బహ్రెయిన్‌లో కరోనా ఆంక్షలు ఎత్తివేత!

ABN , First Publish Date - 2021-07-24T17:03:28+05:30 IST

మహమ్మారి కరోనా నుంచి కోలుకుంటున్న గల్ఫ్ దేశం బహ్రెయిన్ నెమ్మదిగా సాధారణ జీవనంవైపు అడుగులేస్తోంది.

బహ్రెయిన్‌లో కరోనా ఆంక్షలు ఎత్తివేత!

మనామా: మహమ్మారి కరోనా నుంచి కోలుకుంటున్న గల్ఫ్ దేశం బహ్రెయిన్ నెమ్మదిగా సాధారణ జీవనంవైపు అడుగులేస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. వ్యాపార సముదాయాలపై ఇన్నాళ్లు ఉన్న ఆంక్షలను తొలగించింది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, కేఫ్స్, జీమ్స్, స్విమ్మింగ్ పూల్స్, బార్బర్ షాప్స్, సెలూన్, స్పాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఔట్‌డోర్ క్రీడా కార్యక్రమాలపై కూడా ఆంక్షలను పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రేటు బాగా తగ్గిన నేపథ్యంలో ఇంతకుముందు ఉన్న ఆరేంజ్ లెవెల్ అలర్ట్‌ను గ్రీన్ లెవెల్‌కు మార్చింది. ఈ మేరకు కరోనాపై ఏర్పడిన నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. 


ప్రభుత్వం ఆమోదించిన కరోనా టీకాలను రెండు డోసులు తీసుకున్న వారు, రెండో డోసు వేసుకుని 14 రోజులు అవుతున్న వారు, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు స్పోర్ట్స్ ఈవెంట్, సినిమాలు, ఇండోర్ ఈవెంట్స్, సమావేశాలకు హాజరు కావొచ్చని కమిటీ పేర్కొంది. అలాగే ఎడ్యుకేషన్, ట్రైనింగ్ సంస్థలు కూడా సామాజిక దూరం, ముఖానికి మాస్క్ ధరించడం వంటి కరోనా నిబంధనలను పాటిస్తూ తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. కాగా, 1.7 మిలియన్ల జనాభా గల బహ్రెయిన్‌లో ఇప్పటివరకు 268,225 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 1,381 మంది చనిపోయారు.            

Updated Date - 2021-07-24T17:03:28+05:30 IST