బాబ్బాబు... రండి !

ABN , First Publish Date - 2021-10-18T04:40:12+05:30 IST

ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటికే నాలుగుసార్లు టెండర్లు పిలిచారు.. కానీ ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టర్‌ కూడా టెండర్‌ వేసేందుకు ముందుకు రాలేదు.

బాబ్బాబు... రండి !
వెంకటాచలం మార్కెట్‌ యార్డు

మార్కెటింగ్‌ శాఖలో అభివృద్ధి పనులకు టెండర్లు

వర్కులకు ముందుకురాని కాంట్రాక్టర్లు

నాలుగుసార్లు నో రెస్పాన్స.. ఐదోసారి ఆహ్వానం

ప్రభుత్వం బిల్లులు ఇస్తుందో.. లేదో.. అపనమ్మకం

రైతులకు ఉపయోగపడే గోదాముల పరిస్థితేమిటో?


నెల్లూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటికే నాలుగుసార్లు టెండర్లు పిలిచారు.. కానీ ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టర్‌ కూడా టెండర్‌ వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో మార్కెటింగ్‌ శాఖలో చేపట్టిన అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ఎక్కడైనా టెండర్లు పిలుస్తున్నారంటే కాంట్రాక్టర్లు పోటీ పడతారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే అనేక శాఖల్లో చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అందులోనూ కొన్ని శాఖల్లో కాంట్రాక్టర్లు బిల్లులివ్వాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆ పనులపై పలు విచారణలకు ఆదేశిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఎదురుకాని ఈ పరిస్థితిని అనుభవిస్తున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ  పనులు చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతోంది. అంతిమంగా ఆ ప్రభావం ప్రజలపై పడుతోంది. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ పరిధిలో జిల్లాలో పలు పనులకు గత కొన్ని నెలల నుంచి టెండర్లు పిలుస్తున్నారు. కొన్ని పనులకు ఇప్పటికే నాలుగుసార్లు టెండర్లు పిలిచినా నో రెస్పాన్స. ఇక విధిలేని పరిస్థితుల్లో తాజాగా ఐదోసారి టెండర్లు పిలిచారు. 

సర్వేపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ) ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తోంది. దాని పరిధిలోని వెంకటాచలం మార్కెట్‌ యార్డులో  కార్యాలయం నిర్మిం చాలని నిర్ణయించారు. రూ.13.23 లక్షల అంచనాతో ఈ వర్కుకు టెండర్‌ పిలిచారు. కానీ ఒక్కరు కూడా ఈ పని చేసేందుకు ముందుకు రాలేదు. ఇప్పటికి నాలుగు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో ఇప్పుడు ఐదోసారి టెండర్లు పిలిచారు. ఈ దఫా కూడా ఎవరైనా టెండర్లు వేస్తారా ? అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. 

సర్వేపల్లి ఏఎంసీ పరిధిలోని పొదలకూరు మార్కెట్‌ యార్డులో నీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.17.61 లక్షలతో టెండర్లు పిలిచారు. ఇప్పటికి నాలుగు సార్లు టెండర్లు ఆహ్వానించినా ఎవరూ ఆసక్తి చూపలేదు. తాజాగా ఐదోసారి టెండర్లు ఆహ్వానించారు. మరి ఈ సారైనా ఎవరైనా టెండర్‌ వేస్తారో లేదో చూడాలి. 

కావలి రైతుబజార్‌లో రెండు పనులకు కొన్ని నెలల నుంచి టెండర్లు పిలుస్తూనే ఉన్నా, పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. రూ.3.12 లక్షలతో ఏసీపీ బోర్డులు ఏర్పాటు చేసేందుకు  టెండర్‌ పిలిచారు. అలానే రైతుబజార్‌కు పెయింటింగ్‌ వేసేందుకు రూ.1.77 లక్షలతో టెండర్‌ పిలిచారు. ఈ రెండు పనులకు ఇప్పటికి మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్కరూ కూడా వేయలేదు. ఇక చేసేది లేక నాలుగోసారి టెండర్లు పిలిచారు. ఈ రెండూ కూడా చిన్న  పనులే అయినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోతుండడం గమనార్హం. 

ఉదయగిరి ఏఎంసీ పరిధిలోని వింజమూరు సబ్‌మార్కెట్‌ యార్డు చుట్టూ గతంలో ప్రహరీ నిర్మిం చారు. అయితే అది పూర్తిగా నిర్మాణం జరగలేదు. ఈ మిగిలిన ప్రహరీని నిర్మించేందుకు రూ.6.14 లక్షలతో గత నెలలో టెండర్లు పిలిచారు. పనులు చేసేందుకు ఒక్క కాంట్రాక్టర్‌ కూడా ముందుకు రాకపోవడంతో మళ్లీ రెండోసారి పిలిచారు. ఇందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉంది. ఈ  పనికి ఎన్నిసార్లు టెండర్లు పిలవాల్సి వస్తుందోనని మార్కెటింగ్‌ శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 


గోదాముల పరిస్థితేమిటో..?


రైతులకు ఉపయోగపడేలా రైతు భరోసా కేంద్రా(ఆర్‌ బీకే)లను అనుసంధానిస్తూ ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో గోదాములను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాకు 72 గోదాములను మంజూరు చేసింది. అయితే ఇంకా వీటి నిర్మాణం మొదలు కాలేదు. ఇప్పుడున్న పరి స్థితుల్లో గోదాముల నిర్మాణం పూర్తవుతుందా.. ? అన్నదే అనుమానంగా మారింది. చిన్న  చిన్న పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితుల్లో ఇక పెద్ద పనులు చేసేందుకు ఎలా వస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-10-18T04:40:12+05:30 IST