బాబోయ్‌ ఇదేం చలి..

ABN , First Publish Date - 2022-01-29T06:29:37+05:30 IST

జిల్లాపై మళ్లీ చలి పంజా విసురుతోంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్‌ డిజిట్‌కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రతియేటా శీతాకాలంలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అత్యల్పంగా

బాబోయ్‌ ఇదేం చలి..
జిల్లాకేంద్రాన్ని కమ్మేసిన పొగమంచు

- అతిశీతల గాలుల ప్రభావంతో వణికిపోతున్న జిల్లావాసులు 

- భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 5.7 కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

ఆదిలాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి):  జిల్లాపై మళ్లీ చలి పంజా విసురుతోంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్‌ డిజిట్‌కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రతియేటా శీతాకాలంలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అత్యల్పంగా భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 5.7డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలో 7.0 డిగ్రీలు, అర్బన్‌లో 7.2, జైనథ్‌ మండలంలో 7.5, మావల మండలంలో 7.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకు పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరిగి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ గిరిజన గ్రామాలను పొగమంచు కప్పేయడంతో చలి తీవ్రతకు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత కనిపిస్తోంది. అంతటా పగలంతా వెచ్చని దుస్తులను ధరించి ప్రజలు బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు  ఏర్పడుతున్నాయి. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేం దుకు జంకుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని మారుమూల గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే పట్టపగలే చలి మంటలు వేసుకుంటూ ప్రజలు వెచ్చదనం పొందుతున్నారు.

Updated Date - 2022-01-29T06:29:37+05:30 IST