బెడిసికొట్టిన వైసీపీ ఏకగ్రీవం వ్యూహాలు.. ఇక సమరమే..!

ABN , First Publish Date - 2021-10-06T05:41:47+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికను..

బెడిసికొట్టిన వైసీపీ ఏకగ్రీవం వ్యూహాలు.. ఇక సమరమే..!

బద్వేలు బరిలో కాంగ్రెస్‌

అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మ 

అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం

7న నామినేషన్‌ దాఖలు చేసేలా సన్నాహాలు

నేడో రేపో బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం

8న నామినేషన్ల దాఖలుకు ఆఖరు


(కడప-ఆంధ్రజ్యోతి): బద్వేలు ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే అధికార పార్టీ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఉప పోరుకు కాంగ్రెస్‌ సై అంది. పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎంపీ కమలమ్మను ఎంపిక చేశారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యిదర్శి ముకుల్‌ వాస్నిక్‌ అధికారికంగా ప్రకటించారు. 7వ తేదీన నామినేషన్‌ వేస్తున్నట్లు తెలిసింది. బద్వేలు 2009లో ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వ్‌ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కమలమ్మ 78,486 ఓట్లు సాధించి.. సమీప టీడీపీ అభ్యర్థి లక్కినేని చెన్నయ్యపై 36,594 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి 41,894 ఓట్లు వచ్చాయి. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం జగన్‌ వైసీపీ స్థాపించినా.. ఆమె కాంగ్రె్‌సలోనే కొనసాగారు. తాజాగా ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య ఆనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోటపాటి లక్షుమయ్యతో పాటు ఆరుగురు టికెట్‌ కోసం దరఖాస్తు చేశారు. వీటిని పరిశీలించిన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కన్వీనర్‌ షేక్‌మస్తాన్‌వలి సారథ్యంలోని అభ్యర్థి ఎంపిక కమిటీ ప్రాధాన్యత ప్రకారం పార్టీ అధిష్టానికి పంపారు. కమిటీ సిఫారసు, దరఖాస్తుదారుల పూర్వ రాజకీయ అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం కమలమ్మకే తొలిప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థిగా ఎంపిక చేశారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.


అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు

బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీకే మొగ్గు చూపుతోంది. బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ టికెట్‌ ఆశిస్తూ మాజీ ఎమ్మెల్యే త్రివేది జయరాములు, పెనగలూరు మండలానికి చెందిన బీజేవైఎం జాతీయ కార్యదర్శి కనతల సురే్‌షతో పాటు మరో నలుగురు దరఖాస్తు చేసినట్లు ఆ పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. వీటిని పరిశీలించి జాతీయ అధ్యక్షులు నడ్డాకు పంపించినట్లు సమాచారం. బుధవారం సాయంత్రంలోగా అభ్యర్థిని ఖరారు చేయవచ్చని అంటున్నారు. బద్వేలు పోరులో తాము సత్తా చాటుతామని, వైసీపీ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు రాజకీయాలు ఇక్కడ చెల్లవని ఈ ఎన్నికలతో రుజుచేస్తామని బీజేపీ కిసాన్‌ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు వంగళ శశిభూషణ్‌రెడ్డి బద్వేలులో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. కాగా.. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టరు దాసరి సుధాకు వైసీపీ టికెట్‌ ఇవ్వడంతో తాము బీజం వేసిన రాజకీయ సంప్రదాయానికి కట్ట్టుబడి టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. జనసేన కూడా అదే బాటలో పయనించింది. కాంగ్రెస్‌, బీజేపీ పోటీకి సై అనడంతో త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 


జగన్‌ రెండేళ్ల పాలన వైఫల్యాలను ఎండగడతాం: నర్రెడ్డి తులసిరెడ్డి, పీసీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎంపీ కమలమ్మను అధిష్టానం ఎంపిక చేసింది. ఈ ఎన్నికల్లో సీఎం జగన్‌ రెండేళ్ల పాలనలో వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎలా విఫలమైందో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు వివరిస్తాం. కాంగ్రెస్‌ సత్తాను చాటుతాం. 


మరో నామినేషన్‌..

బద్వేలు: బద్వేలు ఉప ఎన్నికకు మంగళవారం మరో నామినేషన్‌ దాఖలైంది. ఈ మేరకు తహశీల్దారు కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా జల్లి రాజేష్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌ గార్గ్‌కు అందజేశారు.

Updated Date - 2021-10-06T05:41:47+05:30 IST