Abn logo
Oct 27 2021 @ 23:06PM

వాతావరణ మార్పులను అరికట్టేందుకు చైతన్యం తీసుకురావాలి

సమావేశంలో మాట్లాడుతున్న పురుషోత్తంరెడ్డి

  • ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి 


ఆమనగల్లు : వాతావరణ మార్పులను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్త ఉద్యమ నిర్మాణం దిశగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి అన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదుర వుతున్న పర్యవసనాలు నిత్యం ఏదో ఒకచోట బహిర్గత మవుతున్నా.. దాన్ని నివారించే దిశగా చర్యలు లేకపోవడం భవిష్యత్‌ తరాల మనుగడకు ప్రమాదమని ఆయన హెచ్చ రించారు. ఈనెల 31 నుంచి నవంబర్‌ 12వ తేదీ వరకు వాతావరణ మార్పులపై నిర్వహించే కాప్‌-26 ప్రపంచస్థాయి సదస్సుకు సమాంతరంగా నిర్వహించే ప్రజా సమీక్ష సమావేశాలపై బుధవారం కడ్తాల మండలం అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని ది ఎర్త్‌ సెంటర్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ సంస్థ చైర్మన్‌ లీలాలక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి, జీవ వైవిధ్య అటవీ రంగ నిపుణులు డాక్టర్‌ కె. తులసీరామ్‌, మాజీ సమాచార హక్కు చట్టం కమిషనర్‌ ఆర్‌. దిలీప్‌రెడ్డి, ది ఎర్త్‌ సెంటర్‌ డైరెక్టర్‌ సాయిబాస్కర్‌ రెడ్డి, కోర్పోలు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాతావరణ మార్పులపై ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో స్కాట్‌లాండ్‌ దేశంలోని గ్లాస్గో నగరంలో జరుగుతున్న శిఖరాగ్ర సమావేశానికి సమాంతరంగా నిర్వహించే ప్రజాసమీక్ష సమావేశాల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. అన్మాస్‌పల్లి ది ఎర్త్‌ సెంటర్‌  కేంద్రంగా 13 రోజులపాటు కొనసాగే పర్యావరణ మార్పుల ప్రజా సమీక్ష సమావేశ వివరాలను ఈ సందర్బంగా వారు వెల్లడించారు. గ్లాస్గో నగరంలో నిర్వహించే సదస్సులో జరుగుతున్న చర్చ సరళిని పరిశీలిస్తూ అక్కడ తీసుకున్న నిర్ణయాలను అవలోకిస్తూ ప్రజా సమీక్ష సమావేశాలలో సునిశిత విశ్లేషణ చేయడం జరుగుతుందని కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ చైర్మన్‌ లీలాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో భట్టు నర్సిరెడ్డి, కృష్ణ, భాస్కర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌ రెడ్డి, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.