Feb 23 2021 @ 15:13PM

భీష్ముడిగా బాలయ్య!

నటరత్న నందమూరి బాలకృష్ణకు తన తండ్రి ఎన్టీయార్ నటించిన పౌరాణిక చిత్రాలన్నా, ఆయా పాత్రలన్నా ఎంతో ఇష్టం. సందర్భం వచ్చినప్పుడల్లా వాటిని బాలయ్య గుర్తు చేసుకుంటుంటారు. ఎన్టీయార్ జీవితకథ ఆధారంగా బాలకృష్ణ నటించిన చిత్రం `ఎన్టీయార్: కథానాయకుడు`. ఎన్టీయార్ గతంలో నటించిన పలు సినిమాల పాత్రలను బాలయ్య `ఎన్టీయార్: కథానాయకుడు`లో పోషించారు. అందులో భీష్ముడి పాత్ర ఒకటి. అయితే నిడివి ఎక్కువైందనే కారణంతో ఆ పాత్రను సినిమాలో ఉంచలేదు. నేడు (మంగళవారం) భీష్మ ఏకాదశి. ఈ సందర్భంగా తాను నటించిన `భీష్మ` పాత్ర స్టిల్స్‌ను తాజాగా బాలయ్య విడుదల చేశారు.  

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. `భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్నగారు ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే `ఎన్టీయార్: కథానాయకుడు` చిత్రం కోసం భీష్ముని సన్నివేశాలు తీశాము. అయితే నిడివి ఎక్కువ అవడం వలన చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. నేడు భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాన`ని బాలయ్య అన్నారు.