బెదిరింపులకు లొంగను

ABN , First Publish Date - 2021-06-18T09:17:01+05:30 IST

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) తగాదాలు ముదిరి పాకానపడ్డాయి.

బెదిరింపులకు లొంగను

ఆ ఐదుగురు కలిసి కుట్ర పన్నుతున్నారు

మధ్యంతర ఎన్నికలకు సిద్ధమే    

అపెక్స్‌ కౌన్సిల్‌ నోటీసులపై అజరుద్దీన్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) తగాదాలు ముదిరి పాకానపడ్డాయి. హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌, కార్యదర్శి విజయానంద్‌ నేతృత్వంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ బుధవారం అధ్యక్షుడు మహ్మద్‌ అజరుద్దీన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంతో పాటు అతడి సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది. తనకు నోటీసులు ఇవ్వడంపై అజర్‌ మండిపడ్డాడు. హెచ్‌సీఏ రాజ్యాంగ సుప్రీం అధ్యక్షుడేనని.. తనపై చర్యలు తీసుకునే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌కు లేదని సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అజర్‌ అన్నాడు.


ఒకవేళ ప్రస్తుత కార్యవర్గాన్ని అంబుడ్స్‌మన్‌ రద్దు చేస్తే మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమేనని వెల్లడించాడు. ‘దొంగలే దొంగ దొంగ అంటూ అల్లరి చేయడం విడ్డూరంగా ఉంది. నాపై ఆరోపణలు చేస్తున్న ఐదుగురు కార్యవర్గ సభ్యులే హెచ్‌సీఏలో జరిగిన పలు అవినీతి పనులకు సూత్రధారులు. రోజూ ఏసీబీ కోర్టుల చుట్టు తిరిగే వాళ్లు.. నాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. వారు చేసే అక్రమాలకు అడ్డు తగులుతున్నానని ఇలా  కుట్ర పన్నుతున్నారు. నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పుడుతున్నారు. వీళ్ల బెదిరింపులకు నేను లొంగను. కార్యవర్గ సభ్యుల బహుళ క్లబ్‌ల అంశం, అవినీతి కేసుల చిట్టా అంబుడ్స్‌మన్‌ దగ్గర ఉంది. ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత వివాదాలపై బీసీసీఐకి నివేదిస్తా’ అని అజర్‌ వ్యాఖ్యానించాడు.


కవిత విషయం నాకు తెలియదు:

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్‌సీఏలోకి రానున్నారంటూ వస్తున్న వార్తలపై అజర్‌ స్పందిం చాడు. కవిత విషయం తనకు తెలియదనీ, ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుం టే అది ఆమె ఇష్టమ న్నాడు. హెచ్‌సీఏ గాడి తప్పిం దంటూ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదన్నాడు.


కవిత నజర్‌

హెచ్‌సీఏ  ప్రస్తుత పరిస్థితులపై ఎమ్మెల్సీ కవిత తన ముఖ్య అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. లోధా సిఫార్సుల కారణంగా చట్టసభలలో సభ్యులుగా ఉన్నవారు బీసీసీఐ.. అనుబంధ సంఘాల్లో పోటీ చేయడానికి అనర్హులు కావడంతో హెచ్‌సీఏలో ఎంట్రీపై కవిత ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. హెచ్‌సీఏలోకి ప్రవేశించి బీసీసీఐలో చక్రం తిప్పాలనే ఆలోచనలో కవిత ఉన్నా, లోధా సంస్కరణలు అవరోధంగా మారడంతో ప్రస్తుతానికి తన కోటరీలోని ఓ నమ్మకమైన వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో అధ్యక్షుడిగా బరిలోకి దింపాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే  హెచ్‌సీఏలోని కొందరు సభ్యులతో కవిత అనుచరులు మంతనాలు మొదలుపెట్టారట. సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక బలమైన పారిశ్రామిక వేత్తను అధ్యక్షుడిగా.. టీఆర్‌ఎస్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ మాజీ అధ్యక్షుడు.. హెచ్‌సీఏలోని ఒక క్లబ్‌ సెక్రటరీని ప్రధాన కార్యదర్శిగా తెరపైకి తీసుకొచ్చేందుకు కవిత రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2021-06-18T09:17:01+05:30 IST