ఆయుష్షు.. 150 ఏళ్లు?!

ABN , First Publish Date - 2021-06-10T08:27:46+05:30 IST

ప్రపంచంలో ఎక్కువకాలం జీవించిన వ్యక్తి ‘జీన్‌ లూయీస్‌ కాల్‌మెంట్‌’. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆమె 122 సంవత్సరాల 164 రోజుల పాటు జీవించారు.

ఆయుష్షు.. 150 ఏళ్లు?!

ఆరోగ్యపరమైన అంశాల్లో పురోగతితో సాధ్యమే..

సింగపూర్‌ శాస్త్రవేత్తల అధ్యయనం


న్యూఢిల్లీ, జూన్‌ 9 : ప్రపంచంలో ఎక్కువకాలం జీవించిన వ్యక్తి ‘జీన్‌ లూయీస్‌ కాల్‌మెంట్‌’. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆమె 122 సంవత్సరాల 164 రోజుల పాటు జీవించారు. ఈమెలా అందరూ భారీ ఆయుర్దాయాలను పొందొచ్చా? 150 ఏళ్లపాటు జీవించే అవకాశాలు ఉంటాయా? అనే చిక్కు ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ అధ్యయనాన్ని ప్రారంభించిన సింగపూర్‌ శాస్త్రవేత్తలు పలు కీలక విషయాలను గుర్తించారు. వ్యక్తిగత ఆరోగ్యపరమైన కొన్ని అంశాల్లో పురోగతిని సాధించగలిగితే, సగటున 120 నుంచి 150 ఏళ్లదాకా జీవించడం అసాధ్యమేమీ కాదని వారు వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా అమెరికా, బ్రిటన్‌, రష్యాలకు చెందిన ప్రజల ఆరోగ్య నివేదికలను సేకరించి విశ్లేషించారు.


వయసు పెరుగుతున్న కొద్దీ.. వివిధ వయో వర్గాల వారి శరీరంలోని రక్తకణాల సంఖ్యలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులను నమోదుచేసి పరస్పరం పోల్చి చూశారు. వయసు పెరుగుతున్న కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ స్పందించే రేటు క్షీణించడం ప్రతికూలంగా పరిణమించి.. ఆయుర్దాయం తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలోని రక్తకణాల సంఖ్య తగ్గిపోతుందని జీవశాస్త్రం చెబుతోంది. ఒకవేళ మనిషి ఆయుర్దాయాన్ని పెంచగలిగితే.. సగటున 120-150 ఏళ్ల వయసు దాకా రక్తకణాలు ఉత్పత్తి అవుతాయని అంచనావేశారు. ‘‘ఒక నిర్దిష్ట వయసు తర్వాత మనిషిలో రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోకుండా చేసేలా, మనిషి జీవక్రియలను మెరుగుపర్చే థెరపీలను ఆవిష్కరించడంపై మేం తదుపరిగా కసరత్తు చేయబోతున్నా’’మని అధ్యయనానికి నేతృత్వం వహించిన పీటర్‌ ఫెడికెవ్‌ వెల్లడించారు. అత్యంత ప్రభావశీలమైన యాంటీ ఏజింగ్‌ థెరపీలు ఆవిష్కృతమైతే తప్ప జీవితకాలాన్ని పొడిగించుకోలేమని న్యూయార్క్‌లోని రోస్‌వెల్‌ పార్క్‌ కాంప్రెహెన్సివ్‌ కేన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్త ఆండ్రీ గుడ్కోవ్‌ అన్నారు. 


‘గోమ్‌పెర్జ్‌’ ఫార్ములా ఏం చెబుతోంది.. 

మనిషి జీవితకాలాన్ని అంచనా వేసేందుకు ‘గోమ్‌పెర్జ్‌ ఫంక్షన్‌’ అనే గణాంక పద్ధతిని శాస్త్రవేత్తలు వినియోగిస్తున్నారు. దాని ప్రకారం.. వయసు పెరిగే కొద్దీ వ్యాధులు ముసురుకునే ముప్పు క్రమంగా పెరుగుతుంది. ఈ పరిణామం మానవుడి ఆయుర్దాయం ఎంత ఉండాలనే దానికి దిశానిర్దేశం చేస్తుంది. కేన్సర్‌, హృద్రోగాలు, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల ముప్పు మనుషుల్లో 8-9 ఏళ్లకోసారి రెట్టింపు అవుతుందని ‘గోమ్‌పెర్జ్‌ ఫంక్షన్‌’ ద్వారా జరిపిన విశ్లేషణలో గుర్తించారు.

Updated Date - 2021-06-10T08:27:46+05:30 IST