ఉద్యమం ఉధృతం చేద్దాం

ABN , First Publish Date - 2022-01-28T04:43:16+05:30 IST

మదనపల్లెను జిల్లాగా ప్రకటించేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని మదనపల్లె జిల్లాసాధన సమితి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

ఉద్యమం ఉధృతం చేద్దాం
ఐక్యతను చూపుతున్న మదనపల్లె జిల్లా సాధన జేఏసీ నాయకులు

మదనపల్లెకు జిల్లాను చేయకుంటే  వైసీపీ నేతలను తిరగనివ్వం

నేడు ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయ ముట్టడి 

మదనపల్లె జిల్లాసాధన సమితి జేఏసీ

మదనపల్లె రూరల్‌, జనవరి 27: మదనపల్లెను జిల్లాగా ప్రకటించేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని మదనపల్లె జిల్లాసాధన సమితి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మదనపల్లె జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో బందెల గౌతమ్‌ కుమార్‌ అధ్యక్షతన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యాసంస్థల యజమాన్యాలతో మదనపల్లె జిల్లా సాధన కోసం భవిష్యత్‌ కార్యాచరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా  కేవలం వైసీపీ నాయకుల స్వార్థం కోసమే జిల్లాల విభజన చేసిందన్నారు.  మదనపల్లెలో సబ్‌కలెక్టర్‌ కార్యాల యం, డీఎస్పీ కార్యాలయం, జిల్లా వైద్యశాల, ఎంతో చరిత్ర కల్గిన ప్రదేశాలు ఉన్నాయన్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు బాధ్యత తీసుకుని మదనపల్లె జిల్లా సాధనకు సహకరించాలన్నారు. లేనిపక్షంలో వైసీపీ ప్రజాప్రతి నిధులను ఎక్కడి కక్కడ అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ మాట్లాడుతూ కనీసం నీటి వసతి, రైల్వే లైను లేని రాయచోటిని జిలా ్లకేంద్రంగా ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. నాయకుల స్వార్థంకోసం మదనపల్లెను జిల్లా కాకుండా అడ్డుకుంటే ఈ నాలుగు నియోజకవర్గాల నాయకులు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బాస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్‌ మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా జిల్లాల విభజన చేశారన్నారు. మదనపల్లెను జిల్లాగా చేయకుంటే చారిత్రక తప్పిదం చేసినట్లే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, వైసీపీ ప్రజా ప్రతి నిధులను హెచ్చరించారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు మాట్లాడుతూ రాష్ర్టానికి రాజధాని లేకుండా చేసిన అసమర్థ సీఎంగా పేరు తెచ్చుకున్న సీఎం జగన్‌ ఇప్పుడు జిల్లాలు విభజించి ఏవిధంగా అభివృద్ధి చేస్తారో తెలపాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు కృష్ణప్ప మాట్లాడుతూ రెండు జిల్లాలను శాసించాలనే మంత్రి పెద్దిరెడ్డి మదనపల్లెను జిల్లా కాకుండా చేస్తు న్నారని ఆరోపించారు.  ఎంఆర్పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ కారణాలతో మదనపల్లెను ఇక్కడి ప్రజాప్రతినిధులు జిల్లా కాకుండా చేస్తున్నారని ఆరోపించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం, ఆర్జీఎస్‌ అధ్యక్షుడు కోనేటి దివాకర్‌, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాంలు మాట్లాడుతూ దాదాపు 600 రోజులుగా మదనపల్లె జిల్లాకోసం పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి యాలగిరి దొరస్వామినాయుడు, కాంగ్రెస్‌ నాయకులు నాగూర్‌వలీ, సురేంద్రరెడ్డి, రెడ్డిసాహెబ్‌, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. 

ఉద్యమ కార్యాచరణ

వైసీపీ ప్రజాప్రతినిధుల నివాసాల ముట్టడిం చాలని, విద్యాసంస్థల సహకారంతో బంద్‌ చేప ట్టాలని నిర్ణయించారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలలో అన్నిపార్టీల నాయకులు, ప్రజాసంఘాలతో కలిసి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేపట్టాలని మదనపల్లెను జిల్లాగా ప్రకటిం చేవరకు ఉద్యమం కొనసాగించాలని తీర్మానించారు. 

నేడు ఎంపీ మిథున్‌ కార్యాలయ ముట్టడి

నేడు మదనపల్లె-పుంగనూరు రోడ్డులోని ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించ నున్నట్లు మదనపల్లె జేఏసీ నాయకులు ప్రకటించారు. 

Updated Date - 2022-01-28T04:43:16+05:30 IST