కరోనా రోగులకు ‘ప్రాణ’ దాత.. శెభాష్‌ ఆటోవాలా.. నూరేళ్లు వర్థిల్లు!

ABN , First Publish Date - 2021-05-10T18:59:50+05:30 IST

నలుగురుకీ సాయం చేయాలనే తపన ఉంటే చాలు.. దానికి హోదా, పేరు అవసరం లేదు.

కరోనా రోగులకు ‘ప్రాణ’ దాత.. శెభాష్‌ ఆటోవాలా.. నూరేళ్లు వర్థిల్లు!

చెన్నై/అడయార్‌ : నలుగురుకీ సాయం చేయాలనే తపన ఉంటే చాలు.. దానికి హోదా, పేరు అవసరం లేదు. తనకు వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కొవిడ్‌ బాధితులకు సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు ఓ ఆటోవాలా.. సాధారణంగా రోగులను చూస్తే ఆమడదూరం పారిపోతున్న రోజులివీ.. కానీ, ఓ ఆటో డ్రైవర్‌ మాత్రం కరోనా రోగుల పాలిట ప్రాణదాతగా మారాడు. ప్రాణవాయువు కోసం పరితపించే కరోనా రోగులను తన ఆటోలో ఎక్కించి, వారికి ఆక్సిజన్‌ అందిస్తూ, సురక్షితంగా ఆస్పత్రికి చేర్చుతున్నాడు. 


కరోనా కష్టకాలంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక సంస్థను ప్రారంభించిన ఈ ఆటోడ్రైవర్‌ సేవాగుణాన్ని చూసిన ప్రతి ఒక్కరూ శెభాష్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. ఆ ఆటోడ్రైవర్‌ పేరు వసంత్‌కుమార్‌. ఉత్తర చెన్నై వాసి. ఈయన తన ప్రాణాలను లెక్కచేయ కుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా రోగులకు సేవ చేస్తున్నాడు. కరోనా వెరస్‌ రెండో దశ వ్యాప్తిలో అనేక మంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. ఇలాంటి వారిలో అనేక మందికి ఆక్సిజన్‌ స్థాయి పడి పోతోంది. ఇలాంటివారిలో అనేక మంది ఈ ఆక్సిజన్‌ లభించక ప్రాణాలు కోల్పోతున్నారు.


ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో వసంతకుమార్‌ రెండు ఆటోలను తయారు చేయించుకున్నారు. ఈ ఆటోల్లో ఆక్సిజన్‌ సిలిండర్‌ అమర్చేందుకు ఏర్పాటు చేశారు. తర్వాత తనను సంప్రదించే కరోనా రోగులను ఆక్సిజన్‌ సౌకర్యంతో ఆస్పత్రికి సురక్షితంగా తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర చెన్నైలో రోగులకు సేవలు అందిస్తున్నారు. పైగా ఈ ఆటోలో సాధారణ అవసరాలకు కూడా ప్రయాణించవచ్చు. దీనిపై స్థానిక ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, ఆపత్కాలంలో ఈ తరహా ఆటోలు, ఇలాంటి వ్యక్తులు వుండటం చాలా ముఖ్యమన్నారు. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేలా ఈ ఆటో ఉందని వారు చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఆటోడ్రైవర్‌ కరోనా రోగులను తరలించే సమయంలో పీపీఈ కిట్లు ధరించి, వ్యక్తిగతంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. శెభాష్‌ వసంత్‌కుమార్‌.. నూరేళ్లు వర్థిల్లు!.

Updated Date - 2021-05-10T18:59:50+05:30 IST