Abn logo
Sep 19 2021 @ 01:30AM

అధ్యక్ష పదవికోసం బాహాబాహీ

రహదారిపై రాస్తారోకో చేస్తున్న కార్యకర్తలు

టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల్లో ఘర్షణ 

డీసీసీబీ చైర్మన్‌పైకి కుర్చీలు విసిరిన నేతలు

రాళ్లతో దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేసిన కార్యకర్తలు 

తుర్కపల్లి మండల అధ్యక్షుడిగా మర్కెట్‌ మాజీ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, 

పీఏసీఎస్‌ చైర్మన్‌ పిన్నెపు నరేందర్‌రెడ్డి మధ్య తీవ్రపోటీ 


యాదాద్రి/తుర్కపల్లి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్ని కల్లో శుక్రవారం ఘర్షణ, రసాభసా చోటుచేసుకుంది. ఆలేరు నియోజకవర్గ నేతల్లో అంతర్గతంగా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. కుర్చీలు గాల్లో ఎగిసి, రాళ్లతో దాడులు చేసుకుని వరకూ వెళ్లింది. గ్రామకమిటీలు అంతా కూడా సజావుగా పూర్తికాగా, మండల కమిటీ నియామకం విషయంలో పార్టీలోని పెద్దలపైకి స్థానిక నేతలు ధిక్కార స్వరాన్ని వినిపించారు. తుర్కపల్లి మండల కమిటీ అధ్యక్షుడి ఎన్నికల విషయంలో ఘర్షణ నెలకొంది. ఏకపక్షంగా మండల అధ్యక్షుడిని ప్రకటించారని నిరసన వ్యక్తంచేస్తూ డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిపైకి పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసిరారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. అడ్డుకున్న అతని గన్‌మెన్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. సమావేశం నుంచి మహేందర్‌రెడ్డి బయటకు వెళ్తుండగా ఆయనకు వ్య తిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు డీసీసీబీ చైర్మన్‌ కారును అడ్డుకుని రాళ్లదాడిచేశారు. కారుపై మట్టి పోశారు. కాసేపటి వరకు స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను చెదరగొట్టి,మహేందర్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించారు. 


అధ్యక్షుడి ఎన్నికకు తీవ్ర పోటీ నేపథ్యంలో 

తుర్కపల్లి మండల అధ్యక్షుడితోపాటు కార్యవర్గాన్ని, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసేందుకు శనివారం ఉదయం 11గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ప్రస్తుత మండల అధ్యక్షుడు, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పిన్నెపు నరేందర్‌రెడ్డి మధ్య తీవ్రంగా పోటీనెలకొంది. మరోసారి శ్రీనివా్‌సకు అవకాశం కల్పించాలని కొంతమంది నేతలు, ఈసారి కొత్తగా వారికి ఛాన్స్‌ ఇవ్వాలని మరికొందరు సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారం రోజులుగా ఈ కమిటీ ఎన్నిక విషయమై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. అయితే అప్పటికే పార్టీ అనుబంధ కమిటీలన్నీ కూడా పూర్తిచేసిన నేతలు, మండల పార్టీ అధ్యక్షుడితోపాటు యువజన, బీసీ విభాగం అధ్యక్ష పోస్టుల విషయంలో పోటీ తీవ్రంగా నెలకొంది. మండల అధ్యక్షుడిగా మండలంలోని పలువురు సీనియర్‌ నేతలు 10మంది వరకు పోటీ పడ్డారు. అయితే పడాల శ్రీనివాస్‌, నరేందర్‌రెడ్డిల మధ్యనే ఉత్కంఠ పోరు నడిచింది. మండల పార్టీలోని అందరికి సయోధ్య కుదరకపోవడంతో రాత్రి 7.30 వరకు చర్చలు కొనసాగాయి. చివరగా మండల పార్టీ అధ్యక్షుడిగా నరేందర్‌రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. ఒక్కసారిగా సభలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పార్టీలో ముందు నుంచి ఉన్నవారిని కాదని, వేరే వారికి ఎలా అవకాశమిస్తారని కుర్చీలు తీసుకుని స్టేజీ పైకి విసిరారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తుర్కపల్లి చౌరస్తాలోని ధర్నాకు దిగారు. కమిటీ ఎన్నిక విషయంపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని పలువురు టీఆర్‌ఎ్‌సనాయకులు తెలిపారు.