కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-13T06:33:07+05:30 IST

జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ పట్ల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు.

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మట్లాడుతున్న మంత్రి బాలినేని, పక్కన ఎంపీ మాగుంట, కలెక్టర్‌ భాస్కర్‌, నగర మేయర్‌ సుజాత

నేడోరేపో జిల్లాకు 60వేల డోసుల వ్యాక్సిన్‌

24న రిమ్స్‌లో సీటీ స్కాన్‌ ప్రారంభం

మంత్రి బాలినేని వెల్లడి

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 12 : జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ పట్ల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో సోమవారం ఆయన కరోనాపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం  విలేకరులతో మాట్లాడారు. అందరూ మాస్కులు ధరించడంతోపాటు, భౌతికదూరం పాటించాలన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోవడం ద్వారా కొవిడ్‌ బారినపడకుండా ఉండవచ్చని తెలిపారు. జిల్లాకు మంగళ, బుధవారాల్లో 50వేల నుంచి 60వేల డోసుల వ్యాక్సిన్‌ వస్తుందని తెలిపారు. రిమ్స్‌లో ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించి కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో ఈనెల 24న సీటీస్కాన్‌, ఎంఆర్‌ఐని ప్రారంభిస్తామని తెలిపారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ టెస్టులతో పాటు వ్యాక్సినేషన్‌, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, జేసీ చేతన్‌, కందుకూరు సబ్‌కలెక్టర్‌ భార్గవ్‌తేజ, మేయర్‌ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్‌ వేమూరి సూర్యనారాయణ, అధికారులు రత్నావళి, ఉషారాణి, శీనారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పద్మజ పాల్గొన్నారు. 


విద్యుత్‌ చార్జీలు పెంచలేదు

ఒంగోలు (క్రైం): విద్యుత్‌ చార్జీలను పెంచలేదని, కేవలం అది ప్రతిపక్షాల సృష్టేనని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక గుంటూరు రోడ్డ్‌లో రూ1.7కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్‌స్టేషన్‌ పనులకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలు క్రమబద్ధీకరణ జరిగాయి తప్ప పెరగలేదన్నారు. కాగా మంగమూరు రోడ్డు విద్యుత్‌ కేంద్రం నుంచి కర్నూలు రోడ్‌ పవర్‌ ఆఫీసు వరకు ఏర్పాటుచేస్తున్న 132 కేవీ అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ పనులను మంత్రి పరిశీలించారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎన్‌.రామచంద్రారెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ కెవీజీసత్యనారాయణ, డీఈ ఖరీం, ఏడీఈ వినయ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌, రామాంజనేయులు, ఏఈలు శివప్రసాద్‌, మోహన్‌రావు, రామోహన్‌, డి.వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు పటాపంజుల సుబ్బారావు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T06:33:07+05:30 IST