బెయిల్‌.. జర జాగ్రత్త

ABN , First Publish Date - 2021-08-25T07:29:55+05:30 IST

నిందితులకు బెయిల్‌ మం జూరు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సర్వోన్న త న్యాయస్థానం హైకోర్టులను ఆదేశించింది.

బెయిల్‌.. జర జాగ్రత్త

  • నేరం చేశాడనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయా?
  • బెయిలిస్తే పరారవుతాడా?.. మళ్లీ అదే నేరం చేస్తాడా?
  • న్యాయానికి అన్యాయం జరుగుతుందా?
  • అతడి ప్రవర్తన, నడత ఎలా ఉంది?
  • వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి
  • నేర తీవ్రతను గమనించాలి: సుప్రీం కోర్టు


న్యూఢిల్లీ, ఆగస్టు 24: నిందితులకు బెయిల్‌ మం జూరు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సర్వోన్న త న్యాయస్థానం హైకోర్టులను ఆదేశించింది. ఇందుకు కొన్ని కొలమానాలను కూడా నిర్దేశించింది. నిందితుడు నేరం చేశాడని విశ్వసించే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. హత్యాభియోగం ఎదుర్కొంటున్న ఓ నిందితుడికి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. అతడు బెయిల్‌పై విడుదలైతే పిటిషనర్‌ భద్రత ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడింది. గతంలో కొన్ని కేసుల్లో అతడు బెయిల్‌పై బయటికొచ్చి మళ్లీ నేరాలకు పాల్పడ్డాడని, హైకోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. మరో కేసులో ఇదే హైకోర్టు వేరే నిందితుడికి బెయిల్‌ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. 


సుప్రీం కోర్టు కొలమానాలివీ..

  1.  నిందితుడు నేరం చేశాడని విశ్వసించేందుకు సహేతుక కారణాలు ఉన్నాయా.. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా? 
  2.  అభియోగం తీవ్రత, స్వభావం
  3.  దోషిగా తేలితే ఎంత తీవ్ర శిక్ష పడొచ్చు?
  4.  బెయిల్‌పై విడుదలైతే నిందితుడు పరారయ్యే ప్రమాదం ఉందా?
  5.  నిందితుడి వ్యక్తిత్వం, ప్రవర్తన, నడత
  6.  మళ్లీ నేరానికి పాల్పడే అవకాశముందా?
  7.  సాక్షులను ప్రభావితం చేసే వీలుందా?
  8.  బెయిల్‌ ఇస్తే న్యాయానికి ప్రమాదమా?

Updated Date - 2021-08-25T07:29:55+05:30 IST