Badvel By-Poll : వైసీపీ టార్గెట్ లక్ష మెజారిటీ.. భారీగా బెట్టింగ్‌లు.. మధ్యాహ్నానికే తేలిపోనున్న ఫలితం..

ABN , First Publish Date - 2021-11-02T11:55:09+05:30 IST

బద్వేలు బరిలో ఎవరి బలం ఎంతో నేడు తేలనుంది. ఉప ఎన్నిక ఫలితం కంటే..

Badvel By-Poll : వైసీపీ టార్గెట్ లక్ష మెజారిటీ.. భారీగా బెట్టింగ్‌లు.. మధ్యాహ్నానికే తేలిపోనున్న ఫలితం..

  • బద్వేలులో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి 
  • ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు
  • నాలుగు కేంద్రాల్లో కౌంటింగ్‌ 
  • ఒక్కో కేంద్రంలో ఏడు టేబుళ్లు
  • గరిష్ఠంగా 12 రౌండ్లకు లెక్కింపు సాగే అవకాశం
  • మధ్యాహ్నానికే వెలువడనున్న ఫలితం

కడప జిల్లా/బద్వేలు : బద్వేలు బరిలో ఎవరి బలం ఎంతో నేడు తేలనుంది. ఉప ఎన్నిక ఫలితం కంటే పోటీ చేసిన ప్రధాన పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు, గెలిచే వారి మెజార్టీ ఎంత, రెండో స్థానంలో నిలబడే పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చు అనే దానిపైనే ఉత్కంఠ సాగుతోంది. శనివారం జరిగిన పోలింగ్‌ ఓట్ల లెక్కింపును మంగళవారం చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌ సోమవారం కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలుకానుంది. కౌంటింగ్‌ ఒక హాలులో కాకుండా నాలుగు హాళ్లలో చేపట్టనున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఇలాంటి ఏర్పాట్లు చేశారు. నాలుగు హాళ్లలో ఒక్కో హాలుకు ఏడు టేబుళ్లు ఏర్పాటు చేశారు.


మొత్తం 2,15,392 ఓట్లకు గాను 1,46,562 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్ల ప్రకారం దాదాపు అన్ని టేబుళ్లతో పది రౌండ్లు కౌంటింగ్‌ నుంచి గరిష్ఠంగా 12 రౌండ్ల వరకు సాగే అవకాశం ఉంది. కౌంటింగ్‌ కేంద్రంలో ఆర్వో, ఏఆర్‌వో, సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు, అబ్జర్వర్‌ పర్యవేక్షణ ఉం టుంది. అన్ని టేబుళ్లతో ఒక్కొక్క రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత వాటిని అన్నింటిని జోడించి ఆ రెండు ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత తుది ఫలితాల రౌండ్‌ కౌంటింగ్‌ ఒకదానికొకటి చేస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు, వికలాంగుల పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కౌంటింగ్‌కన్నా ముందే లెక్కిస్తారు. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌ సిబ్బంది పర్యవేక్షణలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు, జనరల్‌ ఏజెంట్లు కూడా కౌంటింగ్‌లో అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు సూచనలు ఇచ్చారు.


వైసీపీ, బీజేపీలో ఉత్కంఠ

ఉప ఎన్నికలో పోటీ చేసిన ప్రధాన పార్టీలు వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ప్రధానంగా వైసీపీ, బీజేపీలోనే ఉత్కంఠ ఏర్పడింది. వైసీపీ నేతలు లక్ష మెజార్టీ లక్ష్యంగా పెట్టుకోవడం, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా ఓట్లను పొందడం కోసం ఉప ఎన్నికలో హోరాహోరీగా ప్రచారంతో తలపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేసినా ఆమె మెరుగైన ఓట్లు తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నం చేశా రు. అధికార బలంతో పోలింగ్‌కు వెళ్లిన వైసీపీ లక్ష మెజార్టీ కోసం తీవ్ర కసరత్తు చేసింది. ఆ పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు బద్వేలులోనే మకాం వేశారు. పోలింగ్‌ రోజు కూడా బయటవారిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. లక్ష మెజారిటీ టార్గెట్‌గా వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. బీజేపీ నేతలు సైతం ప్రముఖ నేతలతో ప్రచారం చేశారు.


వైసీపీ పెట్టుకున్న మెజార్టీ లక్ష్యాన్ని గట్టిగా దెబ్బకొట్టే విధంగా ప్రయత్నాలు చేశారు. దీంతో ఈ రెండు పార్టీలే ఉప ఎన్నికలో ప్రధాన చర్చగా మారాయి. బీజేపీకి 20 వేల ఓట్లు వస్తాయని కొందరు, రావ ని కొందరు, వైసీపీకి 80 వేల నుంచి లక్ష వరకు మెజార్టీ వస్తుందని కొందరు, రావని కొందరు గత మూడు రోజులుగా కోట్ల రూపాయలు పందేలు కాశారు. పందెం కాసిన వారిలో ప్రముఖులు ఉన్నారని తె లుస్తోంది. బద్వేలు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తిగా మారింది. ఎన్నికలలో ఎప్పుడూ గెలుపోటములపై, మెజార్టీపైనే పందేలు జరిగేవి. కాకపోతే ఈ ఉప ఎన్నిక రావడంతో వైసీపీ మెజార్టీ, బీజేపీకి దక్కే ఓట్లపైనే ఎక్కువ పందేలు కాశారు. మరికొన్ని గంటల్లో తేలనున్న ఓట్ల లెక్కింపు ఫలితాలు ఎవరి అంచనాలను తలకిందులు చేస్తాయో, పందెం రాయుళ్లలో ఎవరిని ముంచుతాయో వేచి చూడాలి.

Updated Date - 2021-11-02T11:55:09+05:30 IST