తెలుగు ప్రవాసుడికి రూ. 40 లక్షల బిల్లు మాఫీ చేసిన బహ్రెయిన్ ఆస్పత్రి!

ABN , First Publish Date - 2021-10-09T17:53:31+05:30 IST

బహ్రెయిన్‌లోని ప్రముఖ సామాజిక సంస్థ తెలుగు కళా సమితి ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకోవడంలో ఎప్పుడు ముందుంటుంది.

తెలుగు ప్రవాసుడికి రూ. 40 లక్షల బిల్లు మాఫీ చేసిన బహ్రెయిన్ ఆస్పత్రి!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బహ్రెయిన్‌లోని ప్రముఖ సామాజిక సంస్థ తెలుగు కళా సమితి ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకోవడంలో ఎప్పుడు ముందుంటుంది. శివ కొండయ్య అధ్యక్ష భాద్యతలు నిర్వహిస్తున్న ఈ సంస్థ కార్యవర్గం ఆధ్వర్యంలో ఒక సంక్షేమ కమిటీని ఏర్పాటు చేసి అభాగ్యులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. నోముల మురళి సమన్వయ కర్తగా ఉన్న ఈ సంక్షేమ కమిటీ తాజాగా ఒక కార్మికుడికి సంబంధించిన క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి తిరిగి స్వదేశానికి పంపించింది. 


నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన 36 ఏళ్ల గంగాధర్ పాష్కం సార్థల పక్షవాత సమస్యతో 2020 ఆగస్టులో స్థానిక కింగ్ హమద్ ఆస్పత్రిలో చేరాడు. పక్షవాతం కారణంగా ఆయన శరీరం ఎడమ వైపు భాగమంతా చచ్చుబడింది. దాంతో ఆస్పత్రి వైద్యులు అతని తలకు సంబంధించి అనేక శస్త్రచికిత్సలు నిర్వహించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు. ఈ విషయం 2020 అక్టోబర్‌లో తెలుగు కళా సమితి దృష్టికి వచ్చింది. దాంతో వెంటనే బహ్రెయిన్‌లోని భారతీయ ఎంబసీకి తెలియజేసింది. ఎంబసీ అధికారులతో పాటు ఆస్పత్రిని సందర్శించి మరిన్ని వివరాలు సేకరించింది. ఈ క్రమంలో గంగాధర్‌కు సరైన వీసా కూడా లేకపోవడం, దానికి సంబింధించి కేస్ కూడా ఉన్నట్లు తెలిసింది.


ఇక దాదాపు ఏడు నెలల సుదీర్ఘ చికిత్స తరువాత కోలుకున్న గంగాధర్.. ఆస్పత్రిలో ఉండగానే ఏప్రిల్ 2021లో కోవిడ్ బారిన పడ్డాడు. దీంతో అత్యవసరంగా మరో పెద్ద ఆస్పత్రి సల్మానియాకి తరలించారు. పూర్తిగా కోలుకున్న గంగాధర్‌ను ఆస్పత్రి డిశ్చార్జ్ చేసినా ఉండటానికి చోటు లేదు. అతని వీసా గడువు కూడా ముగిసింది. పైగా పూర్తి ఆరోగ్యంగా కూడా లేడు. గంగాధర్ చేతిలో చిల్లి గవ్వ లేదు. అంతకుముందు అతడు పని చేస్తున్న చోటు నుండి పారిపోయినందుకు గాను పోలీసు కేసు ఉండడం ప్రతిబంధంగా మారింది.


ఎంబసీ సహకారంతో ఎగ్జిట్ వీసా ఏర్పాటుకు ప్రయత్నం.. 

కింగ్ హమద్ ఆస్పత్రిలో ఏడు నెలల పాటు పొందిన సుదీర్ఘ చికిత్సకు దాదాపు నలభై లక్షల రూపాయల బిల్లు అయింది. ఇది గంగాధర్‌కు స్వదేశానికి రావడానికి అడ్డంకిగా మారింది. దాంతో రంగంలోకి దిగిన తెలుగు కళా సమితి ఈ బిల్లు మాఫీ చేయించడానికి ఇండియన్ ఎంబసీతో కలిసి బహ్రెయిన్ ప్రభుత్వ సంస్థల సమన్వయ సహకారాలతో కృషి చేసింది. ఫలితంగా ఆస్పత్రి యాజమాన్యం బిల్లు మాఫీ చేసింది. అలాగే ఎంబసీ సహకారంతోనే విమాన టికెట్ ఏర్పాటు చేసింది. చివరకు అన్ని అడ్డంకులు అధిగమించి గంగాధర్ అక్టోబర్ 8న బహ్రెయిన్ నుంచి స్వదేశానికి పయనం అయ్యాడు. భారత్ చేరుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అంత్యంత క్లిష్టమైన ఈ కేసు పరిష్కారానికి ఇండియన్ ఎంబసీ నుండి సురేన్ లాల్‌తో పాటు మురళీ నోముల, హరి బాబు విశేష  కృషి చేసారు. వీరితో పాటు సుధీర్, డాక్టర్ బాబు, ఫణి భూషణ్, భీమ్ రెడ్డి తదితరులు కూడా తమ వంతు బాధ్యత నిర్వహించారు. దీంతో దాదాపు ఒక సంవత్సరం పాటు జరిగిన ప్రయత్నాల అనంతరం గంగాధర్ తాజాగా స్వదేశానికి చేరుకున్నాడు.

Updated Date - 2021-10-09T17:53:31+05:30 IST