బడిలో కొవిడ్‌

ABN , First Publish Date - 2022-01-22T05:44:15+05:30 IST

జిల్లాలోని పాఠశాలల్లో కొవిడ్‌ విజృంభిస్తోంది. పిల్లలు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు.

బడిలో కొవిడ్‌
బైర్లూటి గూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఇదే

పాఠశాలలు, కళాశాలల్లో విజృంభిస్తున్న కరోనా
ఒకే రోజు 75 మంది విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్‌
బైర్లూటి ఆశ్రమ పాఠశాలలో రెండు రోజుల్లో 20 మందికి నిర్ధారణ


కర్నూలు(ఎడ్యుకేషన్‌)/ఆత్మకూరు రూరల్‌, జనవరి 21: జిల్లాలోని పాఠశాలల్లో కొవిడ్‌ విజృంభిస్తోంది. పిల్లలు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధిక శాతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలను గాలికొదిలేశారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించే చర్యలు తీసుకోవడం లేదు. ఈ నెల 21న జిల్లాలో 75 మంది విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడి హోం ఐసొలేషన్‌లో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా రోజురోజుకూ విద్యా సంస్థల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

బైర్లూటి ఆశ్రమ పాఠశాలలో మరో 11 మందికి..

బైర్లూటి గూడెంలోని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన ఆశ్రమ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం మరో 11 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గురువారం నిర్వహించిన పరీక్షలతో కలిపి మొత్తం 19 మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. దీంతో అధికారులు విద్యార్థినులను కర్నూలు టిడ్కో క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. బైర్లూటి గూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 130 మంది విద్యార్థినులు ఉన్నారు. సంక్రాంతి సెలవులకు వెళ్లి 40 మంది విద్యార్థినులు తిరిగి రాకపోవడంతో ప్రస్తుతం 90 మంది ఉన్నారు. అలాగే ప్రిన్సిపాల్‌ పార్వతితోపాటు ఏడుగురు ఉపాధ్యాయులు, నలుగురు వంట నిర్వాహకులు విధుల్లో ఉన్నారు. గురువారం విద్యార్థినులు జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో బైర్లూటి పీహెచ్‌సీ వైద్యాధికారి పవన్‌కుమార్‌కు ప్రిన్సిపాల్‌ సమాచారం ఇచ్చారు. బైర్లూటి పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాఠశాలకు వచ్చి 30 మంది విద్యార్థినులకు ముందుగా రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ముగ్గురు ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా సోకింది. శుక్రవారం ప్రిన్సిపాల్‌, మిగిలిన విద్యార్థినులతోపాటు ఉపాధ్యాయులు, వంట నిర్వాహకులకు మొత్తం 60 మందికి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మరో 11 మంది విద్యార్థినులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యాధికారి తెలిపారు. వీరిని మెరుగైన వైద్య సేవల కోసం కర్నూలు టిడ్కో క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. తరగతి గదులు, ప్రాంగణంలో శానిటేషన్‌ చేయించారు. ఎంపీడీవో మోహన్‌కుమార్‌, తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ ఈ సమాచారాన్ని కర్నూలు గిరిజన సంక్షేమ అధికారి మహబూబ్‌బాషాకు అందించారు. తమ పిల్లలకు కరోనా సోకిందని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పరీక్షలకు దూరంగా..

జిల్లాలో మూడో వేవ్‌ తీవ్రమైంది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వైరస్‌ బారిన పడిన మొదటి, రెండు, మూడు రోజుల్లో జ్వరం తీవ్రంగా ఉంటోంది. ఆ తర్వాత జ్వరం తగ్గినా, జలుబు, దగ్గు, గొంతుల్లో గరగర, మంట ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనాతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 3,132గా ఉంది. వీరిలో కర్నూలు జీజీహెచ్‌, ఇతర ఆసుపత్రిలో 70 మంది ఉండగా.. మిగిలిన వారు హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు. అయితే మరణాలు నమోదు కాకపోవడం ఉపశమనం కలిగిస్తోంది. కొంతమంది పరీక్షలు చేయించుకోకుండానే హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు వైద్యుల సలహాలు తీసుకుని మందులు వాడుతుండగా.. ఎక్కువ మంది నేరుగా మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకుంటున్నట్లు సమాచారం. అయితే కొవిడ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సొంత వైద్యం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.

961 కరోనా కేసులు

కర్నూలులో 432, నంద్యాలలో 105, శ్రీశైలంలో 64

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 21: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 4,571 శాంపిల్స్‌ సేకరించగా.. 961 మందికి వైరస్‌ సోకింది. కర్నూలు నగరంలో అత్యధికంగా 432మందికి కరోనా నిర్ధారణ అయింది. ఆ తర్వాత నంద్యాల మున్సిపాలిటీలో 105, శ్రీశైలంలో 64, ఆదోని మున్సిపాలిటీలో 35, ఎమ్మిగనూరులో 25, కర్నూలు రూరల్‌లో 17, రుద్రవరంలో 17, సి.బెళగల్‌లో 16, ఆదోని రూరల్‌లో 14, మహానందిలో 14, మంత్రాలయంలో 13, గోనెగండ్లలో 12, బనగానపల్లెలో 11, ఆలూరులో 10, కోడుమూరులో 10 వచ్చాయి.

14 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు.. 3,600 బెడ్లు

14 మంది నోడల్‌ అధికారుల నియామకం
కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు


కర్నూలు(కలెక్టరేట్‌), జనవరి 21: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో 14 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. ఇందులో 14 మంది నోడల్‌ అధికారులను నియమించామన్నారు. సెంటర్లలో 3,600 బెడ్లను సిద్ధం చేశామన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్ల జిల్లా నోడల్‌ అధికారిగా సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ ఎస్‌.ప్రతాప్‌ సూర్యనారాయణరెడ్డిని నియమించామన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో భోజనం, వసతి, నీటి సరఫరా, బెడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కర్నూలు టిడ్కోలో 1000 బెడ్ల కెపాసిటీతో సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పి.వెంకటలక్ష్మమ్మ నోడల్‌ ఆఫీసర్‌గా నియమించామని, సమాచారం కోసం 8341779818 నెంబరును ఫోన్‌ చేయాలని అన్నారు. నంద్యాల ఏపీ టిడ్కోలో 1000 బెడ్ల కెపాసిటీతో సెంటర్‌ ఏర్పాటు చేసి ఐసీడీఎస్‌ పీడీ ప్రవీణని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించామన్నారు. ఇక్కడ సమాచారం కోసం 9440814461 నెంబరును సంప్రదించాలన్నారు.

ప్రాంతం     కొవిడ్‌ కేర్‌ సెంటర్‌         నోడల్‌ ఆఫీసర్లు             సెల్‌.నెంబర్‌

నందికొట్కూరు    సీఎల్‌ఆర్‌సీ            జేడీ శ్యామల (మత్స్యశాఖ)        9440814742
ఓర్వకల్లు        సీఎల్‌ఆర్‌ఎల్‌ (డ్వామా బిల్డింగ్‌)     ఎం.చింతామణి (జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌)    8328273834
గూడూరు        కేవీకే స్టేడియం        ఈడీ సబీహా పర్విన్‌ (మైనార్టీ కార్పొరేషన్‌)    9849901149
సున్నిపెంట    సీహెచ్‌సీ            పీవో రవీంద్రారెడ్డి, (సున్నిపెంట ఐటీడీఏ)    9490957008
డోన్‌        కేవీకే స్టేడియం        ఏడీ రఘునాథరెడ్డి (కర్నూలు హార్టికల్చర్‌)    7995086793
నంద్యాల        ఏపీ టిడ్కో            పీడీ ప్రవీణ (ఐసీడీఎస్‌)            9440814461
కోవెలకుంట్ల    టీటీడీ కళ్యాణ మండపం        ఏడీ డా.మారుతి శంకరం (వెటర్నరీ)        9059860647
ఎర్రగుంట్ల    టీటీడీ కళ్యాణ మండపం        ఏడీ బీవీ రమణ (నంద్యాల హార్టికల్చర్‌)    7995086794
ఆదోని        ఏపీ టిడ్కో            ఈడీ ఎస్‌.శ్రీనివాసకుమార్‌ (ఎస్సీ కార్పొరేషన్‌)     9849905973
ఆలూరు        కేవీకే స్టేడియం        ఏపీడీ సిద్ధలింగమూర్తి (డ్వామా)        6309027978
మంత్రాలయం    మఠం సౌలట్రీ        ఏడీ సుబ్రహ్మణ్వేశ్వర ఆచారి (వెటర్నరీ)    8179864266
పత్తికొండ        కేవీకే స్టేడియం        ఎస్‌.మహబూబ్‌బాషా(మైనార్టీ సంక్షేమ అధికారి)     9182594685
ఎమ్మిగనూరు    ఏపీ టిడ్కో            ఈడీ ఎ.నాగేశ్వరరావు, (బీసీ కార్పొరేషన్‌)     9849906013

తల్లిదండ్రుల్లో భయం!

వ్యాక్సినేషన్‌ పూర్తి కాకపోవడంతో ఆందోళన
సెలవులు ఇస్తే బావుండేదని అభిప్రాయం


న్యూస్‌నెట్‌వర్క్‌, కర్నూలు: జిల్లాలోని పలు పాఠశాలల్లో కొవిడ్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు భయపడుతున్నారు. అధికశాతం పాఠశాలల్లో కరోనా నిబంధనలు అస్సలు పాటించడం లేదు. ఉపాధ్యాయులు గదులు, బెంచీల కొరత కారణంగా విద్యార్థులను దగ్గర దగ్గరగానే కూర్చోబెడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మాస్కులు కూడా ధరించడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కొవిడ్‌ నియంత్రణ సూచనలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల అభిప్రాయాలు ఇలా..

భయంగానే పంపుతున్నా

మా అబ్బాయి ఏడో తరగతి. పురపాలక పాఠశాలలో చదువుతున్నాడు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బడికి పంపాలంటే ధైర్యం చాలడం లేదు. భయపడుతూనే పంపుతున్నా. పాఠశాలలో కనీస నిబంధనలు అమలు చేయడం లేదు.        

 - వెంకటేష్‌, ఆదోని

ప్రాణాలతో చెలగాటమా?

నాకు ఇద్దరు కొడుకులు. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ప్రైమరీ ఎడ్యుకేషన్‌ చదువుతున్నారు. కొవిడ్‌ ఇంత తీవ్రంగా ఉన్నా సెలవులు ప్రకటించకపోవడం అన్యాయం. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నట్లుంది.

- సీతారాణి, నంద్యాల

పిల్లలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు?

మా పిల్లలు ఇద్దరు స్కూల్లో చదువుతున్నారు. గత కొవిడ్‌ దశల్లో పిల్లల చదువు దెబ్బతినింది. ఇంట్లోనే శ్రద్ధ తీసుకుని చదువు చెప్పాం. ఇప్పుడు మళ్లీ కరోనా తీవ్రమైనా స్కూళ్లు నడుపుతున్నారు. పిల్లలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు?                    

   - మాధవి, నంద్యాల

సెలవులు ప్రకటించాలి

పిల్లలను బడికి పంపాలంటేనే భయంగా ఉంది. మా పిల్లలు ఏడో తరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. బడిలో ఒకరికి కరోనా సోకినా విద్యార్థులందరికీ ముప్పు ఉంటుంది. ప్రభుత్వం పునరాలోచించి పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి.

- అస్లాం, ఆదోని

పది మినహా మిగతా వారికి సెలవులు ఇవ్వాలి

పదో తరగతి విద్యార్థులకు మినహా మిగతా వారికి సెలవులు ఇవ్వాలి. విద్యార్థుల ఆరోగ్యం కంటే చదువు ముఖ్యం కాదు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులు ఇంకా పాఠశాలలకు రావడం లేదు.

 - హెచ్‌.తిమ్మన్న, ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు

వ్యాక్సినేషన్‌ తర్వాతే బడులు తెరవాలి

విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ తర్వాతే పాఠశాలలు తెరవాలి. పదో తరగతి విద్యార్థులకు 5 నుంచి 10 శాతం మించి వ్యాక్సిన్‌ వేయలేదు. సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ సోకి చాలా మంది ఉపాధ్యాయులు మృతి చెందారు. వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

- జి.ఓంకార్‌ యాదవ్‌,ఆంధ్రప్రదేశ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు

ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు?

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పాఠశాలలను తెరవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. 12 రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మన ప్రభుత్వం సెలవులను ప్రకటించమని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? టీకా వేయించుకున్న వాళ్లకు కూడా మళ్లీ వైరస్‌ సోకుతోంది.

 - రంగన్న, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2022-01-22T05:44:15+05:30 IST