దొంగతనం చేస్తూ దొరికిపోయి.. గున్న ఏనుగు ఫన్నీ రియాక్షన్!

ABN , First Publish Date - 2020-11-21T04:04:58+05:30 IST

ఏనుగులకు బాగా ఇష్టమైన ఆహార పదార్థాల జాబితాలో చెరకు కచ్చితంగా ఉంటుంది. తియ్యగా ఉండే చెరకు అంటే ఏనుగులకు భలే ఇష్టం.

దొంగతనం చేస్తూ దొరికిపోయి.. గున్న ఏనుగు ఫన్నీ రియాక్షన్!

ఇంటర్నెట్ డెస్క్: ఏనుగులకు బాగా ఇష్టమైన ఆహార పదార్థాల జాబితాలో చెరకు కచ్చితంగా ఉంటుంది. తియ్యగా ఉండే చెరకు అంటే ఏనుగులకు భలే ఇష్టం. మన పిల్లలకు చాక్లెట్లు ఎలానో ఏనుగు పిల్లలకు చెరకు అలా అన్నమాట. అయితే ఈ ఇష్టం ఎక్కువైన పిల్లలు ఏం చేస్తారు? మనకు తెలియకుండా చాక్లెట్ దొంగతనాలు చేస్తారు. అచ్చం ఇలానే చెరకు దొంగతనం చేసిందో గున్న ఏనుగు. తనకు దగ్గరలోని ఓ పొలంపై పడి చెరకు గడలను కరకరా నమిలి పారేసింది. ఈ చప్పుడు విని గబగబా అక్కడకు చేరుకున్న మనుషులను చూసి అది చేసిన పని ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.



మనం ఏదైనా చిన్న దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరైనా వస్తే ఏం చేస్తాం? వెంటనే ఎక్కడో ఒకచోట దాక్కునేందుకు ప్రయత్నిస్తాం. ఈ గున్న ఏనుగు కూడా అదే పనిచేసింది. కాకపోతే దాని సైజును గుర్తించలేకపోయింది. ఈ ఘటన థాయ్‌ల్యాండ్‌లో జరిగింది. చియాంగ్ మాయ్ ప్రాంతంలోని ఓ చెరకు తోటపై పడి సంతోషంగా పండగ చేసుకుంటోందా గున్న ఏనుగు. అప్పుడే అటుగా మనుషులు వస్తున్న అలికిడి దాని చేట చెవులకు వినిపించింది. వెంటనే పక్కకు దూకి పారిపోబోయింది. కానీ తాను వాళ్ల నుంచి పారిపోలేనని గ్రహించింది.


పారిపోవడం అసంభవం అనే విషయం తెలుసుకున్న ఆ గున్న ఏనుగు గబగబా వెళ్లి పక్కనే ఉన్న ఓ స్తంభం చాటుగా నిలబడింది. అంటే ఆ సన్నటి స్తంభం వెనుక అది చక్కగా దాక్కుందన్నమాట. ఇలా చెరకు దొంగతనం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఏనుగు పిల్ల.. దాక్కునే ప్రయత్నం చేయడం అక్కడకు వచ్చిన మనుషులకు నవ్వు తెప్పించింది. గున్నపై టార్చ్ వేసినా కూడా అది కదలడం లేదు. కదిలితే ఎక్కడ దొరికిపోతానో అని. అది చూసి నవ్వుకున్న వాళ్లు.. ఆ గున్న దాక్కున్న ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.



‘ష్... కదలకు. ప్రశాంతంగా ఉండు లేదంటే ఆఫీసర్లు చూసేస్తారు. వాళ్లు వెళ్లిపోగానే మనం మళ్లీ చెరకు తోటపై పడదాం’ అనే క్యాప్షన్‌తో ఈ గున్న ఏనుగు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాన్ని చూసిన నెటిజన్లు ఆ గున్న చేసిన పనికి ముగ్ధులైపోతున్నారు. ముద్దొచ్చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. చెరకు దొంగతనం చేస్తూ దాక్కోవడంలో ఫెయిలయిన ఈ గున్న.. మన మనసు మాత్రం గెలుచుకుందంటూ మెచ్చుకుంటున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Updated Date - 2020-11-21T04:04:58+05:30 IST