బడులు, జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-08-26T06:18:07+05:30 IST

కొవిడ్ మహమ్మారి ప్రవేశించి ఏడాదిన్నర అయింది. పోయిన విద్యాసంవత్సరం అంతా ప్రత్యక్ష తరగతులు లేవు. తప్పనిసరి తరగతులకు తప్ప పరీక్షలు లేవు. ఇళ్లల్లో బందీలుగా మారిన పిల్లలు, ముఖ్యంగా పూర్వ ప్రాథమిక...

బడులు, జాగ్రత్త!

కొవిడ్ మహమ్మారి ప్రవేశించి ఏడాదిన్నర అయింది. పోయిన విద్యాసంవత్సరం అంతా ప్రత్యక్ష తరగతులు లేవు. తప్పనిసరి తరగతులకు తప్ప పరీక్షలు లేవు. ఇళ్లల్లో బందీలుగా మారిన పిల్లలు, ముఖ్యంగా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయి పిల్లలు, పదిమందిలో మెలిగే అవకాశం లేక, విసిగిపోయి ఉన్నారు. ఆన్‌లైన్ తరగతుల ప్రయోజకత్వం ఎంతో తెలియదు కానీ, పిల్లలకు కళ్లసమస్యలు, మానసిక సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఎదిగే పిల్లల మనస్సులపై, తెలివితేటలపై దుష్ప్రభావాలు పడే అవకాశముంది. ఉన్నత తరగతుల విద్యార్థుల అభ్యసనం ఎంతగా దెబ్బతింటుందో చెప్పలేము. అందువల్లనే, వెంటనే తరగతులు ప్రారంభిస్తే బాగుండునన్న అభిప్రాయం సమాజంలో వ్యక్తం కావడం, ప్రభుత్వాలు వెంటనే అందుకు తగ్గట్టుగా స్పందించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచే ప్రాథమిక స్థాయి నుంచి ఎగువకు ప్రభుత్వ పాఠశాలలన్నిటిని తెరిచారు. తరగతులు ప్రారంభించే విషయంలో స్వేచ్ఛ పొందిన ఎ.పి. ప్రైవేటు విద్యాసంస్థలు కొన్ని తెరచుకున్నాయి, మరి కొన్ని ఇంకా పరోక్ష విద్యాబోధననే కొనసాగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి కేజీ నుంచి పీజీ దాకా విద్యాసంస్థలన్నీ తెరుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్ష తరగతుల పునఃప్రారంభం నేపథ్యంలో తీసుకోవలసిన కొవిడ్ సంబంధిత జాగ్రత్తలను, మార్గదర్శకాలను ప్రకటించారు.


ముందుజాగ్రత్తలు అంటే, పాఠశాలలను, పరిసరాలను పరిశుభ్రీకరించడం మాత్రమే అనుకుంటే పొరపాటు. మూతులకు ముసుగులు, చేతులకు శుభ్రజలం ఉంటే సరిపోదు. పాఠశాలలు పునః ప్రారంభించాలంటే యోచించవలసిన అంశాలు మొత్తం దేశానికి, రాష్ట్రాలకు, జిల్లాలకు సంబంధించినవి. ప్రస్తుతానికి కొవిడ్ ఉధృతి తగ్గినప్పటికీ, అది పూర్తిగా వైదొలగలేదు. మూడవ విడత, నాల్గవ విడత మళ్లీ విజృంభించవచ్చునని అంటున్నారంటే అందుకు కారణం, మనదేశంలో టీకాకరణ కార్యక్రమం వేగంగా జరగడం లేదు. పూర్తి టీకాకరణ జరిగిన వారి సంఖ్య జనాభాలో 10 శాతం కూడా లేదు. టీకాకరణతో పాటు, వ్యాప్తి నిరోధానికి పనికి వచ్చేది యాంటీబాడీల ఉనికి. సెరో సర్వేల ఫలితాలు ఒక్కోచోట ఒక్కోరకంగా ఉన్నాయి. యాంటీబాడీల ఉనికి ఒక్కోచోట 60 శాతం దాకా, మరి కొన్ని చోట్ల చాలా తక్కువ ఉన్నాయి. అంటే కనీసం 30-, 40 శాతం ప్రజలు ఇంకా వ్యాధివ్యాప్తికి అందుబాటులో ఉన్నారు. టీకాకరణ వేగంగా జరగకపోవడం వల్ల, వైరస్ కొత్త ఉత్పరివర్తనాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. వ్యాధినిరోధక కణాలు ఉన్నవారు కూడా కొత్త ఉత్పరివర్తనాలను తట్టుకోలేకపోవడం కనిపిస్తుంది. పద్ధెనిమిదేండ్ల లోపు వారికి టీకాలు వేసే కార్యక్రమం ఇంకా దేశంలో ప్రారంభమే కాలేదు. వారిలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువే అయినప్పటికీ, కొత్త వైరస్ రూపాలు వారికి కూడా సోకుతున్నాయి. విద్యాసంస్థలంటే పిల్లలు మాత్రమే కాదు కదా, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అంతా. వయోజనుల నుంచి వయోజనులకు వ్యాప్తికి విద్యార్థులు కూడా వాహకాలు అవుతారు. ఈ నేపథ్యంలో వ్యాధివ్యాప్తికి అవకాశమిచ్చే సమూహ కార్యక్రమాలు ఏవైనా ప్రమాదమే. ప్రస్తుతం వ్యాధి ఉధృతి తగ్గింది కాబట్టి, పాఠశాలలను ప్రారంభించవలసిందే కానీ, ఎంపిక చేసిన చోట్ల మాత్రమే ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడైతే టీకాకరణ మెరుగుగా ఉందో, ఎక్కడైతే, వ్యాధినిరోధక కణాల ఉనికి మెరుగుగా ఉన్నదో అక్కడ స్కూళ్లను తెరచిచూడవచ్చు. కొన్ని పాఠశాలలను ప్రయోగపద్ధతిని ప్రారంభించి ఫలితాలను పరిశీలించవచ్చు కూడా. వ్యాధి నిరోధకశక్తి అత్యధికంగా ఉండేవారు ఆరు నుంచి 11 ఏళ్ల వయస్సు మధ్యవారు కాబట్టి, మొదట ప్రాథమిక తరగతులను ప్రారంభించి వ్యాప్తి అవకాశాలను పరిశీలించాలన్న సూచన కూడా కొందరు చేశారు. కొవిడ్ లాక్‌డౌన్‌ల తరువాత, మొదటగా పాఠశాలలను తెరచింది ఇంగ్లండ్. అక్కడ అతి వేగంగా టీకాకరణ కార్యక్రమం జరిగింది కాబట్టి, ఎటువంటి సమస్యలు రాలేదు. అదే అమెరికాలో టీకా కార్యక్రమం మందకొడిగా ఉన్న టెక్సస్, ఫ్లారిడా రాష్ట్రాలలో విద్యాసంస్థల ప్రారంభం కొత్త వ్యాప్తికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల ప్రారంభం కారణంగా కొత్త వ్యాప్తి కొన్ని చోట్ల, ముఖ్యంగా కృష్ణా, ప్రకాశం జిల్లాలలో కనిపిస్తోంది.


పాఠశాలలకు వచ్చే పిల్లలందరికీ జ్వరమానిని ద్వారా పరీక్షించే ప్రయత్నం కూడా మనం చేయడం లేదు. విద్యాసంస్థలకు సంబంధించిన సమస్త సిబ్బంది, బడి వాహనాల డ్రైవర్లతో సహా, టీకాలు వేయించుకుని తీరాలని నిబంధన కూడా పెట్టడం లేదు. ఇక ప్రభుత్వ పాఠశాలల దగ్గర మంచినీళ్లే లేవు, మరుగుదొడ్లే లేవు, ఇక పారిశుద్ధ్య జాగ్రత్తలు ఏమి తీసుకుంటారన్న సందేహం ఉండనే ఉన్నది. మూకుమ్మడిగా అన్ని తరగతులకు అన్ని చోట్లా పాఠశాలలను తెరవడంలో ఎటువంటి తర్కమూ లేదు, ఎటువంటి శాస్త్రీయమైన విచక్షణా లేదు, తీసుకుంటున్న ఏ జాగ్రత్తా లేదు. లాక్‌డౌన్‌ల విధింపుల్లో, ఎత్తివేతల్లో ఎటువంటి యథాలాప ధోరణి అనుసరించారో దానినే పాఠశాలల విషయంలో కూడా అనుసరిస్తున్నారనిపిస్తోంది.


పాఠశాలలు తెరిచే ప్రక్రియను ప్రారంభించవలసిందే. కానీ, తగిన జాగ్రత్తలతో, దశలవారీగా, నిపుణుల పర్యవేక్షణ కింద చేయాలి.

Updated Date - 2021-08-26T06:18:07+05:30 IST