బడులు ఇలా.. చదివేదెలా ?

ABN , First Publish Date - 2021-01-21T06:13:18+05:30 IST

గతంలో ప్రతి పాఠశాలకు ఒక పారిశుధ్య కార్మికుడు ఉండేవారు.

బడులు ఇలా.. చదివేదెలా ?
ప్రారంభానికి సిద్ధమైన నల్లగొండలోని రామగిరి పాఠశాల

పునః ప్రారంభం కానున్న తరగతులు

అపరిశుభ్రంగా బడులు

పారిశుధ్య, పంచాయతీ విభాగాలకు నిర్వహణ బాధ్యత

చేయలేమంటున్న  కార్మికులు 

వచ్చేనెల 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచి 9వ, 10వ తరగతుల విద్యార్థులకు నేరుగా విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ తరగతులతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు ఇది శుభవార్తే అయినప్పటికీ కొవిడ్‌ కారణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చాలా పాఠశాలలు సుమారు 10 నెలలుగా మూతపడి ఉన్నాయి. దీంతో చెత్తా, చెదారంతో నిండి, బెంచీలు, ఫర్నిచర్‌, ల్యాబ్‌ పరికరాలు దుమ్ము పట్టి ఉన్నాయి. అయితే పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను పంచాయతీ, మునిసిపల్‌ కార్మికులకు ప్రభుత్వం అప్పగించగా, పనులు చేసేందుకు సిబ్బంది ఒప్పు కోవడంలేదు. దీంతో ఉపాధ్యాయులు తల పట్టుకుంటున్నారు. 

మిర్యాలగూడ టౌన్‌/మోత్కూరు, జనవరి 20: గతంలో ప్రతి పాఠశాలకు ఒక పారిశుధ్య కార్మికుడు ఉండేవారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యననుసరించి ప్రభుత్వం అతనికి రూ.2వేల నుంచి రూ.2500 ఇచ్చేది. అతనే మూత్రశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదులు శుభ్రపర్చేవాడు. ఈ ఏడాది ప్రభుత్వం వారిని తొలగించి పంచాయతీ, మునిసిపల్‌ పారిశుధ్య కార్మికుల చేత శుభ్రం చేయించుకోమంటోంది. అందుకు వారు ఒప్పుకోవడంలేదు. ఈవిషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు, సర్పంచ్‌లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. 


తరగతుల ప్రారంభానికి సిద్ధమవుతోన్న విద్యాశాఖ 

కరోనా ఉధృతి తగ్గడం, వాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో రెగ్యులర్‌ తరగతులను ఆరంభించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో 1100 ఉన్నత పాఠశాలలు ఉండగా, 9, 10 తరగతుల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు సుమారు 86వేల మంది ఉన్నారు. ఇంటర్‌ కళాశాలలు ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు 70 వరకు ఉండగా, వీటిలో 1.20 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 90 డిగ్రీ కళాశాలలు ఉండగా, 47 వేల మంది విద్యార్థులు ఉన్నారు. 32 బీఈడీ కళాశాలల్లో 7వేల మంది, ఇంజనీరింగ్‌ విద్యార్థులు 3వేల మంది ఉన్నారు. వీరంతా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బడిబాట పట్టనున్నారు. ఈ తరుణంలో పాఠశాలల శుభ్రతపై విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకు కారణం ఏళ్ల తరబడి సర్కారు బడుల్లో దిగువస్థాయి సిబ్బంది నియామకం జరగకపోవడమే. సుమారు 10 నెలలుగా పాఠశాలలు మూతబడి ఉన్న విషయం తెలిసిందే. అయితే అరకొర వసతుల నడుమ నిర్వహించే ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్‌గా తరగతులు నిర్వహించే సమయంలోనే పరిశుభ్రత అంతంత మాత్రంగా ఉంటుంది. కరోనా కారణంగా నెలల తరబడి మూతబడిన పాఠశాలల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. తరగతి గదులు, అందులో బెంచీలు, బ్లాక్‌ బోర్డులు దుమ్ము, దూళితో నిండిపోయాయి. ఆయా పాఠశాలలను శుభ్రపరచడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారంలా మారింది. ఒక వైపు కరోనా కంగారు, మరో వైపు అపరిశుభ్రంగా ఉన్న పాఠశాలలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. 


స్కావెంజర్ల తొలగింపుతో

ప్రభుత్వ పాఠశాలల్లో ఏళ్ల తరబడి స్వీపర్లు, వాచ్‌మెన్లు, స్కావెంజర్ల నియామకం చేయని ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం తాత్కాలిక పద్ధతిలో స్కావెంజర్లను నియమించింది. నెలవారీ వేతనం రూ.2వేలు చెల్లించేది. అయితే నిధుల కొరత కారణంగా రెండేళ్ల క్రితం వారిని తొలగించింది. శాశ్వత సిబ్బందిని నియమించాల్సిన ప్రభుత్వం ఉన్నవారినే తొలగించడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులూ ఇబ్బందులు పడుతున్నారు. 


పాఠశాల నిధులు అంతంత మాత్రంగానే

నల్లగొండ జిల్లాలో 512 ఉన్నత పాఠశాలలుండగా ఆయా బడులకు అందించే నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఎస్‌ఎంసీ చైర్మన్లు పేర్కొంటున్నారు. స్కూల్‌ గ్రాంటు కింద ప్రభుత్వం రూ.10 వేలను అందిస్తోంది. విద్యార్థుల సంఖ్య అఽధికంగా ఉంటే రూ.15వేలు అందజేస్తుంది. ఆ నిధులతోనే పాఠశాలల విద్యుత్‌ బిల్లు చెల్లించడంతోపాటు చాక్‌పీసులు, పెన్నులు తదితర వస్తువులను కొనుగోలుచేస్తారు. గ్రాంటు ఎక్కువగా ఉంటే అందులో కొంత మిగిల్చి తాత్కాలిక సిబ్బందిని నియమించి పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే వారమని, విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన హెచ్‌ఎం, ఉపాధ్యాయులుకు బోధనేతర పనులు అప్పగించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. 



తొలగింపు సబబు కాదు : టి.నర్సింహమూర్తి, టీఎ్‌సయూటీఎఫ్‌ ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌, మోత్కూరు మండలం  

ప్రభుత్వం పాఠశాలల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులను తొలగించి ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోంది. విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు, సర్పంచ్‌లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలి.

Updated Date - 2021-01-21T06:13:18+05:30 IST