నిందితులు ఎంతటివారైనా శిక్షార్హులే

ABN , First Publish Date - 2021-07-31T05:58:06+05:30 IST

అత్యాచారాలు, లైంగిక వేధింపులు, మహిళలపై దాడులలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే ఎంతటి వారైనా సహించేది లేదని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

నిందితులు ఎంతటివారైనా శిక్షార్హులే

దిశ యాప్‌పై అవగాహన సదస్సులో మంత్రి బాలినేని

ఒంగోలు(క్రైం), జూలై 30: అత్యాచారాలు, లైంగిక వేధింపులు, మహిళలపై దాడులలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే ఎంతటి వారైనా సహించేది లేదని  విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ కల్యాణమండపంలో దిశ యాప్‌పై విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు. మహిళల రక్షణ కోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళాల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో ఇచ్చిన ప్రాధాన్యతే అందుకు నిదర్శనమన్నారు. ఎస్పీ మలిక గర్గ్‌ మాట్లాడుతూ  బాలికలు అప్రమత్తంగా ఉండాలని, బయట సమాజంలో విపరీత ధోరణులు ఉండటంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేని స్థితిలో కొందరు కుంగిపోతున్నారన్నారు. మనోధైర్యం పెంపొందించుకోవాలన్నారు. దిశ చట్టం తీసుకురావడం ద్వారా మహిళలకు భరోసా కల్పించినట్లయిందన్నారు. ప్రతి ఒక్కరు సెల్‌ఫోన్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. మేయర్‌ గంగాడ సుజాత, మహిళా కమిషన్‌ సభ్యురాలు టి.రమాదేవి, సీడబ్ల్యూసీ మెంబర్‌ పద్మావతి మాట్లాడారు. దిశ యాప్‌ను అధికంగా డౌన్‌లోడ్‌ చేయించిన మహిళా పోలీసులు, వలంటీర్లకు మంత్రి చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఓఎస్‌డీ కె.చౌడేశ్వరి, దిశ డీఎస్పీ ధనుంజయుడు, ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాసరెడ్డి, రాంబాబు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-31T05:58:06+05:30 IST