ఎర్రకోట నాదంటూ పిటిషన్.. తోసిపుచ్చిన కోర్టు

ABN , First Publish Date - 2021-12-21T20:35:40+05:30 IST

దేశ రాజధానిలోని ప్రఖ్యాత కట్టడమైన ఎర్రకోటకు తానే చట్టబద్ధమైన వారసురాలినంటూ..

ఎర్రకోట నాదంటూ పిటిషన్.. తోసిపుచ్చిన కోర్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత కట్టడమైన ఎర్రకోటకు తానే చట్టబద్ధమైన వారసురాలినంటూ ఒక మహిళ క్లెయిమ్ చేసుకుంది. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బెంచ్ కొట్టివేసింది. పిటిషనర్ సుల్తాన్ బేగం తనను తాను మెఘల్ రాజు బహదూర్ షా జఫర్-11 మనుమడైన దివగంత మీర్జా మొహమ్మద్ బెదర్ భక్త్ భార్యగా (విడో) పేర్కొంది. తన భర్త 1980 మే 22న చనిపోయినట్టు తెలిపింది. ఢిల్లీలోని ఎర్రకోటకు తాను చట్టబద్ధమైన వారసురాలిననీ, 1957లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టవిరుద్ధంగా ఎర్రకోటను తమ అధీనంలోకి తెచ్చుకుందని సుల్తానా బేగం తెలిపారు. ఎర్రకోటను తనకు తిరిగి అప్పగించాలని, లేని పక్షంలో దానిని భారత ప్రభుత్వం అక్రమంగా తమ అధీనంలో ఉంచుకున్నందుకు 1857 నుంచి ఈరోజు వరకూ తగినంత పరిహారాన్ని చెల్లించాలని ఆమె కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును పిటిషన్‌దారు కోరారు.


ఇన్నేళ్లు ఏం చేస్తున్నారు?

జస్టిస్ రేఖా పల్లి సారథ్యంలోని ఏకసభ్య బెంచ్ ముందుకు సుల్తానా బేగం పిటిషన్ విచారణకు వచ్చింది. కోర్టును ఆశ్రయించడంలో అసాధారణమైన జాప్యం చోటుచేసుకుందని జస్టిస్ పల్లి పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ''బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1857లో మీకు (పిటిషనర్) అన్యాయం చేసిందని చెబుతున్నారు. ఇది జరిగి 150 ఏళ్లకు పైనే అయింది. ఇన్నేళ్లూ ఎందుకు జాప్యం చేశారు? ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నారు?'' అని జస్టిస్ పల్లి ప్రశ్నించారు. అనంతరం పిటిషన్‌ను కొట్టివేశారు.

Updated Date - 2021-12-21T20:35:40+05:30 IST