రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2021-05-15T20:40:21+05:30 IST

ముఖ్యమంత్రి కక్షసాధింపు చర్యలు, సైకోచేష్టలు, వ్యవస్థలను తనచేతిలో పెట్టుకొని ఆడిస్తున్న తీరుపై రాజ్యాంగానికి ప్రతినిధులుగా ఉన్నవారు స్పందించకపోతే ఎలా? లోక్ సభ స్పీకర్, కేంద్రహోం మంత్రి అనుమతి లేకుండానే ఎంపీని అరెస్ట్ చేయడం ఏంటి?

రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: అయ్యన్నపాత్రుడు

అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ అస్థిరతపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. పోలీస్, సీఐడీ, ఏసీబీ వ్యవస్థలు ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలుగా మారాయని.. న్యాయస్థానాలు, గవర్నర్ చెప్పినా  ముఖ్యమంత్రి వినే స్థితిలో లేడని ఆయన అన్నారు.


రాష్ట్రంలో పరిస్థితపై అయ్యన్నపాత్రుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి కక్షసాధింపు చర్యలు, సైకోచేష్టలు, వ్యవస్థలను తనచేతిలో పెట్టుకొని ఆడిస్తున్న తీరుపై రాజ్యాంగానికి ప్రతినిధులుగా ఉన్నవారు స్పందించకపోతే ఎలా? లోక్ సభ స్పీకర్, కేంద్రహోం మంత్రి అనుమతి లేకుండానే ఎంపీని అరెస్ట్ చేయడం ఏంటి? ముఖ్యమంత్రి చర్యలు, ఏకపక్ష విధానాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడం తప్పెలా అవుతుంది? రఘురామరాజు చేసింది తప్పయితే, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లు చేసింది అంతకంటే పెద్ద తప్పుకాదా? ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని ఉద్దేశించి ఎన్నెన్ని మాటలన్నాడో అందరికీ తెలుసు. చీపుర్లతో తరిమికొట్టాలని, రాళ్లతో కొట్టాలని, కాల్చిచంపాలని, బంగాళాఖాతంలో విసిరేయాలని, చంద్రబాబుకి అంతిమఘడియలు దాపురించాయని.. ఇలా చాలా అన్నారు. అయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి సహృదయంతో తీసుకున్నారు. కానీ రాజకీయ విమర్శలను జగన్ ఓర్చుకోలేకపోతున్నారు’’ అని అన్నారు.

Updated Date - 2021-05-15T20:40:21+05:30 IST