అయోధ్య మందిరం..మరింత ఉన్నతం!

ABN , First Publish Date - 2020-08-01T08:32:04+05:30 IST

అయోధ్యలో రామాలయం మరింత సమున్నతంగా నిర్మాణం కానుంది.

అయోధ్య మందిరం..మరింత ఉన్నతం!

  • ఆలయ పరిమాణం రెండురెట్లు పెంపు
  • 161 అడుగులకు పెరిగిన ఎత్తు
  • 2 అంతస్తుల నుంచి 3 అంతస్తులకు పెంపు
  • మూడున్నరేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి

అయోధ్య, లఖ్‌నవూ, జూలై 31: అయోధ్యలో రామాలయం మరింత సమున్నతంగా నిర్మాణం కానుంది. ముందుగా అనుకున్న ప్రణాళిక కన్నా నిర్మాణ పరిమాణాన్ని దాదాపు రెండురెట్లు పెంచారు. ఆలయాన్ని నాగర్‌ శైలిలోనే నిర్మించనున్నారు. మూడున్నర ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. ఆలయాన్ని పూర్తిగా వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మిస్తామని ప్రధాన స్తపతి చంద్రకాంత్‌ భాయ్‌ సోంపూర చెప్పారు. గుజరాత్‌లో అక్షరథామ్‌ ఆలయానికి రూపకల్పన చేసింది ఈయనే. చంద్రకాంత్‌ తాత ప్రభాకర్జీ సోంపూర, సోమ్‌నాథ్‌ ఆలయానికి నమూనాను రూపొందించారు. 


భవ్యమైన రామాలయం ఇలా..

నిర్మాణ విస్తీర్ణం: పది ఎకరాల్లో ఆలయాన్ని నిర్మిస్తారు. మిగిలిన 57 ఎకరాలను ఆలయ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేస్తారు. 

ఆలయం ఎత్తు: తొలుత ప్రణాళిక ప్రకారం 141 అడుగులతో నిర్మించాలనుకున్నారు. దీన్ని తాజాగా 161 అడుగులకు పెంచారు. 

ఆలయాన్ని 3 అంతస్తులుగా నిర్మిస్తారు. 5 గుమ్మటాలతో మండపాలు, ఒక శిఖరం ఉంటాయి. తొలుత రెండస్తులు, 3 మండపాలు, ఒక శిఖరం రూపంలో నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. దీన్ని మార్చారు. 

తొలుత ప్రణాళికలో 212 స్తంభాలు ఉన్నాయి. తాజా ప్రణాళిక ప్రకారం వీటి సంఖ్యను 360కి పెంచారు. 

శిల్పశాస్త్రానికి ప్రాధాన్యమిచ్చే నాగర్‌ శైలిలో ఆలయాన్ని నిర్మిస్తారు. 

ఆలయ నిర్మాణంలో రాజస్థాన్‌లోని బన్షీ పర్వతాల్లోని రాళ్లను వాడనున్నారు. 

ప్రధాన ఆలయం చుట్టూ నాలుగు చిన్న ఆలయాలను నిర్మిస్తారు. 

వివిధ భాషల్లో ‘శ్రీ రాం’ అని రాసి వున్న 2లక్షల ఇటుకలను గత 30 ఏళ్లలో సేకరించారు. 


ప్రభునందన్‌ను ఆహ్వానించాలి: మాయావతి

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ కోసం దళిత ఆధ్యాత్మిక నేత మహామండలేశ్వర్‌ కన్హయ్య ప్రభునందన్‌ గిరిని ఆహ్వానించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అప్పుడు కులరహిత సమాజాన్ని కోరుకునే రాజ్యాంగ ఉద్దేశాన్ని కొంత మేర అయినా ప్రతిబింబింపజేసినట్లు అవుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-01T08:32:04+05:30 IST