బాబోయ్‌ విద్యుత్‌ బిల్లులు

ABN , First Publish Date - 2021-04-17T05:48:19+05:30 IST

కొవిడ్‌-19తో దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సామాన్య, పేద ప్రజలపై ప్రభుత్వం విద్యుత్‌ భారం మోపింది. నెల బిల్లులు చెల్లించడమే భారమని భావిస్తున్న ఈ తరుణంలో విద్యుత్‌శాఖ అధికారులు అదనపు డెవలపుమెంట్‌ చార్జీలను వేసి షాక్‌కు గురి చేసింది.

బాబోయ్‌ విద్యుత్‌ బిల్లులు

 డెవలప్‌మెంట్‌ చార్జీల పేరుతో భారీగా వడ్డన

 వేలాది రూపాయలతో బిల్లులు జారీ

 ఒకేసారి చెల్లించాలంటున్న అధికారులు

 తేరుకోలేకపోతున్న వినియోగదారులు

 18,984 కనెక్షన్ల నుంచి రూ.5 కోట్ల వసూలుకు రంగం సిద్ధం  

 ఇప్పటికే కరోనాతో ప్రజల విలవిల 


కరీంనగర్‌ టౌన్‌/గణేశ్‌నగర్‌, ఏప్రిల్‌ 16: కొవిడ్‌-19తో దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సామాన్య, పేద ప్రజలపై ప్రభుత్వం విద్యుత్‌ భారం మోపింది. నెల బిల్లులు చెల్లించడమే భారమని భావిస్తున్న ఈ తరుణంలో విద్యుత్‌శాఖ అధికారులు అదనపు డెవలపుమెంట్‌ చార్జీలను వేసి షాక్‌కు గురి  చేసింది. రెండు నెలల నుంచి వస్తున్న బిల్లులను చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. నెల బిల్లుల్లోనే అదనపు డెవలప్‌మెంట్‌ చార్జీలను కూడా కలిపి వేయడంతో నెలకు 500లోపు వచ్చే బిల్లులు ఇప్పుడు వేలల్లోనే ఉండడంతో షాక్‌లో నుంచి తేరుకోలేక పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోతలు లేకుండా నిరంతరం విద్యుత్‌ను అందిస్తున్నామని, రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతూనే వినియోగదారులపై ఇలా అదనపు డెవలప్‌మెంట్‌ చార్జీలు, అడిషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్లు, జీఎస్‌టీ తదితర చార్జీల భారం మోపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మీటర్‌ కనెక్షన్‌ తీసుకునే సమయంలో ఇచ్చిన సమాచారం కంటే అదనంగా  విద్యుత్‌ను వినియోగిస్తున్నారని, అలాంటి వినియోగదారుల నుంచి మాత్రమే అదనపు డెవలప్‌మెంట్‌ చార్జీలను వసూలు చేస్తున్నామే తప్ప అందరిపై భారం వేయడం లేదని ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు ఎన్ని కిలో వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారని మీటర్లలో రికార్డు అవుతుందని, దాని ప్రకారంగా అదనంగా వినియోగిస్తున్న విద్యుత్‌పై కిలోవాట్‌కు రూ.1,200, రూ.216 జీఎస్టీని వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. కరీంనగర్‌ జిల్లాలో అదనంగా విద్యుత్‌ వినియోగం చేస్తున్నవారు 18,984 మంది ఉన్నారని, వారు వినియోగిస్తున్న అదనపు విద్యుత్‌చార్జీల కింద రూ.5 కోట్లను వసూలు చేయాలనే లక్ష్యంగా ఎంచుకున్నారు. గత నెలలో దాదాపు 25 లక్షల రూపాయల అదనపు విద్యుత్‌ వినియోగ చార్జీలను వసూలు చేశారు. మిగిలిన వారందరికి  ఏప్రిల్‌ బిల్లులతో కలిపి పంపిణీ చేస్తున్నారు. దీంతో చాలా మంది గతంలో 500 రూపాయలు వచ్చే బిల్లులు ఇప్పుడు మూడు వేల నుంచి 5వేల వరకు వచ్చిందంటూ ఆందోళన చెందుతున్నారు. నెల బిల్లులను అప్పోసప్పో చేసి చెల్లిస్తున్నామని, కొవిడ్‌ తీవ్రతతో వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధిలేక తిండి కూడా సరిగా చేయలేని స్థితిలో తమపై అదనపు డెవలప్‌మెంట్‌ చార్జీల భారం మోపడమేమిటని బావురుమంటున్నారు. ఎన్నో ఏళ్ళ క్రితం విద్యుత్‌ కనెక్షన్లు తీసుకొని నెలనెలా వాడుకున్న కరెంటుకు చార్జీలను చెల్లిస్తున్నామని, యూనిట్లు పెరిగితే స్లాబ్‌ కూడా పెరుగుతుందని, ఆ పెరిగిన ప్రకారంగా బిల్లులు చెల్లించినప్పటికీ కొత్తగా అదనపు వినియోగం పేరుతో చార్జీలు వసూలు చేయడం దారుణమని మండిపడుతున్నారు. అంతేకాకుండా అదనపు చార్జీలను వాయిదా ప్రకారం కాకుండా ఏకమొత్తంలో రెగ్యులర్‌ బిల్లుతోపాటే చెల్లించాలని, లేనిపక్షంలో కనెక్షన్‌ తొలగిస్తామని హెచ్చరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి నెలా బిల్లుల్లో ఎనర్జీ చార్జీలు, కస్టమర్‌ చార్జీలు, ఈడీ, ఈడీ వడ్డీ, అడిషనల్‌ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌ అమౌంట్‌, డెవలప్‌మెంట్‌ చార్జీలు ఇలా ఏవోవే కలిపి బిల్లులు ఇస్తున్నారని, 15 రోజుల్లో బిల్లులు చెల్లించనట్లయితే డిస్‌కనెక్షన్‌ చార్జీలను కూడా వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ప్రతినెలలో 30 రోజులకొకసారి మీటరు రికార్డు చేసి బిల్లులను ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు ఒకసారి 30 రోజులలోపే, మరోసారి 30 రోజుల తర్వాత బిల్లులు ఇస్తున్నారని, దీనితో యూనిట్‌ స్లాబ్‌ మారి పోయి అదనంగా ఆర్థికభారం పడుతుందని ఆవేదన చెందుతున్నారు.   పెరుగుతున్న వినియోగాన్ని బట్టి అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లను నెలకొల్పి విద్యుత్‌ ఇవ్వాల్సింది పోయి ఇలా పెరుగుతున్న లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామంటూ  అదనపు చార్జీలను వసూలు చేయడమేమిటని  ప్రశ్నిస్తున్నారు. గత ఏడాదినుంచి కరోనాతో కకలావికలమై ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు చార్జీల మోతలను, జీఎస్‌టీలను వేయడం సరికాదని, ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. 


సామాన్యులకు గుదిబండగా విద్యుత్‌ బిల్లులు 

బీజేపీ రాష్ట్ర నాయకుడు బేతి మహేందర్‌రెడ్డి 


రాష్ట్రంలో సామాన్య విద్యుత్‌ వినియోగదారులపై డెవలప్‌మెంట్‌ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌ చార్జీలను వేసి అధిక మొత్తంలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేస్తూ వారి నడ్డి విరుస్తున్నారని, విద్యుత్‌ బిల్లులు సామాన్యులకు గుదిబండగా మారాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు బేతి మహేందర్‌రెడ్డి విమర్శించారు. పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో కమీషన్లకు కక్కుర్తిపడి ఎక్కువ డబ్బులు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని చెప్పి ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇరువై నాలుగుగంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి వినియోగదారుల నుంచి వేలాదిరూపాయల చార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. కరోనాతో ఉపాధిలేక ఇబ్బందులుపడుతున్న ఈ సమయంలో అదనపు చార్జీల వసూలు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. 

  అదనంగా లోడ్‌ను వినియోగించుకుంటేనే చార్జీల వసూలు: ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ మాధవరావు 

 తక్కువ కిలోవాట్‌ విద్యుత్‌ వినియోగిస్తామని చెప్పి పరిమితికి మించి వినియోగిస్తున్న వారి నుంచి మాత్రమే అదనపు విద్యుత్‌ చార్జీలను వసూలు చేస్తున్నామని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ మాధవరావు తెలిపారు. అదనపు వినియోగంపై కిలోవాట్ల చొప్పున వసూలు చేస్తున్న మొత్తం తిరిగి విద్యుత్‌ వినియోగదారుల సౌలభ్యం కోసమే ఉపయోగిస్తున్నామని చెప్పారు. అడిషనల్‌ యూసేజ్‌తో విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్న నేపథ్యంలో మీటర్‌ బిల్లింగ్‌ చేసే సందర్భంలో ఆర్‌ఎండి ద్వారా వినియోగదారులు వాడుతున్న యూనిట్లను గుర్తించి డెవలప్‌మెంట్‌ చార్జీలను వసూలు చేస్తున్నామన్నారు. వీటితో వచ్చే డబ్బులను ట్రాన్స్‌ఫార్మర్ల ఇంప్రూమెంట్‌కు ఖర్చుచేస్తున్నామని చెప్పారు. వినియోగదారులు తమ అవసరాల కోసం కొత్తగా విద్యుత్‌ వస్తువులను తీసుకొచ్చినపుడు తమకు సమాచారమివ్వాలని, అలా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారని, దీనితో అడిషనల్‌ చార్జీల వసూలు చేయడం అనివార్యమైందన్నారు.  


Updated Date - 2021-04-17T05:48:19+05:30 IST