దూసుకొస్తున్నాడు

ABN , First Publish Date - 2021-02-28T09:43:17+05:30 IST

స్వదేశంలో ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ అనగానే స్పిన్నర్‌ జడేజా లేని లోటు కనిపిస్తుందని అంతా అంచనా వేశారు. స్వదేశీ స్పిన్‌ ట్రాక్‌లపై జడేజా తరహా బౌలింగ్‌ అధిక ప్రభావం చూపేదని భావించారు...

దూసుకొస్తున్నాడు

స్వదేశంలో ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ అనగానే స్పిన్నర్‌ జడేజా లేని లోటు కనిపిస్తుందని అంతా అంచనా వేశారు. స్వదేశీ స్పిన్‌ ట్రాక్‌లపై జడేజా తరహా బౌలింగ్‌ అధిక ప్రభావం చూపేదని భావించారు. ఇక.. అశ్విన్‌-జడ్డూ జోడీ 33 టెస్టుల్లో 348 వికెట్లతో భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. అందుకే 2012-13 నుంచి సొంత గడ్డపై కోహ్లీ సేన టెస్టు సిరీస్‌ కోల్పోలేదు. కానీ జడ్డూ లోటును తీరుస్తూ.. అనుకోని వరంలా భారత టెస్టు జట్టుకు అక్షర్‌ పటేల్‌ లభించాడు.


ఇంగ్లండ్‌తో తొలి టెస్టులోనే ఆడాల్సి ఉన్నా గాయం కారణంగా దూరమయ్యాడు. కానీ ఆ తర్వాత అరంగేట్రంలోనే ఏడు వికెట్లు.. గులాబీ టెస్టులో 11 వికెట్లతో గోల్డెన్‌ హ్యాండ్‌గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో జడ్డూ బౌలింగ్‌ను మిస్‌ అయ్యామనే ఆలోచన అక్షర్‌ భారత జట్టుకు కలగనీయలేదు. వాస్తవానికి జడేజా, అక్షర్‌ బౌలింగ్‌ శైలికి సారూప్యముంది. అతడి తరహాలోనే అక్షర్‌ కూడా బంతిని ఎక్కువగా టర్న్‌ చేయడు. కచ్చితత్వంతో పాటు కాస్త పేస్‌ను కూడా కలగలిపి ఆర్మ్‌ బాల్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను అయోమయంలో పడేస్తాడు. దీంతో అసలా బంతిని ఎలా ఆడాలో వారికి అర్థం కాదు. ఈ విధంగానే మొతేరాలో జానీ బెయిర్‌స్టోను ఎల్బీ చేయడం హైలైట్‌గా నిలిచింది. బంతి టర్న్‌ అవుతుందని అతడు భావించే సరికే ఆలస్యమైంది.తొలి ఇన్నింగ్స్‌లో తీసిన ఆరు వికెట్లలో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ ఇలా స్ట్రెయిట్‌ బంతులకే దొరికిపోవడం విశేషం. అందుకేనేమో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించడంలో అక్షర్‌ ముందుంటాడని మ్యాచ్‌ తర్వాత పర్యాటక జట్టు ఓపెనర్‌ క్రాలే ప్రశంసించాడు. బంతిని వదలాలా.. వద్దా అనే కాకుండా, ఒకవేళ ఆడితే ఫ్రంట్‌ ఫుట్‌ షాటా లేక బ్యాక్‌ ఫుట్‌ షాటా కూడా వారికి అర్థం కావడం లేదు. తమ బలం, పరిమితులు ఏమిటో జడేజా, అక్షర్‌ పటేల్‌లకు తెలుసని, దానికి కట్టుబడి బంతులు వేయడం వల్లే రాణిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా వచ్చిన అవకాశాన్ని ఈ గుజరాత్‌ ఆల్‌రౌండర్‌ అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆడిన రెండు టెస్టుల్లోనే రికార్డు స్థాయి ప్రదర్శనతో 18 వికెట్లు తీసి భవిష్యత్‌ స్పిన్‌ ఆశాకిరణంగా నమ్మకం కలిగిస్తున్నాడు.



(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)


Updated Date - 2021-02-28T09:43:17+05:30 IST