‘బెయిల్‌’ రాగానే విడుదల

ABN , First Publish Date - 2021-07-23T08:57:33+05:30 IST

‘బెయిల్‌’ రాగానే విడుదల

‘బెయిల్‌’ రాగానే విడుదల

హైకోర్టు కీలక ఉత్తర్వులు

26 నుంచే అమల్లోకి మార్గదర్శకాలు 

జారీ చేసిన జస్టిస్‌ కె.లలిత 

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): అండర్‌ ట్రయల్‌ ఖైదీలు, నిందితులను న్యాయస్థానాలు బెయిల్‌పై విడుదల చేశాక ఎలాంటి ఆలస్యం లేకుండా వారు విడుదలయ్యేందుకు హైకోర్టు నూతన విధానాన్ని రూపొందించింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత గురువారం కీలక తీర్పు ఇచ్చారు.

తీర్పులో ఏముందంటే....

హైకోర్టు రిజిస్ట్రీ సర్టిఫైడ్‌ ఆర్డర్‌ కాపీలు వేగంగా జారీ చేసేందుకు కృషి చేస్తున్నప్పటికీ.. కాపీలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం, సిబ్బంది కొరత కారణంగా తక్కువ సమయంలో ఆర్డర్‌ కాపీలు జారీ చేయడం కష్టంగా మారింది. జైల్లో ఉన్న నిందితులు చట్టబద్ధంగా బెయిల్‌ పొందిన తరువాత కూడా ఆర్డర్‌ కాపీని పంపడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని కోర్టు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో అండర్‌ ట్రయల్‌ ఖైదీలు, నిందితుల అవస్థలను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ యంత్రాంగం అవసరమని కోర్టు భావిస్తోంది. ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. వ్యక్తుల స్వేచ్ఛను కాపాడటం కోర్టుల రాజ్యాంగబద్ధ విధి. నిందితుల హక్కుల పరిరక్షణకు మన నేర న్యాయవిచారణ వ్యవస్థ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ప్రక్రియ వేగంగా ఉన్నప్పుడే న్యాయాన్ని వేగంగా అందించగలం. వ్యక్తిగత స్వేచ్ఛను అధికరణ 21 పరిరక్షిస్తుంది. ఆ హక్కు నిరాకరణకు గురైతే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతుంది. బెయిల్‌ పిటిషన్లు నిర్ణీత సమయంలో పరిష్కరించాల్సిన హక్కు నిందితులకు ఉంటుంది. ఈ నేపథ్యంలో బెయిల్‌ ఉత్తర్వులు త్వరితగతిన అమలయ్యేందుకు నూతన విధానాలు అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవల ఏపీ హైకోర్టు కోర్టు మాస్టర్లు న్యాయస్థానం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను, తీర్పులను అదేరోజు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రింది మార్గదర్శకాలు జారీ చేయడం సముచితం అని కోర్టు భావిస్తోంది.


మార్గదర్శకాలు ఇవీ..


 పార్టీలు/ న్యాయవాదులు హైకోర్టు వెబ్‌ సైట్‌ నుంచి కేసు వివరాలతో పాటు ఆర్డర్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

నిందితుల తరఫున పూచీకత్తు సమర్పించే సందర్భంలో  హైకోర్టు వెబ్‌ సైట్‌ నుంచి ఆర్డర్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు అడ్వకేట్‌ మెమోలో పేర్కొనాలి. 

సంబంధిత న్యాయస్థానం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ వెబ్‌సైట్‌లోని ఆర్డర్‌ కాఫీని వెరిఫై చేసి, ఆ ఆర్డర్‌ కాపీపై ఆమోదం తెలుపుతూ దానిని న్యాయాధికారి ముందు ఉంచాలి.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కూడా ఈ వ్యవహారంపై సూచనలు తీసుకొని కోర్టుకు సహాయకారిగా ఉండాలి.

ప్రిసైడింగ్‌ అధికారి అదే రోజు అభ్యర్థనను పరిష్కరించి, విడుదల ఆదేశాలను ఈ మెయిల్‌ లేదా ఇతర ఎలకా్ట్రనిక్‌ మోడ్‌ పద్ధతుల ద్వారా జైలు అధికారులకు పంపించాలి.

ముందస్తు బెయిల్‌ కేసుల్లో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రామాణికతను ధృవీకరించాల్సిన బాధ్యత సంబంధిత స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌పై ఉంటుంది. అవసరమైతే అతను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం నుంచి అవసరమైన సూచనలు పొందాలి. అదే రోజు చట్టప్రకారం త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలి.

హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌కు పంపించాలి. కోర్టు ఆదేశాలను అమలు  చేసేలా వారు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను చైతన్యవంతం చేయాలి.

అలాగే హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌) న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను  జిల్లా ప్రధాన న్యాయమూర్తులకు పంపాలి. వారు  ప్రిసైడింగ్‌ ఆఫీసర్లకు ఈ ఉత్తర్వుల గురించి తెలియజేసి అవి అమలయ్యేలా చూడాలి. 

రాష్ట్రంలోని అన్ని బార్‌ కౌన్సిళ్లకు, హైకోర్టు ఉత్తర్వులను జిల్లా ప్రధాన న్యాయమూర్తుల ద్వారా పంపేలా రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ చర్యలు తీసుకోవాలి.

ఈ వ్యవహారంపై హైకోర్టు రిజిస్ట్రార్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేసి హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచాలి.

ఈ ఉత్తర్వులు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయి.

కోర్టు ఆదేశాలు అమలు చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే న్యాయాధికారులు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌) దృష్టికి తీసుకురావచ్చు. ముందస్తు బెయిల్‌ విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను పోలీస్‌ అధికారులు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దృష్టికి తీసుకురావచ్చు. ఆగస్టు 31న జరిగే విచారణలో ఆ విషయాలన్నింటినీ వారు కోర్టు ముందు ఉంచుతారు.

తదుపరి ఆదేశాలు లేదా నిబంధనలు అమల్లోకి వచ్చేవరకు ఈ ఆదేశాలు  అమల్లో ఉంటాయి. 

Updated Date - 2021-07-23T08:57:33+05:30 IST