గ్రానైట్‌కు గడ్డు రోజులు!

ABN , First Publish Date - 2021-08-31T05:45:13+05:30 IST

గ్రానైట్‌ పరిశ్రమల యాజమాన్యాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సెక్యూరిటీ డిపాజిట్‌, డెడ్‌రెంట్లను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచడంతో నిర్వహించలేమని యాజమాన్యాలు తేల్చిచెబుతున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్ర గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పరిశ్రమల యజమానులు విశాఖలో సమావేశమయ్యారు.

గ్రానైట్‌కు గడ్డు రోజులు!
టెక్కలి సమీపంలోని గ్రానైట్‌ పరిశ్రమ



నిర్వహించలేని స్థితిలో యాజమాన్యాలు

క్వారీల నిలుపుదలకు ఇటీవల తీర్మానం

అధికార పార్టీ నేతల పరిశ్రమల్లో ఉత్పత్తి యథాతఽథం

మిగతా వారిలో ఆందోళన

నేడు సీఎం అడిషనల్‌ కార్యదర్శిని కలవనున్న ప్రతినిధులు

టెక్కలి, ఆగస్టు 30: గ్రానైట్‌ పరిశ్రమల యాజమాన్యాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సెక్యూరిటీ డిపాజిట్‌, డెడ్‌రెంట్లను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచడంతో నిర్వహించలేమని యాజమాన్యాలు తేల్చిచెబుతున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్ర గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పరిశ్రమల యజమానులు విశాఖలో సమావేశమయ్యారు. క్వారీలు నిలుపుదల చేయడంతో పాటు పర్మిట్లు తీయడం ఆపేద్దామని తీర్మానించారు. కానీ అధికార పార్టీ నేతలకు చెందిన పరిశ్రమలు మాత్రం ఈ తీర్మానానికి కట్టుబడలేదు. యథావిధిగా పర్మిట్లు తీస్తుండడంతో మిగతా యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే సంఘ నేతలు కీలక ప్రజాప్రతినిధులు, భూగర్భ గనుల శాఖ అధికారులను కలిసి సమస్యను వివరించారు. కానీ పరిష్కార మార్గం దొరకలేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సీఎం జగన్‌కు కలిసి సమస్యను వివరించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం సీఎం అడిషనల్‌ కార్యదర్శి ధనుంజయరెడ్డిని సంఘ ప్రతినిధులు కలవనున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ధనుంజయరెడ్డి పనిచేవారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్నందున..తమకు న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. 

 కోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు

జిల్లా వ్యాప్తంగా 180 గ్రానైట్‌ క్వారీ పరిశ్రమలున్నాయి. ఇందులో 94 పరిశ్రమలకు సంబంధించి లీజులు కొనసాగుతున్నాయి.  వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది బతుకుతున్నారు.  గత రెండేళ్లుగా లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం డెడ్‌ రెంట్లను అమాంతం 16 రెట్లు పెంచింది. ఇప్పటికే భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో వందలాది లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ల దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు మంజూరు చేసి ఉంటే తక్కువ శాతం డెడ్‌ రెంట్లతో తేలిపోయేది. కానీ ఇప్పుడు అనుమతులిచ్చినా 16 రెట్లు అదనంగా చెల్లించలేమని దరఖాస్తుదారులు చెబుతున్నారు. దీనికి ముమ్మాటికీ అధికారుల తప్పిదమే కారణమంటూ కొందరు కోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమను కాపాడే ప్రయత్నం చేయలేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్‌పైనే పరిశ్రమల యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి. లేకుంటే నిర్వహణ కష్టమని భావిస్తున్నాయి. 





Updated Date - 2021-08-31T05:45:13+05:30 IST