నాడు-నేడులో నాణ్యత నిల్‌

ABN , First Publish Date - 2020-11-13T06:11:18+05:30 IST

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ‘మన బడి నాడు-నేడు’ కింద చేపట్టిన పనుల్లో అవినీతి చోటుచేసుకుంటున్నది. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నాణ్యత లోపిస్తున్నది.

నాడు-నేడులో నాణ్యత నిల్‌
కశింకోట మండలం తాళ్లపాలెం హైస్కూల్‌లో ఒకే తరగతి గదిలో రెండు రకాల గ్రానైట్‌ పలకలు

పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో యథేచ్ఛగా అవినీతి

తల్లిదండ్రుల కమిటీల పేరుతో పనులు చేస్తున్న వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు

నాసిరకం సామగ్రి వినియోగం

ఒకే తరగతి గదిలో పలు రకాల గ్రానైట్‌ పలకలు

అడుగడుగునా నాణ్యతా లోపాలు

రాజకీయ ఒత్తిళ్లతో నోరు మెదపలేని స్థితిలో హెచ్‌ఎంలు

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సమన్వయం లోపమే కారణం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ‘మన బడి నాడు-నేడు’ కింద చేపట్టిన పనుల్లో అవినీతి చోటుచేసుకుంటున్నది. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నాణ్యత లోపిస్తున్నది. తల్లిదండ్రుల కమిటీల పేరుతో అనేకచోట్ల వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లే ఈ పనులు చేపట్టారు. ఇంజనీరింగ్‌ అధికారులు మెటీరియల్‌ కొనుగోలులో నాణ్యతను పట్టించు కోకుండా పర్సంటేజీలకు కక్కుర్తి పడుతున్నారు. దగ్గరుండి పనులను పర్యవేక్షించాల్సిన ప్రధానో పాధ్యాయులు.... కొన్నిచోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరికొన్నిచోట్ల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పనుల్లో నాణ్యతలోపాన్ని అడ్డుకోలేకపోతున్నారు. ‘మన బడి నాడు-నేడు’ కింద జిల్లాలో తొలివిడత 1,149 పాఠశాలల్లో మౌలిక వస తులు కల్పించడానికి ప్రభుత్వం రూ.309.5 కోట్లు కేటాయించింది. 1,143 పాఠశాలల్లో పనులు ప్రారంభం కాగా 355 పాఠశాలల్లో పూర్తయ్యాయి. పాఠశాలల్లో మరుగుదొడ్లకు నిరంతరం నీటి సరఫరా, విద్యుత్తు, తాగునీటి సదుపాయాల మెరుగు, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు, ఇతర చిన్నాచితకా మరమ్మతులకు ఈ నిధులు ఖర్చుచేయాలి. ఇవికాకుండా అమరావతి నుంచి ప్రతి పాఠశాలకు డెస్కులు,టాయిలెట్‌ సామగ్రి, వాష్‌ బేసిన్లు, ఫ్యాన్లు, టీచర్లకు అవసరమైన ఫర్నిచర్‌, గ్రీన్‌ చాక్‌బోర్డు, పెయుంట్స్‌ సరఫరా చేస్తున్నారు. పనులన్నీ ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల నేతృత్వంలో చేపట్టాలి. కానీ పలు పాఠశాలల్లో కమిటీలోని ఒకరిద్దరి పేర్లతో స్థానిక వైసీపీ నాయకులు, కాంట్రాక్టర్లు పనులు చేయిస్తున్నారు. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. పనులను పర్యవేక్షించాల్సిన ప్రధానో పాధ్యాయులు ఇటువంటిచోట్ల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నోరు మెదపలేని పరిస్థితి. అయితే  హెచ్‌ఎంలు నిక్కచ్చిగా వుండి, తల్లిదండ్రుల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు చేపట్టినచోట నాణ్యతా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు పనులు చేపట్టిన, హెచ్‌ఎంలు నిర్లక్ష్యంగా వున్న పాఠశాలల్లో అవి లోపించాయి.


కొరవడిన సమన్వయలోపం, పర్యవేక్షణ

పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీరాజ్‌, గిరిజన ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య, సమగ్ర శిక్షా అభి యాన్‌, ఏపీ విద్య, మౌలిక వసతుల ఇంజనీరింగ్‌ విభాగాలకు ప్రభుత్వం అప్పగించింది. ఈ ఐదు శాఖల అధికారుల మధ్య సమ న్వయం కొరవడింది. ఆయా విభాగాల ఇంజనీర్లు పర్సంటేజీల కోసం నాసిరకం ఎలక్ట్రికల్‌ సామగ్రి, గ్రానైట్‌ పలకల కొనుగోలు చేయిం చారు. వీటిని తాము సూచించిన దుకాణాల్లోనే కొనుగోలు చేయా లని..లేకపోతే బిల్లులపై సంతకాలు చేసేది లేదని తల్లిదండ్రుల కమిటీలను బెదిరించిన ఘటనలు అనేకచోట్ల జరిగాయి.


నాణ్యత లోపంపై డీడీఆర్‌సీలో ప్రస్తావన

తమ నియోజకవర్గాల్లోని పలు పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించిందని అనకాపల్లి, అరకులోయ ఎమ్మెల్యేలు రెండు రోజుల క్రితం జరిగిన డీడీఆర్‌సీ సమావేశంలో ప్రస్తావించారు. ‘నా నియోజకవర్గంలో విరిగిపోయిన గ్రానైట్‌ ముక్కలు కూడా గచ్చుకు వేశారు. ఒకే తరగతి గదిలో రెండు మూడు రకాల గ్రానైట్‌ పలకలు వేశారు. అవి కూడా నాసిరకంగా ఉన్నాయి. ఇతరచోట్ల మిగిలిపోయిన మెటీరియల్‌ను తీసుకొచ్చి నాడు-నేడు పనులకు వాడుతున్నారు’ అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. నాడు-నేడు పనులు నాసిరకంగా జరుగుతున్నాయని, కరెంటు స్విచ్‌లు పని చేయడం లేదని, టైల్స్‌ సరిగా వేయకపోవడంతో వాటిపై నడుస్తుంటే పగిలిపోతున్నాయని అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ చెప్పారు. పాఠశాలల్లో చేపట్టిన పనులను థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌, విజిలెన్స్‌ అధికారులతో తనిఖీలు చేయిస్తే ఎంతమేర అవినీతి జరిగిందో బయటపడుతుందని పలువురు వైసీపీ నాయకులు కోరుతున్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కూడా నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. నాతవరం, సబ్బవరం, దేవరాపల్లి కేజీబీవీల్లో పనులపై ఆరోపణలు రావడంతో సమగ్ర శిక్షా అభియాన్‌ అధికారులు విచారణకు ఆదేశించారు. జీవీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో అత్యధిక పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీనిపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదు చేశారు.


స్కూల్‌ కమిటీ చైర్మనే కాంట్రాక్టర్‌

గ్రానైట్‌ పనులు ప్రైవేటు వ్యక్తికి అప్పగింత

కశింకోట, నవంబరు 12: కశింకోట బాలికల ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులను వైసీపీ మద్దతుదారుడైన స్కూల్‌ కమిటీ చైర్మన్‌ యల్లపు శ్రీనివాసరావు చేపట్టారు. ఈ పాఠశాలకు రూ.62 లక్షలు మంజూరయ్యాయి. మరుగుదొడ్ల నిర్మాణం, గ్రానె ౖట్‌ గచ్చులు, విద్యుత్‌, తాగునీరు, తదితర  పనులు చేస్తున్నారు. ఈ పనులకు వినియోగిస్తున్న ఇసుకలో నాణ్యత లేదని తల్లిదండ్రులు అంటున్నారు. రూ.8.1 లక్షలతో 6,750 చదరపు అడుగులు గ్రానైట్‌ పలకలు వేస్తున్నారు. ఈ పనులను అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పగించారు.


నాణ్యతాలోపాలుంటే సవరిస్తాం

- ఎం.మల్లికార్జునరెడ్డి, ఏసీపీ, సమగ్ర శిక్షా అభియాన్‌

పాఠశాలల్లో నాడు-నేడు పనుల నాణ్య త విషయంలో రాజీపడేది లేదు. నాణ్యత లోపిస్తే బాధ్యులపై చర్యలు తీసు కుం టాం. అనకాపల్లి నియోజకవర్గంలోని కొన్ని పాఠశాలల్లో గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ పనుల్లో తప్పులు జరిగాయి. పనుల్లో నిర్లక్ష్యం, మెటీ రియల్‌లో నాణ్యత లోపం స్పష్టంగా కని పించాయి. దీనికి సంబంధించి ఐదు పాఠశాలల ప్రధానో పాధ్యాయులు, పనులు పర్యవేక్షించే ఇంజనీర్లపై చర్యలు ఉం టాయి. మొత్తం విచారించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం. జిల్లాలో మిగిలినపాఠశాలలో కూడా పనులను తనిఖీ చేస్తాం. 

Updated Date - 2020-11-13T06:11:18+05:30 IST