ఎవరెస్టును అధిరోహించిన బహ్రెయిన్‌ ప్రిన్స్ బృందం! ‌

ABN , First Publish Date - 2021-05-12T19:26:56+05:30 IST

బహ్రెయిన్ ప్రిన్స్‌ మహ్మద్ హమద్ మహ్మద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని 16 మంది స‌భ్యుల బహ్రెయిన్‌ రాయల్‌ గార్డ్‌ బృందం మంగళవారం ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది.

ఎవరెస్టును అధిరోహించిన బహ్రెయిన్‌ ప్రిన్స్ బృందం! ‌

ఖాట్మండు: బహ్రెయిన్ ప్రిన్స్‌ మహ్మద్ హమద్ మహ్మద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని 16 మంది స‌భ్యుల బహ్రెయిన్‌ రాయల్‌ గార్డ్‌ బృందం మంగళవారం ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. దీంతో ఎవరెస్టును అధిరోహించిన తొలి అంతర్జాతీయ బృందంగా ఘ‌న‌త సాధించిన‌ట్లు పర్యాటకశాఖ డైరెక్టర్‌ మీరా ఆచార్య వెల్లడించారు. ప్రిన్స్ బృందం స్థానిక కాల‌మానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం ఉద‌యం 5.30 గంట‌ల నుంచి 6.45 గంట‌ల మ‌ధ్య శిఖ‌రంపై అత్యంత ఎత్తైన ప్రాంతాన్ని చేరుకున్న‌ట్లు తెలిపారు. మార్చి 15న ఖాట్మండు చేరుకున్న బ‌హ్రెయిన్ బృందం.. అప్ప‌టి నుంచి ఎవ‌రెస్టు శిఖ‌ర అధిరోహ‌ణ(సాహసయాత్ర) ప్రారంభించింది. మంగ‌ళ‌వారం ఉదయం విజ‌య‌వంతంగా అధిరోహించింది. ఇదే బృందం 2020 అక్టోబర్‌లో నేపాల్‌లోని లొబుచే, మనస్లు శిఖరాలను కూడా అధిరోహించింది.  


ఇదిలాఉంటే.. 2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపం తర్వాత ఆ దేశ స‌ర్కార్‌ ఎవరెస్టు శిఖరం ఎత్తును మ‌రోసారి కొలవాలని నిర్ణయించింది. ఈ క్ర‌మంలో 2020 డిసెంబర్‌లో చైనా, నేపాల్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా ఎవరెస్టు శిఖరం ఎత్తను కొలిచాయి. దీంతో 1954 నాటి భార‌త‌ లెక్కల కన్నా 86 సెంటీ మీటర్ల ఎత్తు పెరిగినట్లు క‌నుగొన్నాయి. ఆ లెక్కల ప్రకారం ప్రస్తుత ఎవరెస్టు శిఖరం ఎత్తు 8,848.86 మీటర్లు. కాగా, ఎవరెస్ట్‌ సాహసయాత్రకు వెళ్లే వారు త‌మ‌తో పాటు తీసుకెళ్లే ఆక్సిజన్‌ ట్యాంకులను అక్కడే వదిలి వేయకుండా తిరిగి తమ వెంట తీసుకురావాలని నేపాల్‌ మౌంటెనీరింగ్‌ అసోసియేషన్‌(ఎన్‌ఎంఏ) అధికార యంత్రాంగం కోరుతోంది. మహ‌మ్మారి కార‌ణంగా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న విప‌త్క‌ర‌ పరిస్థితుల్లో ఆక్సిజన్‌ ట్యాంకులు కరోనా బాధితులకు ఎంతగానో ఉపయోగపడతాయనేది వారి అభిప్రాయం. అందుకే వాటిని వెనక్కి తీసుకురావాలని సాహసయాత్రికులను కోరుతున్న‌ట్లు ఎన్‌ఎంఏ సీనియర్‌ అధికారి కాల్‌బహదూర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-12T19:26:56+05:30 IST