స్వామి కొలువుకు మేలుకొలుపు

ABN , First Publish Date - 2021-12-17T05:30:00+05:30 IST

శ్రీఆండాళ్‌గా వినుతికెక్కిన గోదాదేవి ప్రవచించిన ‘తిరుప్పావై’

స్వామి కొలువుకు మేలుకొలుపు

 శ్రీఆండాళ్‌గా వినుతికెక్కిన గోదాదేవి ప్రవచించిన ‘తిరుప్పావై’ పాశురాలు అనన్యమైన భక్తికి అద్వితీయమైన నిదర్శనాలు. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడికి కుమార్తె అయిన గోదాదేవి శ్రీకృష్ణ భక్తురాలు. ఆయననే తన పతిగా భావించి, ఆయనను పొందడం కోసం ధనుర్మాసంలో నెలరోజుల పాటు వ్రతం చేసింది. ఈ సందర్భంగా ఆమె రోజుకొక్కటిగా ఆలపించిన పాశురాలు ‘తిరుప్పావై’గా ద్రవిడ భక్తి సాహిత్యంలో అఖండ కీర్తిని ఆర్జించాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు ఆటపట్టులైన ఈ పాశురాల్లో తన గ్రామాన్నే వ్రేపల్లెగా, తన స్నేహితులను గోపికా సమూహంగా గోదాదేవి సంభావించింది. 


శ్రీ (ధనుర్మాస) వ్రతం గురించి తన సఖులకు వివరిస్తూ తొలి పాశురాన్ని ఆమె గానం చేసింది. శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని సంపాదించడానికి ‘మార్గళి’ (మార్గశిర) మాసం అనువైనదంటూ ఈ మాసం గొప్పతనాన్ని వర్ణించింది. శ్రీకృష్ణుడి ప్రేమను పొందాలనే కోరిక ఉన్నవారందరూ ఆ వ్రతాన్ని చేయడానికి అర్హులేననీ, జాతుల్లాంటివేవీ అడ్డంకి కాదనీ పేర్కొంటూ... నారాయణుడు మనకు ఇచ్చిన లక్షణాలను గొల్లతనంగా, ఆ నల్లనయ్య సేవల్లో తరించడమే యౌవనంగా, ఆయన ఆజ్ఞలను అనుసరించడం స్త్రీత్వంగా, ఆయన అనుగ్రహాన్ని తప్ప వేరేదీ ఆశించకపోవడమే సంపదగా రెండో పాశురంలో పేర్కొంది. ఈ నాలుగు లక్షణాలు ఉన్నవారే ‘శ్రీకృష్ణుడి పరివారం’ అని వెల్లడించింది.


ఆ వ్రతం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మూడో పాశురంలో తెలియజేస్తూ... ‘దేహం, ఆత్మల మీద ఉన్న అభిమానం, స్వతంత్రులమనే ఆలోచన, ఇతరులకు దాస్యం చేయడం, స్వరక్షణ స్వాన్వయం, బంధుచాపల్యం, విషయ విలాసాలు’ అనే ఆరు దోషాలు ఈ వ్రతం చేయడం వల్ల నివృత్తి అవుతాయని, జ్ఞానం వికసిస్తుందని చెప్పింది. ఇక, వర్షాలు కురిపించాల్సిందిగా శ్రీమన్నారాయణుడిని కొలిచే వరుణ దేవుణ్ణి నాలుగో పాశురంలో కోరింది.  పాపాలన్నీ తొలగిపోవడానికీ, సకల పుణ్య ఫలాలనూ పొందడానికీ ఏ పేర్లతో స్వామిని ప్రార్థించాలో, అర్చామూర్తిని ఎలా సంభావించాలో అయిదో పాశురంలో తెలిపింది. ఆరో పాశురంలో బాహ్య పరిస్థితులను వెల్లడి చేస్తూ, శ్రీకృష్ణుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడానికి మేలుకోవాల్సిందిగా పదిమంది గోపికలను ఆమె కోరింది.


మొదటి గోపికను ఏడో పాశురంలో నిద్ర లేపుతూ... తెల్లవారుతోందని హెచ్చరిక చేసింది. ఇంకా నిద్రలేవని మూడో గోపికను ఎనిమిదో పాశురంలో మేలుకొలుపుతూ... తెల్లవారుతోందనీ, మేత కోసం పశువులు పచ్చిక బయళ్ళలోకి వచ్చేశాయనీ, అందరూ ఆ భగవంతుడి సేవకు సిద్ధపడుతున్నారనీ, త్వరగా మేలుకోవాలనీ అప్రమత్తం చేసింది. ఇక్కడ పశువులను జ్ఞాన రాహిత్యానికీ, చీకటికీ చిహ్నాలుగా పండితులు పేర్కొన్నారు. వెలుగు రాగానే ఈ లక్షణాలు తొలగిపోతాయి. చీకటి పడగానే తిరిగి వస్తాయి. అవి తిరిగి వచ్చినప్పుడు... వాటి నుంచి ‘మంచి విషయాలు’ అనే పాలను తీసుకోవాలి. తరువాత వాటిని బయటకు పంపెయ్యాలి. గురువు ద్వారా ‘జ్ఞానం’ అనే వెలుగును ఎల్లప్పుడూ మనలో నిలుపుకోవాలి. అప్పుడు చెడు లక్షణాలు’ అనే చీకటి మన దరి చేరదు. ఆ నిరంతర జ్ఞానంతో పరమాత్మకు చేరువకావడం సాధ్యమవుతుంది. ఈ విధంగా స్వామి కొలిచేందుకు రమ్మంటూ మేలుకొలుపులను ఆమె కొనసాగించింది. 


 గురువు ద్వారా ‘జ్ఞానం’ అనే వెలుగును ఎల్లప్పుడూ మనలో నిలుపుకోవాలి. అప్పుడు .చెడు లక్షణాలు’ అనే చీకటి మన దరి చేరదు. ఆ నిరంతర జ్ఞానంతో పరమాత్మకు చేరువకావడం సాధ్యమవుతుంది. 


Updated Date - 2021-12-17T05:30:00+05:30 IST