ధ్వని కాలుష్యం నివారించండి

ABN , First Publish Date - 2020-08-06T06:37:46+05:30 IST

వాహన ధ్వని కాలుష్యం నానాటికీ మితిమీరుతున్నది. ప్రత్యేకించి ‘బుల్లెట్‌’ బైక్‌ పునరాగమనం తర్వాత ఈ సమస్య వికృతరూపం దాల్చింది. అందరూ గాఢనిద్రలో ఉండే అర్ధరాత్రి...

ధ్వని కాలుష్యం నివారించండి

వాహన ధ్వని కాలుష్యం నానాటికీ మితిమీరుతున్నది. ప్రత్యేకించి ‘బుల్లెట్‌’ బైక్‌ పునరాగమనం తర్వాత ఈ సమస్య వికృతరూపం దాల్చింది. అందరూ గాఢనిద్రలో ఉండే అర్ధరాత్రి సమయంలో ప్రశాంతతను భగ్నం చేస్తూ బైకులు వీరవిహారం చేస్తున్నాయి. ఆ బైకులతో వచ్చే ఒరిజనల్‌ సైలెన్సర్లను తీసివేసి, విపరీత శబ్దాలు చేసే ప్రత్యేక సైలెన్సర్లు బిగించే కార్ఖానాలు అనేకచోట్ల వెలిశాయి. వాహన ధ్వని కాలుష్య నియంత్రణ చట్టాలు ఉన్నా పోలీసు యంత్రాంగం అనాసక్తత వల్ల అవి నిరుపయోగింగా మిగిలాయి. సెక్షన్‌ 190(2), 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం బైకులతో వచ్చే సైలెన్సర్లను, హారన్లను మార్చడం నిషేధం. ధ్వని కాలుష్యాన్ని పరిమితుల్లో ఉంచడానికి అవసరమైన ఇతర నిబంధనలు ఆ చట్టంలో ఉన్నాయి. బైకులపై వెనుక కూర్చునేవారు కూడా హెల్మెట్‌ ధరించాలంటూ నిబంధనలు అమలుచేస్తున్న పోలీసు యంత్రాంగానికి, ధ్వని కాలుష్య నియంత్రణ చట్టాలు పట్టకపోవడం విచిత్రం -విషాదం. అంటే మా ఇష్టమొచ్చిన చట్టాలను, ఇష్టమొచ్చిన రీతిగా అమలుచేస్తామనే నిరంకుశ ధోరణి ఇది! పసిపిల్లలు, వృద్ధులు, రోగులు, ఇతర ప్రజానీకం కూడా ఈ బైకుల ధ్వని కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే విపరీతమైన వత్తిళ్ళతో నిండిన నగర జీవనం, ఈ బైకువీరుల ఆగడాలతో మరింత జటిలమవుతున్నది. ఇప్పటికైనా ఈ సమస్యపై దృష్టి పెట్టి, ధ్వని కాలుష్య నియంత్రణకు వీరిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి.

బి. నాగేశ్వరరావు

హైదరాబాద్

Updated Date - 2020-08-06T06:37:46+05:30 IST