలి. అయితే రెండు రాష్ర్టాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదిత కృష్ణాబోర్డు పరిధిలో కేంద్రప్రభుత్వం చేర్చలేదు. ఉద్దేశపూర్వకంగా అలా చేసిందా? లేక పొరపాటున అలా జరిగిందో తెలియవలసి ఉంది. కారణం ఏమైనా సీమ ఎత్తిపోతల పథకం ఉనికిని కేంద్రం గుర్తించని పక్షంలో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు ఇకపై అప్పులు పుట్టవు. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో నిర్మాణం చేపట్టలేదు. చేపట్టినా సీమ ఎత్తిపోతలకు ప్రతిపాదిత కృష్ణాబోర్డు నీటిని వాడుకోనివ్వదు. ఈ పరిస్థితి ఉత్పన్నమైనందుకు జగన్‌ రెడ్డి స్థానంలో మరెవరైనా ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పాటికి రాయలసీమ నుంచి అనేక గొంతులు గోలచేసి ఉండేవి. ఈ ప్రాజెక్టుతో పాటు ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టును కూడా బోర్డు పరిధిలో చేర్చలేదు. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజ్‌, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నిర్వహణను కూడా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. ఈ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆయకట్టుతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఆయకట్టు పరిరక్షణ కూడా కేంద్రం చేతిలోకి వెళ్లిపోయింది. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గుర్తించి అనుమతించని పక్షంలో సీమకు తీరని అన్యాయం జరుగుతుంది. అదే సమయంలో కాటన్‌ బ్యారేజ్‌, ప్రకాశం బ్యారేజీలపై పెత్తనం కేంద్రం చేతిలోకి వెళ్లిపోవడం రాష్ర్టానికి మంచిది కాదు. తాజా గెజిట్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్టుపై కూడా కేంద్రానికి అధికారం ఉంటుంది. అదే సమయంలో కృష్ణాజలాలపై ఆధారపడి నిర్మిస్తున్న గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఈ పరిస్థితిని జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి. కేంద్రం నిర్ణయంతో ఉత్పన్నమవుతున్న ప్రశ్నలకు సమాధానం పొందకుండా తాజా గెజిట్‌ తమ విజయమని ప్రభుత్వం ప్రచారం చేసుకున్నప్పటికీ ఫలితం ఉండదు. 


బలహీన నేతలు..

ఈ విషయం అలా ఉంచితే, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను, పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోకుండా, ముఖ్యమంత్రులతో గానీ, తెలుగు రాష్ర్టాల అధికారులతో గానీ చర్చించకుండా, కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి గెజిట్లు విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉంది. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమను ఎదిరించలేని స్థితిలో ఉన్నారన్న నిర్ణయానికి వచ్చిన కేంద్రప్రభుత్వం ఈ చర్య తీసుకుని ఉంటుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న నీటి విషయంలో ఏకపక్ష నిర్ణయాలు సమర్థనీయం కాదు. విభజనచట్టంతో సంక్రమించిన అధికారాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రప్రభుత్వ ప్రతినిధి చెప్పింది నిజమే అనుకుందాం. అలాంటప్పుడు అదే విభజన చట్టంలో పేర్కొన్న ఇతర హామీల అమలు విషయాన్ని కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కృష్ణాజలాల కోసం రెండు తెలుగు రాష్ర్టాలు తరచుగా కొట్టుకోవడం కంటే నీటి నిర్వహణ కేంద్రం చేతిలోకి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం కూడా వినవస్తోంది. అయితే రాష్ర్టాలకు కనీస అధికారాలు లేకుండా బోర్డుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని మాత్రమే తెలుగు రాష్ర్టాలు భరించాలని నిర్దేశించడం సమంజసంగా లేదని నిపుణులు అంటున్నారు. వివాదాస్పదంగా ఉంటున్న ప్రాజెక్టుల వద్ద భద్రత, పర్యవేక్షణకు కేంద్ర బలగాలను నియమించబోతున్నారు. సదరు సిబ్బంది జీతభత్యాలను కూడా మనమే భరించాలి. అయినా కేంద్రబలగాల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సదరు ప్రాజెక్టులను సందర్శించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పరిస్థితి ఉన్నట్టు లేదు. వివాదానికి మూలమైన కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు వివాదాలు లేని గోదావరి నదిపై నిర్మితమైన ప్రాజెక్టులను కూడా కేంద్రం తన అధీనంలోకి తీసుకోవడం ఎందుకు? అన్న ప్రశ్న వినిపిస్తోంది. తాజా గెజిట్‌ ప్రకారం రెండు తెలుగు రాష్ర్టాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన, నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టులపైన మాత్రమే కాకుండా మొత్తం ఆయకట్టుపై అజమాయిషీ కేంద్రం చేతుల్లోకి వెళుతుంది. అలా అని రాష్ర్టాల అవసరాలను గుర్తించి ప్రతిపాదిత ప్రాజెక్టులకు అనుమతులిచ్చే బాధ్యతను కేంద్రం తీసుకుంటుందా అంటే అదీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలే అప్పో సప్పో చేసి ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. కేంద్ర అనుమతులు తెచ్చుకోవాలి. అన్నీ సక్రమంగా జరిగి ప్రాజెక్టులు నిర్మితమైతే కేంద్రం అజమాయిషీ మాత్రమే చేస్తుంది. ప్రస్తుత వివాదానికి కేంద్ర నిర్ణయం ఉపశమనంగా కొందరు అభివర్ణించవచ్చు గానీ దీర్ఘకాలంలో దీని ప్రభావం ఎలా ఉండబోతుందో అన్నది ప్రశ్నగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉంటున్న ప్రభుత్వాలు రాజకీయ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ కారణంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తన అవసరానికి తగినట్టుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల విషయంలో ఏదో ఒకవైపు మొగ్గు చూపవచ్చు. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగింది ఏమీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తు విషయంలో కర్ణాటకతో వివాదం ఏర్పడింది. అప్పుడు కర్ణాటకకు చెందిన దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. నాటి యునైటెడ్‌ఫ్రంట్‌ ప్రభుత్వ సృష్టికర్త అయిన చంద్రబాబు సమస్య పరిష్కారానికై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు నాయకత్వంలో కమిటీ ఏర్పాటు చేయించారు. జ్యోతిబసు వంటి పెద్ద నాయకుడి అభిప్రాయాన్ని ప్రధానిగా ఉన్నప్పటికీ దేవెగౌడ గౌరవించాల్సి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రమే రెండుగా విడిపోయింది. దాయాదుల పోరు మొదలైంది. కలసి కూర్చుంటే ఐదు నిమిషాల్లో పరిష్కారమయ్యే సమస్యను పెద్దది చేసుకున్నారు. కేసీఆర్‌తో గొడవ పడటం ఇష్టం లేని జగన్‌ రెడ్డి మొత్తం ప్రాజెక్టులను కేంద్రం తన అజమాయిషీలోకి తీసుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాశారు. డాక్టర్‌ చెప్పిందీ, రోగి కోరుకున్నదీ ఒక్కటే కావడంతో అధికారాలన్నీ కేంద్రమే తీసుకుంది. ఈ పరిణామానికి కేసీఆర్‌– జగన్‌ రెడ్డి ఇరువురూ బాధ్యులే. ప్రాజెక్టులన్నీ కేంద్రం అజమాయిషీలోకి వెళ్లడం వల్ల తెలుగు రాష్ర్టాలకు మేలు జరిగితే మంచిదే. కీడు జరిగితే అందుకు ఇరువురు ముఖ్యమంత్రులూ బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ను లోతుగా అధ్యయనం చేస్తే గానీ ఈ పరిణామం మంచికో చెడుకో అన్నది స్పష్టంకాదు. ఇప్పటికైతే తెలుగురాష్ర్టాల జుట్టు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది. కృష్ణాబోర్డు ఏర్పాటును తాము అంగీకరించేది లేదని, ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయవలసిందేనని కేసీఆర్‌ చెబుతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవచ్చు. జగన్‌ రెడ్డి ప్రస్తావిస్తున్న లోపాలను కేంద్రం సవరించని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. అంటే, ఉభయ తెలుగురాష్ర్టాలు ఏదో ఒకరకంగా నష్టపోయే ప్రమాదం ఉందన్న మాట. ఈ రకంగా తెలుగు రాష్ర్టాల తిక్క కుదిర్చారు అని అనుకోవాలి! కేంద్రప్రభుత్వంతో పోరాడలేని బలహీనమైన నాయకులు ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు జాతీయ రాజకీయాలలో అత్యంత బలమైన శక్తిగా ఉన్న ప్రధాని ఇందిరాగాంధీని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌.టి.రామారావు లెక్క చేసేవారు కాదు. ‘కేంద్రం మిథ్య’ అని  ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇందిరాగాంధీ వంటి నాయకురాలితో ఢీకొంటున్నారు మీకు భయం లేదా అని ఒకరు ప్రశ్నించగా, ‘నేను దేవుడికి తప్ప ఎవరికీ భయపడను’ అని ఎన్టీఆర్‌ బదులిచ్చారు. ఇప్పుడు తెలుగునాట అటువంటి నాయకులు మచ్చుకు కూడా కనిపించరు. ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై మాత్రమే పెత్తనాన్ని సొంతం చేసుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకేమి అధికారాలు సొంతం చేసుకుంటుందో తెలియదు.


సీఎంలనూ అరెస్టు చేయాలిగా!

ఈ విషయం అలా ఉంచితే, ‘తాకట్టులో భారతదేశం’ అని కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి నాలుగు దశాబ్దాల క్రితం ఒక పుస్తకం రాశారు. జైలులో ఉన్నప్పుడే ఆయన ఆ రచన చేశారు. తరిమెల నాగిరెడ్డి మరెవరో కాదు.. దివంగత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి బావమరిది. అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ప్రభుత్వ పోకడలు నచ్చని కారణంగా శాసనసభలో చరిత్రాత్మక ప్రసంగం చేసి ఆ వెంటనే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ‘యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ కమ్యూనిస్టు రివల్యూషనరీస్‌ ఆఫ్‌ ఇండియా’ (యూసిసిఆర్‌ఐ–ఎంఎల్‌)లో చేరి నాయకత్వం వహించారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే, భారతదేశం సంగతేమో గానీ ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు తాకట్టులోకి వెళ్లిపోతోంది. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా నవరత్నాల పేరిట అలవికాని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలుచేయడం కోసం ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. ఈ అప్పుల భారం ఎంతలా పెరిగిపోతున్నదంటే ఇకపై కేంద్రం నుంచి రాష్ర్టానికి లభించే నిధులను రిజర్వు బ్యాంకు ఎప్పటికప్పుడు జమ చేసుకునేంత వరకు. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం కొత్త కాదు. అయితే చేస్తున్న అప్పులతో ఆస్తులను పెంచుకోవలసి ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలకు అప్పు చేసిన సొమ్మును ఖర్చు చేయకుండా సంక్షేమం పేరిట పంచిపెడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడం కోసం అప్పులు చేసి పప్పు బెల్లాల వలె పంచిపెట్టవచ్చునా అన్నదే ప్రశ్న! రాష్ట్ర ప్రభుత్వం శక్తికి మించి చేస్తున్న అప్పులను ఎవరు తీర్చాలి? కేంద్రానికి సరైన సమాచారం కూడా ఇవ్వకుండా నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించి మరీ అప్పు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కొండలా పెరిగిపోతున్నాయి. తాజా పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి ఎంతో సమయం పట్టదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు లభిస్తాయా? బాధ్యత లేకుండా అప్పులు చేసి రాష్ర్టాన్ని దివాలా తీయించవచ్చా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరైనా ఒక కంపెనీని ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే వ్యక్తిగత పూచీకత్తు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సదరు కంపెనీ లాభాలను ఆర్జించినా ఆ డబ్బును ప్రమోటర్‌ సొంతానికి వాడుకోవడానికి వీలులేదు. లాభాలపై ముందుగా పన్ను చెల్లించి, ఆ తర్వాత డివిడెండ్‌ పన్ను చెల్లించి లాభాలను సొంత ఖాతాలోకి మళ్లించుకోవచ్చు. అప్పుడు మళ్లీ దాన్ని వ్యక్తిగత ఆదాయంగా పరిగణించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చేసిన అప్పుకు వ్యక్తిగత పూచీ ఇచ్చే వ్యాపారికి లాభాలను వాడుకోవాలంటే ఇన్ని దశల్లో పన్ను కట్టాల్సి వస్తున్న మన దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి మాత్రం హద్దూపద్దూ లేకుండా అప్పు చేసే అధికారం ఎందుకుండాలి? సొంత ప్రతిష్ఠ పెంచుకోవడానికి, మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడానికి చేసే ఇటువంటి అప్పులకు సదరు ముఖ్యమంత్రులు వ్యక్తిగత పూచీకత్తు ఎందుకు ఇవ్వకూడదు? స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత దేశంలో పేదరికం పెరిగిపోయినట్టుగా అడ్డగోలు సంక్షేమ పథకాలు అమలు చేయడం ఏమిటి? అందుకోసం అప్పులు చేయడం ఏమిటి? లక్ష రూపాయల మోటారు సైకిల్‌పై రేషన్‌ షాపుకు వెళ్లగలుగుతున్న వ్యక్తికి కిలో బియ్యం రూపాయికి ఇవ్వడం ఏమిటి? ప్రైవేటు కంపెనీలు అప్పుగా తీసుకున్న మొత్తాలను ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తారే, అభివృద్ధి కార్యక్రమాలు అంటూ అప్పులు చేస్తూ ఆ మొత్తాన్ని సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్న ముఖ్యమంత్రులను కూడా అదే నేరం కింద అరెస్టు చేయాలి కదా?


ఇంత ఆర్థిక అరాచకమా?

ఐదేళ్లలో రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని నమ్మబలికిన జగన్‌ రెడ్డి పదిహేనేళ్లపాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుగా పెట్టి మరీ 25 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే పదిహేనేళ్ల పాటు ఆయనే అధికారంలో ఉన్నప్పటికీ మద్యనిషేధం అమలు కాదన్న మాట! భవిష్యత్‌ ఆదాయం తాకట్టు పెట్టి తెచ్చిన 25 వేల కోట్ల రూపాయలను ఏం చేశారంటే ఏం చెబుతారు? ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇచ్చిన నిధులను అందుకు వాడకుండా సంక్షేమ పథకాలు, జీతాల కోసం వాడారు. ఇంటర్మీడియట్‌ బోర్డుకు కేంద్రం ఇచ్చే నిధులను కూడా ఓవర్‌ డ్రాఫ్టులో ఉన్నామంటూ జీతాలకూ, పెన్షన్లకూ వాడారు. రోడ్ల అభివృద్ధి కోసం చేసిన 1,100 కోట్ల రూపాయల అప్పును విద్యాదీవెన పథకానికి వాడారు. స్మార్ట్‌సిటీల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చే నిధులను బిల్లుల బకాయిలకు వాడకుండా సంక్షేమ పథకాలకు వాడారు. ఈ విధంగా నిర్దేశించిన లక్ష్యాలకు కాకుండా ఇతరత్రా అవసరాలకు నిధులను మళ్లించడం తీవ్రమైన ఆర్థికనేరం అవుతుంది. ఇదే నేరానికి పాల్పడే ప్రైవేటు వ్యక్తులపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా జైలుకు పంపాలి కదా! ప్రభుత్వాలకు మినహాయింపు ఏమీ లేదు. అయినా ఎంత కాలం ఇలా? ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా చెల్లించడం లేదు. ఉపాధి హామీ పథకం కింద రెండేళ్ల క్రితం చేపట్టిన పనులకు ఈ నెలాఖరులోపు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం తాజాగా ఆదేశించింది. దీంతో ప్రభుత్వం వద్ద బకాయిలు పెండింగ్‌ ఉన్నవారందరూ హైకోర్టుకు క్యూ కడుతున్నారు. రబీ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇవ్వాల్సిన 3,400 కోట్ల రూపాయల చెల్లింపునకే దిక్కు లేకుండా పోయింది. నెలలు గడుస్తున్నా సొమ్ము అందక రైతులు రోడ్డెక్కుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఓవర్‌డ్రాఫ్టు క్లియర్‌ చేయడానికి కూడా సరిపోవడం లేదు. మున్ముందు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కూడా పుట్టదు. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పథకం అంటూ పది వేల కోట్ల రూపాయలు అప్పు చేయడాన్ని నాతోపాటు ఎంతో మంది ఆక్షేపించారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి అప్పు చేయడంలో అన్ని పరిధులూ దాటారు. ఆయన చేస్తున్న అప్పులకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో పాటు ఇడుపులపాయలోని తన ఆస్తులను తాకట్టు పెట్టడం లేదు. ప్రజల జీవితాలను, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. ఆస్తులు పెరగకుండా అప్పులు మాత్రమే పెరగడం అనర్థదాయకం. వెనుజులా దేశానికి జగన్‌ లాంటి వాడే అధ్యక్షుడై ప్రజలకు డబ్బు పంచిపెట్టాడు. ఫలితంగా సిరిసంపదలతో తులతూగిన ఆ దేశం ఇప్పుడు అప్పులపాలై ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పొట్టకూటి కోసం మహిళలు వ్యభిచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకోవడంలో తప్పు లేదుగా! జగన్‌ ప్రభుత్వం చేసే అప్పుల వల్ల ఆయన కోల్పోయేది ఏమీ ఉండదు. అధికారం కోల్పోతే బెంగళూరుకో, హైదరాబాద్‌కో మకాం మారుస్తారు. అప్పులు కట్టవలసింది ప్రజలే. అదెలాగంటే, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం ఎడాపెడా పన్నులు వేస్తారు. ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసి పన్నులతో అప్పులను తిరిగి చెల్లించే ప్రయత్నాన్ని తదుపరి ప్రభుత్వాలు విధిగా చేయాల్సి ఉంటుంది. జగన్‌ రెడ్డి నిర్ణయాలను, పథకాలను గుడ్డిగా సమర్థిస్తున్నవారిలో కొందరు హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ, మిగతా కొందరు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నారు. వారిపైన కూడా భవిష్యత్తులో పన్నుల భారం పడుతుందని తెలుసుకుంటే మంచిది. ఏ ముఖ్యమంత్రి కూడా తన జేబులోంచి తీసి ఖర్చు చేయడు. ప్రజలను సంక్షేమ పథకాల మత్తులో ముంచుతూ ప్రభుత్వాన్ని అప్పులపాల్జేస్తారు. అదే సమయంలో తమ జేబులూ నింపుకొంటారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి చేస్తున్నది ఇదే. పౌరసమాజం మేల్కొనని పక్షంలో మూల్యం చెల్లించక తప్పదు. సంపద సృష్టించకుండా ప్రభుత్వ ఆస్తులను అయినకాడికి అమ్మేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని అనుకోవడం క్షమించరాని నేరం. ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా వచ్చే సొమ్ము సంక్షేమానికి ఖర్చు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారు. తెలంగాణలో లెక్కలేనంత ప్రభుత్వ భూమి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అది కూడా లేదు. అందుకే ఎప్పుడో తాతలనాడు నిర్మించిన భవనాలను కూడా తాకట్టు పెడుతున్నారు. మనం ఒక చోట ఆస్తిని అమ్మితే మరొకచోట ఏదో ఒకటి కొనుగోలు చేస్తాం కదా! ఈ సూత్రం ప్రభుత్వాలకు వర్తించదా? చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ సొంత పాపులారిటీ కోసం ముఖ్యమంత్రులు ఆర్థిక అరాచకానికి పాల్పడడం క్షమించరాని నేరం. ఇలాంటి ముఖ్యమంత్రులను పౌరసమాజమే నిలువరించాలి!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-07-18T05:42:34+05:30 IST