హైకోర్టు నిర్ణయం హర్షణీయం

ABN , First Publish Date - 2020-08-05T10:13:01+05:30 IST

రాజధాని అమరావతిపై హైకోర్టు ఈనెల 14 వరకు స్టేటస్‌కో విధించడంపై ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల ..

హైకోర్టు నిర్ణయం హర్షణీయం

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 4 : రాజధాని అమరావతిపై హైకోర్టు ఈనెల 14 వరకు స్టేటస్‌కో విధించడంపై ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను మంగళవారం మచిలీపట్నంలో ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద అర్జునుడు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, వైస్‌చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథం, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి. ఫణికుమార్‌ దగ్ధం చేశారు. అర్జునుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు అమరావతి రాజధాని ఉంటుందని చెప్పి ప్రజల నుంచి ఓట్లు దండుకున్న సీఎం జగన్‌ మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. శివరామకృష్ణ కమిటీ సిఫార్సుల ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు.


చంద్రబాబు హయాంలో అనంతపురంలో కియా కారులు పరుగెత్తించారని, ఎఫ్‌బీఐ రూ. 13,500 కోట్ల పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. కర్నూలు జిల్లాలో రూ. 670 కోట్లతో 623 ఎకరాల విస్తీర్ణంలో మెగా సీడ్‌ పార్కు, సోలార్‌ పార్కు ఏర్పాటు చేశామన్నారు. మొబైల్‌ ఫోన్లు అత్యధికంగా తయారు చేసే చిత్తూరు జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని, కడప ఎయిర్‌పోర్టును వినియోగంలోకి తీసుకువచ్చామన్నారు. విభజన తర్వాత ఆర్ధికలోటు లేకుండా చేశామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ్చ 14 నెలలైనా ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వం మారితే రాజధానులు మార్చడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-08-05T10:13:01+05:30 IST