Abn logo
Jan 13 2021 @ 01:03AM

ఫెయిల్యూర్లకు బెయిల్ !!

ప్రజా ఉద్యమం

రాజధాని నడిబొడ్డును చుట్టుముట్టింది

దేశవ్యాపితంగా తీవ్రించిన రైతాంగం 

నిరంకుశ పాలకులను ఆగ్రహజ్వాలలతో బంధించింది

చిల్లులు పడ్డ ప్రభుత్వ నౌకను 

లైఫ్‌బోట్లతో ఒడ్డుకు చేర్చటానికి సుప్రీం 

ఫెయిల్యూర్లకు బెయిల్ మంజూరు చేసింది ! 


కోట్లాది మట్టిచీమలు అల్లిన వలలో చిక్కుబడ్డ సింహానికి 

హిరణ్యకునిలా తాత్కాలిక బంధవిముక్తి కలిగిస్తూ 

సుప్రీం బెయిలు మంజూరు చేసింది.


అసెంబ్లీలు పార్లమెంటులు

నేడు బాతాఖానీ షాపులు కాదు

కార్మిక కర్షకుల పాలిట కబేళాలు

శ్రమజీవుల హక్కుల మెడపై వధ్యశాలలు.


ధనస్వాముల పట్ల వల్లమాలిన ప్రేమను కురిపించే కల్ల పాలకులపై 

గొంతెత్తి నినదించే ప్రజాస్వరాలే నల్లచట్టాల పాలిట భాస్వరాలు !


ప్రజలకు న్యాయబద్ధమైన అంతిమ తీర్పునిచ్చేవి 

ఉద్యమం కోర్టులు ! 


ఉక్కిరిబిక్కిరై దిక్కుతోచని

కార్పొరేట్ల రిపబ్లిక్‌ని పబ్లిక్‌గా ధిక్కరించే బహిరంగ సత్యాగ్రహానికి 

వాయిదా పెడుతూ సుప్రీం 

బెయిల్ మంజూరు చేసింది.


జనం తీర్పులో

రుజువైన నేరస్థులను ముద్దాయిలేనంటూ సుప్రీం బెయిల్ మంజూరు చేసింది ! 

దివి కుమార్

Advertisement
Advertisement
Advertisement