ఆయువు తీరాక వాయువు

ABN , First Publish Date - 2021-06-23T06:40:22+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో వైద్య సదుపాయాల కొరతను తేటతెల్లం చేసింది. వైరస్‌ దాడితో వచ్చే లక్షల కేసుల తాకిడికి సరిపడా వైద్య సదుపాయాలు అందక ఇవన్నీ విలవిల్లాడాయి.

ఆయువు తీరాక వాయువు

జిల్లాలో ప్రస్తుత సెకండ్‌ వేవ్‌ కొవిడ్‌లో                      సమయానికి ప్రాణవాయువు అందక వేల ఆయువులు విలవిల్లాడాయి. రోజుల తరబడి ఎదురుచూసినా ఆక్సిజన్‌ బెడ్‌లు దొరక్క   కన్నుమూసిన వారి సంఖ్యకు లెక్కలేదు.  ఒకవేళ ఆసుపత్రికి వెళ్తే ఎక్కడ ఆక్సిజన్‌ అందక చనిపోతామోననే భయంతో బాధితులు ఆక్సిజన్‌    సిలిండర్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఏకంగా ఒక్కో సిలిండర్‌ బ్లాకులో రూ.70 వేలకు కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.    ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరతపై ఎట్టకేలకు ప్రభుత్వం కళ్లుతెరిచింది. మూడో వేవ్‌ ముప్పు కూడా పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైంది. అందుకోసం కాకినాడ   జీజీహెచ్‌, రాజమహేంద్రవరం డీహెచ్‌,    ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో కొత్తగా సెంట్రలైజ్డ్‌ ఆక్సిజన్‌ పైపులైన్‌ వ్యవస్థ ఏర్పాటుకు, మరమ్మతులకు సిద్ధమైంది. రూ.2.15 కోట్లతో పనులకు టెండర్లు పిలిచింది.
 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లోటు గుణపాఠంతో కళ్లు తెరిచిన ప్రభుత్వం
 సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత అనుభవాలు, మూడో వేవ్‌ ముప్పు నేపథ్యంలో అప్రమత్తం
 యుద్ధప్రాతిపదికన జీజీహెచ్‌, డీహెచ్‌, ఏరియా, సీహెచ్‌సీల్లో కొత్తగా పైపులైన్ల నిర్మాణం
 జీజీహెచ్‌, డీహెచ్‌లో రూ.60.97 లక్షలతో ఆక్సిజన్‌ పైపులైన్‌ సామర్థ్యం పెంపునకు టెండర్లు
 అమలాపురం, రామచంద్రపురం, తుని ఆసుపత్రుల్లో రూ.79.36 లక్షలతో సెంట్రల్‌ పైపులైన్‌ వ్యవస్థ
 మరో ఎనిమిది సీహెచ్‌సీల్లో రూ.75.15 లక్షలతో కొత్తగా ఆక్సిజన్‌ పైపులైన్‌ వ్యవస్థ నిర్మాణం
 పనులకు టెండర్లు పిలిచిన ఏపీఎంఎస్‌ఐడీసీ..  బిల్లుల భయంతో బిడ్‌లు దాఖలుపై అనుమానం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో వైద్య సదుపాయాల కొరతను తేటతెల్లం చేసింది. వైరస్‌ దాడితో వచ్చే లక్షల కేసుల తాకిడికి సరిపడా వైద్య సదుపాయాలు అందక ఇవన్నీ విలవిల్లాడాయి. కనీసం ప్రాణవాయువు కూడా అందించలేని దుస్థితితో తలదించుకున్నాయి. ఏరియా,          సీహెచ్‌సీలు అయితే కొవిడ్‌ చికిత్సకు అక్కరకు రాక సదుపాయాల వైఫల్యాలతో కొట్టుమిట్టాడా యి. సెకండ్‌వేవ్‌లో జిల్లాలో రోజూ పుట్టుకు వచ్చే వేల పాజిటివ్‌లతో బాధితులు ఆసుపత్రు ల్లో ఆక్సిజన్‌ బెడ్‌ కోసం పడిగాపులు కాశారు. చెంతనే ఏరియా, సీహెచ్‌సీలున్నా అక్కడ ఇవేవీ అందే పరిస్థితి లేకపోవడంతో జీజీహెచ్‌, డీహెచ్‌లకు పోటెత్తారు. ఇక్కడ కూడా చాలినన్ని పడకలు లేకపోవడంతో సమయానికి బెడ్‌ దొరక్క అనేకమంది ప్రాణాలొదిలారు. తర్వాత ఆలస్యం గా మేల్కొన్న అధికారులు ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలకు ఆక్సిజన్‌ సిలిండర్లు రప్పించి అప్పటికప్పుడు కొంతలోకొంత ఉపశమన చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ఇవి ఖాళీ అవడంతో మళ్లీ ఆక్సిజన్‌ కోసం పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కేసుల దాడితో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల డొల్లతనం, బాధితుల మృతి ప్రభుత్వానికి గుణపాఠం నేర్పింది. అటు మళ్లీ మూడో వేవ్‌ పొంచి ఉండడం, జిల్లాలో రెండు లక్షల కేసుల వరకు వచ్చే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆగ మేఘాలపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్ల వ్యవస్థ ఏర్పాట్లు, మురమ్మతులు చేయాలని నిర్ణయించింది. దీంతో అధికారులు జిల్లాలో పలు ప్రభుత్వ ఆసు పత్రులకు సంబంధించి వీటి ఏర్పాటుకు అంచనాలు వేసి ఖర్చుపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో వీటిలో సదుపాయాల ఏర్పాటుకు ఎట్టకేలకు ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్‌ఐడీసీ) టెండర్లు పిలిచింది. అందు లోభాగంగా కాకినాడ జీజీహెచ్‌లో ప్రస్తుత ఆక్సిజన్‌ పైపులైను వ్యవస్థను మరో 150 పడకలకు పొడిగిం చేలా సింగిల్‌లైన్‌, మరో 50 పడకలకు డబుల్‌లైన్‌ పైపులైన్‌ పొడిగించనున్నారు. ఇందుకు రూ.40.34లక్షలతో పనులు చేయడానికి వీలుగా అధికారులు టెండర్లు పిలిచారు. రాజమహేంద్రవరంలో జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్‌ పైపులైన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రూ.20.63 లక్షలు కేటాయించారు. కోనసీమ మొత్తానికి పెద్దదిక్కు అమలాపురం ఏరియా ఆసుపత్రి. కానీ ఇక్కడ కొవిడ్‌కు సంబంధించి ఐసీయూ పడకలు చాలా తక్కువ. ఆక్సిజన్‌ వ్యవస్థ కూడా లేదు. ఈనేపథ్యంలో ఆసుపత్రిలో సెంట్రల్‌ ఆక్సి జన్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇక్కడ ఆక్సి జన్‌ ట్యాంకు నిర్మాణానికి కూడా అడుగులు పడ్డాయి. ఈనేపథ్యంలో ట్యాంకు నుంచి ఆసుపత్రిలో ఐసీయూ పడకలకు, ఆక్సిజన్‌ బెడ్‌లకు మూడంచెల ప్రాణవాయు వు వ్యవస్థ ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. అద నంగా 20 ఐసీయూ, 5 నాన్‌ఐసీయూ పడకలను రూ.రూ.24.77 లక్షలతో ఏర్పాటు చేయనున్నారు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో కొత్తగా ఆక్సిజన్‌ పైపులైన్‌ వ్యవస్థ ఏర్పాటు, మరమ్మతులు, 20 ఐసీయూ,          14 నాన్‌ ఐసీయూ పడకలకు పూర్తిస్థాయి ఆక్సిజన్‌ వసతి కల్పించడానికి రూ.24.31 లక్షలతో పనులు ప్రతిపాదించారు. వీటికి తాజాగా టెండర్లు పిలిచారు. అలాగే తుని ఏరియా ఆసుపత్రిలో 20 ఐసీయూ, 28 నాన్‌ ఐసీ యూ పడకలు, కేంద్రీకృత ఆక్సిజన్‌ వ్యవస్థ ఏర్పాటుకు రూ.30.28 లక్షలు కేటాయించారు. ప్రత్తిపాడు సీహెచ్‌సీ లో 10 ఎస్‌ఎన్‌సీయూ, 30 నాన్‌ఐసీయూ బెడ్స్‌కు ఆక్సి జన్‌ వ్యవస్థ ఏర్పాటుకు రూ.18.32 లక్షలతో టెండర్లు పిలిచారు. రాజోలు, కొత్తపేట, పి.గన్నవరం సీహెచ్‌సీల ఆధునికీకరణ, ఆక్సిజన్‌ సరఫరాకు రూ.29.83 లక్షలు, అడ్డతీగల, గోకవరం, ఏలేశ్వరం తదితర సీహెచ్‌సీల్లో ప్రస్తుత ఆక్సిజన్‌ లైన్ల ఏర్పాటు, ఉన్నవి ఆధునికీకరణకు రూ.27.82 లక్షలు వెచ్చించనున్నారు. ఇక అమలాపురం లో రూ.13.97 లక్షలతో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రభుత్వం వివిధ పనులకు పిలిచే టెండర్లకు చెల్లింపులు ఆలస్యమవుతోందనే కారణంతో పలువురు కాంట్రాక్టర్లు టెండర్ల దాఖలుకు ముందుకు రావడం లేదు. అమలాపురంలో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టింగ్‌ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే ఓసారి టెండర్‌ పిలిచినా కాంట్రాక్టర్లు రాలేదు. దీంతో రెండోసారి పిలవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో అక్టోబర్‌ నాటికి మూడోవేవ్‌ వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆక్సిజన్‌ వ్యవస్థ ఏర్పాటు పూర్తవుతుందో, లేదో వేచిచూడాలి.


Updated Date - 2021-06-23T06:40:22+05:30 IST