వరి సాగుపై వెనక్కి..!

ABN , First Publish Date - 2021-10-24T05:43:12+05:30 IST

సాగర్‌ డ్యాం నిండితే రైతుల్లో ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటిది ఈ సంవత్సరం కుడి కాలువకు సాగునీరు వచ్చి నెల రోజులు దాటినా.. రైతులు వరి సాగుపై నిరాశక్తతతో ఉన్నారు. పెరిగిన పెట్టుబడులకు తోడు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు నిరుత్సాహంతో ఉన్నారు. కౌలు ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో అసలు యజమానులు కూడా సొంతంగా పెట్టుబడి తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధిక పెట్టుబడే కారణం

వరి సాగుపై వెనక్కి..!
వరి నాటేందుకు సిద్ధం చేసి వదలేసిన పొలం

  పెరిగిన పెట్టుబడులు

ధాన్యానికి లభించని గిట్టుబాటు ధర

కౌలు రైతుల్లో తగ్గిన ఉత్సాహం 

త్రిపురాంతకం, అక్టోబరు 23 : సాగర్‌ డ్యాం నిండితే రైతుల్లో ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటిది ఈ సంవత్సరం కుడి కాలువకు సాగునీరు వచ్చి నెల రోజులు దాటినా..  రైతులు వరి సాగుపై నిరాశక్తతతో ఉన్నారు. పెరిగిన పెట్టుబడులకు తోడు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు నిరుత్సాహంతో ఉన్నారు. కౌలు ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో అసలు యజమానులు కూడా సొంతంగా పెట్టుబడి తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

అధిక పెట్టుబడే కారణం

వరి సాగుకు పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. దీంతో రైతులు అడుగు ముందుకు వేయడంలేదు. గతంలో ఎకరం పొలం దుక్కి దున్నడానికి రూ. 1,000 కాగా, ప్రస్తుతం రూ.1,400, గతంలో దమ్ముకు రూ.4,000 కాగా ప్రస్తుతం రూ. 6,000 ఉంది. అన్నికరాల కూలీలు గతంలో రూ. 20,000 కాగా ప్రస్తుతం రూ. 25,000కు పెరిగాయి. ఎరువులు, పురుగు మందులకు ఎకరానికి గతంలో రూ.13 వేలు కాగా ప్రస్తుతం రూ.20,000 వరకు అవుతోంది. ఇక  నారు పోసేందుకు ఎకరానికి గతంలో రూ.3 వేలు కాగా ప్రస్తుతం రూ. 4 వేలు ఖర్చు అవుతుంది. అన్ని రకాలుగా రైతులు ఆరుగాలం కష్టపడితే తీరా 35 బస్తాలకు అటు ఇటుగా దిగుబడి వస్తుంది. ఈ క్రమంలో ధాన్యం ధర మాత్రం పెరగడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇంత సాగు చేసినా ఎకరానికి సుమారు రూ. 12 నుంచి రూ.15 వేల వరకు నష్టం వస్తుండడంతో వరిసాగుకు రైతులు వెనుకాడుతున్నారు. కొన్ని చోట్ల నారు పోసిన తర్వాత కూడా మధ్యలోనే వదిలేశారు. దీంతో కౌలుకు సాగు చేసేవారు కూడా కరువయ్యారు.

గిట్టుబాటు కావడంలేదు

నాకు 10 ఎకరాల పొలం ఉంది. గతంలో కొంత పొలం కౌలుకు ఇచ్చి కొంత పొలంలో వర సాగు ఏసేవాడిని. ప్రస్తుతం పెట్టుబడులు పెగడంతో కౌలుకు ఎవరూ రావడంలేదు. చేసేదిలేక ఎకరంలో వరి సాగు చేసి, మిగతా దానిలో తక్కువ పెట్టుబడి అయ్యే పంటలను వేసేందుకు సిద్ధమవుతున్నాను.

- మాగులూరి బ్రహ్మయ్య, రైతు, ఒడ్డుపాలెం


వరి ఆపేశాను !

- వంకాయలపాటి ఆంజనేయులు, రైతు, కొత్తఅన్నసముద్రం

వరి సాగుతో ప్రయోజనంలేదు. అన్ని రకాల పెట్టుబడులూ పెరిగాయి. ఏడాది పొడవునా కష్టపడితే చివరికి నష్టమే మిగులుతుంది. ఈ సంవత్సరం  నాలుగు ఎకరాల్లో వరి సాగును ఆపేశాను.  మెట్ట పంటలు వేసేందుకు సిద్ధమయ్యాను. 




Updated Date - 2021-10-24T05:43:12+05:30 IST