రెడీ.. 3న ఫిక్స్‌ అయితే కేసీఆర్‌.. 4 అయితే కేటీఆర్‌!

ABN , First Publish Date - 2021-06-25T19:12:19+05:30 IST

రెడీ.. 3న ఫిక్స్‌ అయితే కేసీఆర్‌.. 4 అయితే కేటీఆర్‌!

రెడీ.. 3న ఫిక్స్‌ అయితే కేసీఆర్‌.. 4 అయితే కేటీఆర్‌!

  • సిద్ధమైన బాలానగర్‌ ఫ్లై ఓవర్‌
  • నాలుగైదు రోజుల్లో స్పష్టత

హైదరాబాద్‌ సిటీ : మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జూలై 4న బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తారని స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే ప్రకటించారు. జూలై 3న ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ తాజాగా సీఎంఓ నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఫ్లై ఓవర్‌ను ఎవరు ప్రారంభిస్తారనే దానిపై సందిగ్ధం ఏర్పడినా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రారంభ తేదీపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ జాం ఎక్కువగా అయ్యే జంక్షన్లలో బాలానగర్‌లోని నర్సాపూర్‌ ఎక్స్‌ రోడ్డు ప్రాంతం ఒకటి. జాతీయ రహదారి 65కు, 44కు ప్రధాన అనుసంధాన మార్గంగా ఉన్న బాలానగర్‌ ప్రధాన రోడ్డులో నిత్యం ట్రాఫిక్‌ కష్టాలుంటాయి. వాటికి చెక్‌ పెట్టేందుకు 2006లో అప్పటి ప్రభుత్వం ప్లైఓవర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. కానీ, అనుమతులు, నిధుల కేటాయింపు లేకపోవడంతో అది ముందుకు సాగలేదు. 


స్ర్టాటజిక్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ (ఎస్‌ఆర్‌డీపీ) లో భాగంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బాలానగర్‌ ప్లైఓవర్‌ నిర్మించడానికి సుమారు రూ.387 కోట్లకు కేసీఆర్‌ సర్కార్‌ అనుమతులిచ్చింది. అందులో భూసేకరణకు రూ.265 కోట్లు కేటాయించగా, రూ. 122 కోట్లతో ప్లైఓవర్‌ నిర్మాణ పనులకు చేపట్టేందుకు 2017 దసరా రోజున మంత్రి కేటీఆర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 20 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు గడువు విధించారు. ప్లైఓవర్‌ను 200 అడుగుల వెడల్పుతో 8 లేన్లతో ప్రతిపాదించగా స్థానిక ట్రేడర్స్‌ తమ స్థలాలను ఇచ్చేందుకు అంగీకరించలేదు.


భూసేకరణ కుదింపుతో... 

గడువు ప్రకారం 2019లోనే ప్లైఓవర్‌ అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, భూసేకరణ ఆలస్యమైంది. బాలానగర్‌లో ఎడమ వైపు 205 ఆస్తులు, కుడి వైపున 152 ఆస్తులు మొత్తం 357 సేకరించాల్సి ఉండగా, పరిహారంపై పలువురు కోర్టుకెక్కారు. తమకు పరిహారం చదరపు గజాల్లో గాకుండా చదరపు అడుగుల్లో ఇవ్వాలంటూ మరికొందరు పట్టుబట్టారు. దీంతో నిర్మాణం ఆలస్యమవుతుండడంతో భూసేకరణపై స్థానిక ఎమ్మెల్యే, మేయర్‌, ఇతర అధికారులను మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దించారు. స్థలాల సేకరణ పూర్తవ్వడంతో ప్లైఓవర్‌ను 200 అడుగుల వెడల్పుతో గాకుండా 150 అడుగులకు తగ్గించి మూడు లేన్లతో నిర్మించారు. భూసేకరణలో జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు నాలుగేళ్లు పట్టింది. 1.13 కిలోమీటర్ల మేర ప్లైఓవర్‌ నిర్మాణం వల్ల మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ పలు జిల్లాలకు ఇండస్ర్టియల్‌ ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. భూసేకరణ కుదించడం వల్ల అంచనా వ్యయం తగ్గింది. రూ.300 కోట్ల లోపు ఖర్చుతోనే నిర్మాణం పూర్తయినట్లు సమాచారం.


చివరి దశకు పనులు

ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తయి బీటీ రోడ్డు, వీధి లైట్ల ఏర్పాటు, డివైడర్లకు రంగులద్దే పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ జూలై 4 వరకు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్‌ హామీనిచ్చారు. అదే రోజు మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని మూడు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారు. జూలై 3 అయితే, సీఎం కేసీఆర్‌ హాజరవుతారని సీఎంఓ తెలపడంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు పూర్తిచేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2021-06-25T19:12:19+05:30 IST