Abn logo
Sep 19 2021 @ 14:56PM

పులి చిన్నపై జరిగిన దాడిని ఖండించిన బాలకోటయ్య

విజయవాడ: అమరావతి దళిత జేఏసీ నాయకుడు పులి చిన్నపై జరిగిన దాడిని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ఖండించారు. పలువురు జేఏసీ నాయకులతో కలిసి చిన్నాను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధాని ఉద్యమంలో ఇప్పటి వరకు కేసులు, అరెస్టులు, కోర్టులు వంటి చర్యలకు పాల్పడిన ప్రభుత్వం ఏకంగా దాడికి పాల్పడే  పరిస్థితికి వచ్చిందన్నారు. రాజధాని ప్రాంతంలో పోటీ శిబిరం పెట్టిననాడే దళిత, బహుజన కులాలలో వైషమ్యాలు రేపి దళితులను రాజకీయ పావులుగా వాడుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ఆరోపించారు. రాజధాని ఉద్యమాన్ని ఒక  రాజకీయ పార్టీ ఉద్యమంగా ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఉద్యమకారులు తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా 600 రోజులుగా నిర్వహిస్తున్న ఉద్యమం స్పూర్తిని మరింత సంకల్పంతో కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కింది స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయికి ఎదిగానని చెప్పుకునే ఎంపి నందిగామ సురేష్  స్వగ్రామానికి చెందిన వ్యక్తిపై దాడి చేయించడం సరికాదన్నారు. ఈ సంఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.