ఆ త్యాగాల్ని తలచుకుంటూ...

ABN , First Publish Date - 2020-07-31T05:04:54+05:30 IST

హజ్రత్‌ ఇబ్రహీమ్‌, ఆయన కుమారుడు ఇస్మాయిల్‌ ప్రదర్శించిన త్యాగం మానవ చరిత్రలోనే అపూర్వం.

ఆ త్యాగాల్ని తలచుకుంటూ...

హజ్రత్‌ ఇబ్రహీమ్‌, ఆయన కుమారుడు ఇస్మాయిల్‌ ప్రదర్శించిన త్యాగం మానవ చరిత్రలోనే అపూర్వం. వారి త్యాగనిరతిని స్మరించుకుంటూ  ముస్లింలు ‘ఈదుల్‌ అజ్‌హా’ (బక్రీద్‌) పండుగ జరుపుకొంటారు. ఇస్లామ్‌ క్యాలెండర్‌ ప్రకారం జిల్‌హజ్జ మాసం పదవ రోజున ఈ పండుగ జరుగుతుంది. అదే రోజు పవిత్ర మక్కా నగరంలో హజ్‌ ఆరాధనను నిర్వహిస్తారు. 


ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం. మంచి కోసం, మార్పు కోసం, ఉన్నతమైన మానవ సమాజం కోసం పరితపించేవారికి అడుగడుగునా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి బెదిరిపోకూడదు. ఎన్ని కష్టాల పర్వతాలు విరుచుకుపడినా చెక్కుచెదరని మనో నిబ్బరంతో, ఇసుమైనా సడలని ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని ధైర్య స్థైర్యాలతో ముందుకు సాగిన వారే విజయ కేతనం ఎగురవేస్తారు. దీనికి చరిత్రే సాక్ష్యం. 


మహనీయుడైన హజ్రత్‌ ఇబ్రహీమ్‌కు కూడా జీవితంలో ఎన్నో కఠినమైన పరీక్షలు ఎదురయ్యాయి. కానీ అవి వ్యక్తుల నుంచో, మానవ సమాజం నుంచో, పాలకుల నుంచో కాదు. దైవమే ఆయనను పరీక్షించదలచాడు.


ఎలాంటి జనసంచారం లేని ఎడారి ప్రదేశంలో ఇబ్రహీమ్‌ అతని భార్యా బిడ్డలను వదిలేసి రావాలని దైవం ఆదేశించాడు. ఈ పరీక్షను ఇబ్రహీమ్‌ ఎదుర్కొన్నారు. దైవాజ్ఞను శిరసావహించారు. కనీసం నోరు తడుపుకోవడానికి చుక్క నీరు కూడా దొరకని ఎడారిలో అలమటిస్తున్న ఇబ్రహీమ్‌ భార్య బిడ్డలను చూసి, వారి సహన స్థైర్యాలకూ, వారి అచంచల దైవ విశ్వాసానికీ దేవుడు ప్రసన్నుడయ్యాడు. ఆకలి దప్పులు తీర్చే నీటి చెలమ వారి ఎదుట ప్రత్యక్షమయ్యేలా చేశాడు. ఈనాటికీ ప్రపంచంలోని ముస్లింలు తీర్థజలంగా సేవిస్తున్న ఆ నీటి ఊట బావి పేరే ‘జమ్‌జమ్‌’.


ఆ తరువాత ఇబ్రహీమ్‌కు దైవం మరో పరీక్ష పెట్టాడు. ఈసారి కన్నకొడుకును త్యాగం చేయాలని ఆదేశించాడు. ఆ ఆదేశాన్ని కూడా ఇబ్రహీమ్‌ సంతోషంగా తలదాల్చారు. క్షణం ఆలస్యం చెయ్యకుండా తనయుడి మెడమీద కత్తి పెట్టేశారు. దీంతో దేవునిలో కరుణ ఉప్పొగింది. తన ప్రియదాసుడైన హజ్రత్‌ ఇబ్రహీమ్‌పై ఆయన ప్రసన్నత  ప్రసరించింది.


‘‘నా ప్రియ ప్రవక్తా! ఇబ్రహీమ్‌! నువ్వూ, నీ తనయుడూ నా ఆజ్ఞాపాలనకు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీ పట్ల ప్రసన్నుణ్ణి అయ్యాను. ఇక ఈ బలి తతంగంతో నాకు ఏమాత్రం నిమిత్తం లేదు. ఇప్పుడు మీ విశ్వాసం పరిపూర్ణత సంతరించుకుంది. నా ప్రతి ఆదేశాన్ని పాటించడంతో అది రుజువయింది. ఈ శుభ సందర్భంలో... మీ త్యాగ నిరతికి గుర్తుగా స్వర్గం నుంచి పొట్టేలును పంపుతున్నాను’’ అని పలికింది దైవవాణి. తన కుమారుడైన ఇస్మాయిల్‌ స్థానంలో ఆ పొట్టేలును జిబహ్‌ (బలి) ఇచ్చారు ఇబ్రహీమ్‌. ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకొనే పండుగ ‘ఈదుల్‌ అజ్‌హా’ (బక్రీద్‌).


శుభప్రదమైన ఈ పర్వదినాన మనోవాంఛలను త్యాగం చేయాలి. స్వార్థం, అసూయ, ద్వేషాలను త్యజించాలి. దుష్టభావనలకూ, దురాచారాలకూ తర్పణం వదలాలి. సత్యం కోసం, ధర్మం కోసం పాటుపడాలి. ఆ మార్గంలో ఎన్ని కష్ట నష్టాలూ, పరీక్షలూ ఎదురైనా వెరవకుండా ఇబ్రహీమ్‌, ఇస్మాయిల్‌ చేసిన త్యాగాలను మననం చేసుకోవాలి. అవసరమైతే అలాంటి త్యాగాలకు సిద్ధపడాలనీ, దైవ ప్రసన్నత కోసం సర్వస్వాన్నీ అర్పించడానికి సంసిద్ధులు కావాలనీ ఈ పండుగ మనకు సందేశాన్ని ఇస్తోంది.- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-07-31T05:04:54+05:30 IST